పది లక్షల కోట్ల రుణాలు...ఒక్క దెబ్బతో రద్దు !
పేదవాడు సామాన్యుడు బ్యాంకులకు వెళ్తే వారికి అక్కడ సవా లక్ష నిబంధలు ఎలా ఇబ్బంది పెడతాయో అందరికీ తెలిసిందే. సంతకం చివర చిన్న గీత ఉన్నా మీది కానే కాదంటారు.
By: Satya P | 16 Aug 2026 9:47 AM ISTపేదవాడు సామాన్యుడు బ్యాంకులకు వెళ్తే వారికి అక్కడ సవా లక్ష నిబంధలు ఎలా ఇబ్బంది పెడతాయో అందరికీ తెలిసిందే. సంతకం చివర చిన్న గీత ఉన్నా మీది కానే కాదంటారు. ఇక అప్పులు తీసుకుంటే సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు అసలు ఊరుకోవు. ముక్కు పిండి మరీ వసూలు చేస్తాయి. కానీ అదే బడా బాబులు కార్పోరేట్ పెద్దలు అంటే మాత్రం రుణాలు ఇవ్వడమే తప్ప వసూళ్ళు ఉండవని విమర్శలు ఉన్నాయి. అంతే కాదు వారి రుణాలను మొండి బాకీలుగా రాని బాకీలుగా చూపించి ఏదో రోజున రైట్ ఆఫ్ అంటూ రద్దు చేయడమూ జరుగుతున్న సంగతి తెలిసిందే.
పన్నెండేళ్ళలో జరిగిందిదే :
ఇక కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడచిన పన్నెండేళ్లలో బడా బాబులు తీసుకున్న రుణాలు అక్షరాలా 9, 95 లక్షల కోట్లు అంటే సుమారుగా పది లక్షల కోట్ల రూపాయల రుణాలను రైట్ ఆఫ్ పేరుతో రద్దు చేసి పారేసారు. ఈ వివరాలను అధికారికంగా తెలియచేసింది. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. ఆయన పార్లమెంట్ లో ప్రశ్నకు లిఖిత పూర్వకమైన జవాబు చెబుతూ ఈ వివరాలు వెల్లడించారు ఇందులో చూస్తే అత్యధికంగా 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 1.48,753 కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా పెద్ద పరిశ్రమలు సేవలకు సంబంధించిన బకాయి పడ్డ రుణాలు మొత్తాలు 63,19,057 కోట్లుగా ఉంటే 2026 ఆర్ధిక సంవత్సరంలో ఈ మొండి బకాయిలు 69,21,734 కోట్ల రూపాయలకు పెరిగాయని కేంద్ర మంత్రి అధికారికంగా చెప్పారు. అంటే ఈ రోజున దేశంలో బడా బాబుల రుణాలు దాదాపుగా డెబ్బై లక్షల కోట్ల దాకా ఉన్నాయని అంటున్నారు.
వెసులుబాటు మాత్రమేనట :
అయితే దీని మీద విపక్షాల అభ్యంతరాలకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వివరణ ఇస్తూ ఇది కేవలం బ్యాంకులు తమ ఖాతా పద్దు పుస్తకాలను సరి చేసుకునే ఒక అకౌంటింగ్ ప్రక్రియ మాత్రమే అని అంటున్నారు. దీని వల్ల కార్పోరేట్ సంస్థల రుణాల మాఫీ కానీ రద్దు కానీ జరగదని అంటున్నారు. ఇది కేవలం సాంకేతిక ప్రక్రియ మాత్రమే అని రుణ గ్రహీతలకు ఉప శమనం కలిగించేందుకు రుణాలను పునర్ వ్యవస్థీకరించే విధానం అన్నారు. ఈ మేరకు బ్యాంకులకు విచక్షణాధికారాన్ని ఇస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్యూషన్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్ డైరెషన్స్ 2025 జారీ చేసినట్లుగా కేంద్ర మంత్రి చెబుతున్నారు.
అది రైట్ ఆఫ్ నే :
అయితే సాంకేతికంగా బాలెన్స్ సర్దుబాటు చేసుకున్నాక ఇక కార్పోరేట్లు బడా బాబులు రుణ ఉపశమనం పొందాక ఏ మేరకు తిరిగి తమ రుణాలకు చెల్లిస్తాయో అందరికీ తెలిసిందే అని అంటున్నారు. సామాన్యుడు రుణం తీసుకుంటే వెంట పడి వసూలు చేసే విధానం బడా బాబుల విషయంలోనూ రావాలని అంటున్నారు. లేకపోతే అది తప్పుడు సంకేతాలు వెళ్ళేలా చేస్తుందని అంటున్నారు. ఒక్కసారి ఖాతా పద్దులలో సర్దుబాటు జరిగిన మీదట రుణాలను బడా బాబుల నుంచి వసూలు చేయడం ఎవరి తరం అని అంటున్నారు. ఈ విధంగా పెద్దలకు గద్దలకు అనుగుణమైన తీరుని అనుసరిస్తూ దీనిని ఆర్ధిక క్రమశిక్షణగా చూపించే ప్రయత్నం పట్ల విపక్షాలు అయితే మండిపడుతున్నాయి. పేదలు రైతులకు రుణాల మాఫీ ఎందుకు జరగదని కూడా ప్రశ్నిస్తున్నారు.
