Begin typing your search above and press return to search.

ఒక్క నిమిషం ఆలస్యానికి 'గంట ఓవర్ టైం'.. వైరల్ నోటీస్!

కార్పొరేట్ ఉద్యోగం అంటేనే టార్గెట్లు, డెడ్‌లైన్లు.. వీటి మధ్యలో దొరికే కాస్తంత విరామమే లంచ్ బ్రేక్. ఆ కాస్త సమయం ఉద్యోగికి ఎంతో ఊరటనిస్తుంది.

By:  Tupaki Political Desk   |   25 Jun 2026 12:16 PM IST
ఒక్క నిమిషం ఆలస్యానికి గంట ఓవర్ టైం.. వైరల్ నోటీస్!
X

కార్పొరేట్ ఉద్యోగం అంటేనే టార్గెట్లు, డెడ్‌లైన్లు.. వీటి మధ్యలో దొరికే కాస్తంత విరామమే లంచ్ బ్రేక్. ఆ కాస్త సమయం ఉద్యోగికి ఎంతో ఊరటనిస్తుంది. కానీ, ఆ బ్రేక్ విషయంలోనూ బాస్ కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుంది? లంచ్ బ్రేక్ అయ్యాక నిమిషం ఆలస్యమైనా పనిష్మెంట్ అంటూ ఓ కంపెనీ బాస్ తీసుకువచ్చిన వింతైన, అమానుషమైన రూల్‌ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఉద్యోగుల పట్ల యాజమాన్యాలు అనుసరిస్తున్న మొండి వైఖరికి ఇది అద్దం పడుతోందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఒక కంపెనీ మేనేజ్‌మెంట్ తమ ఆఫీసు నోటీస్ బోర్డులో ఒక విచిత్రమైన నోటీసును పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఎవరైనా ఉద్యోగులు లంచ్ బ్రేక్ సమయం కంటే ఒక్క నిమిషం అదనంగా తీసుకున్నా, దానికి బదులుగా సదరు ఉద్యోగి ఆ రోజు గంట ఓవర్ టైం పనిచేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ అదనపు పనికి ఎటువంటి అదనపు వేతనం చెల్లించమని స్పష్టం చేసింది. కాబట్టి, ఉద్యోగులు త్వరగా తినడం అలవాటు చేసుకోవాలని హితవు పలికింది. దీంతో ఈ నోటీస్ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెగలు పుట్టిస్తోంది.

ఈ రూల్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ, ‘‘ఒకవేళ పొరపాటున 10 నిమిషాలు లంచ్ బ్రేక్ ఆలస్యమైతే, 10 గంటలు ఓవర్ టైం చేయాలా? అంటే ఆ రోజు రాత్రంతా ఆఫీసులోనే గడపాలన్నమాట!’’ అని ఎద్దేవా చేశారు. మరికొందరు మరింత ఘాటుగా స్పందిస్తూ, ‘బాస్.. ఒకవేళ మాకు జీతం పడడంలో ఒక్క నిమిషం ఆలస్యమైతే, దానికి వడ్డీతో కలిపి అదనపు డబ్బులు ఇస్తారా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఆఫీసా లేక జైలా? అని నెటిజన్లు నిలదీస్తుండగా, భోజనం చేసేటప్పుడు కూడా వాచ్ చూసుకోవాల్సిన దౌర్భాగ్యపు పని వాతావరణంపై ఆవేదన వ్యక్తమవుతోంది.

ఉద్యోగుల సమయాన్ని, శ్రమను తమ సొంత ఆస్తిగా భావించే ఇలాంటి యాజమాన్యాల తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. గతంలో కూడా ఆఫీస్ టైమింగ్స్, డ్రెస్ కోడ్, లీవ్ పాలసీల పేరుతో అనేక మంది యజమానులు ఇలాంటి 'కఠిన నిబంధనలు' పెట్టి నెటిజన్ల చేత చివాట్లు తిన్నారు. వాస్తవానికి, పనివేళల్లో క్రమశిక్షణ ఉండాల్సిందేనని, కానీ మనిషి ప్రాథమిక అవసరాలైన భోజనం వంటి విషయాల్లో ఇంతలా కఠినంగా వ్యవహరించడం మానవీయ కోణంలో సరికాదని నిపుణులు వాదిస్తున్నారు.

ఇలాంటి రూల్స్ అమలు చేయడం వల్ల ఉద్యోగుల ఉత్పాదకత పెరగకపోగా, పనిలో ఒత్తిడి పెరిగి, సంస్థపై విరక్తి కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. యజమాని పెట్టిన ఈ కొత్త నిబంధన ఇప్పుడు ఆ సంస్థ ఉద్యోగుల మధ్య మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో ఒక పెద్ద జోక్‌గా మారింది. ఏదేమైనా, 'త్వరగా తినండి' అని యజమాని ఇచ్చిన సలహా, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులకు ప్రతీకగా నిలుస్తోందని అంటున్నారు. ఇటువంటి నిర్ణయాలు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని, యజమానులు కేవలం సమయాన్ని చూడటమే కాకుండా, ఉద్యోగి శ్రమను కూడా గౌరవించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.