మదర్స్ డే కానుక.. 3 రోజులు పెయిడ్ లీవ్.. రూ. 10,000 నగదు!
పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితమంతా కష్టపడే తల్లిదండ్రులకు సరైన సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు.
By: Tupaki Political Desk | 9 May 2026 1:38 PM ISTకార్పొరేట్ కంపెనీలు ఉద్యోగుల గురించి ఏం ఆలోచిస్తాయని అడిగితే ఏం చెప్తాం.. తక్కువ సాలరీతో ఎక్కువ మొత్తంలో పని చేసే ఉద్యోగులు కావాలి. రోజులో 8 గంటలకు కాదు.. 24 గంటలు (అంతకన్నా ఎక్కువ ఉంటే) పని చేయాలి.. సెలవులు కోరవద్దు.. వేతనాలు పెంచాలని అడగవద్దు.. ఇలా ఆలోచిస్తాయి. కానీ ఒక కంపెనీ మాత్రం దీనికి విరుద్ధం. ఎంప్లాయీస్ గురించే కాదు.. ఎంప్లాయీస్ తల్లిదండ్రుల వరకు కూడా ఆలోచిస్తుంది ఆ కంపెనీ. కార్పొరేట్ ప్రపంచంలో లాభాల కంటే ఎక్కువగా మానవీయ సంబంధాలకు, ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతకు పెద్దపీట వేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ సీఈవో రజత్ గ్రోవర్ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని, కుటుంబ విలువల పట్ల ఆయనకున్న నమ్మకాన్ని చాటిచెబుతోంది. మాతృ దినోత్సవం (మదర్స్ డే) సందర్భంగా ఆయన ప్రకటించిన ఈ వినూత్న కానుక ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
మదర్స్ డే పురస్కరించుకొని ప్రత్యేక ప్రయోజనాలు
ఢిల్లీకి చెందిన కంపెనీ సీఈవో రజత్ గ్రోవర్ తన ఉద్యోగుల కోసం ఒక అద్భుతమైన ప్రకటన చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితమంతా కష్టపడే తల్లిదండ్రులకు సరైన సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు తమ తల్లిదండ్రులతో ఎక్కువ విలువైన సమయాన్ని గడిపేలా ఆయన ఆఫర్లను ప్రకటించారు. మదర్స్ డే సందర్భంగా ఉద్యోగులందరికీ 3 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులను (Paid Leaves) మంజూరు చేశారు. కేవలం సెలవులే కాకుండా, తల్లిదండ్రులను విహారయాత్రలకు లేదా ట్రిప్‌లకు తీసుకెళ్లడానికి ప్రతి ఉద్యోగికి రూ. 10,000 నగదును అందజేయనున్నారు. మన కోసం జీవితాంతం కష్టపడిన తల్లిదండ్రులకు తగిన సమయాన్ని కేటాయించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
గతంలోనూ నిర్ణయాలు వైరల్
రజత్ గ్రోవర్ ఇలాంటి వినూత్నమైన నిర్ణయాలు తీసుకోవడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో దీపావళి పండుగ సందర్భంగా తన ఉద్యోగులకు ఏకంగా 9 రోజుల పాటు సెలవులను ప్రకటించి ఆయన సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. పని ఒత్తిడిలో పడి కుటుంబాలను నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతో ఆయన ఇలాంటి ప్రోత్సాహకాలను క్రమం తప్పకుండా అందిస్తుంటారు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాంటి నిర్ణయాలు ఉద్యోగులలో మానసిక ప్రశాంతతను నింపడమే కాకుండా, సంస్థ పట్ల వారిలో గౌరవాన్ని పెంచుతాయి. తల్లిదండ్రుల పట్ల తనకున్న ప్రేమను తన ఉద్యోగుల ద్వారా కూడా చాటుతున్న రజత్ గ్రోవర్ నిజంగా అభినందనీయులు.
