Begin typing your search above and press return to search.

క్యాంపస్‌లో దారుణాలు.. మత్తులో ముంచి.. రెండేళ్ల తర్వాత వెలుగులోని సంచలన నిజాలు

సంఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత బాధితురాలు యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం సంస్థాగతంగా విచారణ చేపట్టిన కార్నెల్ యాజమాన్యం..

By:  A.N.Kumar   |   28 Sept 2026 4:43 PM IST
క్యాంపస్‌లో దారుణాలు.. మత్తులో ముంచి.. రెండేళ్ల తర్వాత వెలుగులోని సంచలన నిజాలు
X

అమెరికాలోని ప్రముఖ ఐవీ లీగ్ విద్యాసంస్థ కార్నెల్‌ యూనివర్సిటీకి చెందిన ఒక పాత ఘటన మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల క్రితం క్యాంపస్‌లోని ఫ్రాటర్నిటీ హౌస్‌లో ఒక విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి తాజాగా దాఖలైన సివిల్‌ దావా ఈ వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. యూనివర్సిటీ అంతర్గత విచారణ తీరు.. క్రిమినల్‌ కేసులు నమోదు కాకపోవడం.. బాధితురాలు చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు క్యాంపస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

పార్టీలో మత్తు ఇచ్చి దాడి.. సోషల్ మీడియా సందేశాలు

బాధితురాలు కోర్టుకు సమర్పించిన దావా వివరాల ప్రకారం.. 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కార్నెల్‌లోని ఒక ఫ్రాటర్నిటీ హౌస్‌లో ఉన్న స్నేహితుడిని కలిసేందుకు ఆమె వెళ్లింది. అక్కడ తనకు మత్తు పదార్థం ఇచ్చి.. పలువురు విద్యార్థులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. తాను స్పృహ లేని స్థితిలో ఉన్న సమయంలో ఫ్రాటర్నిటీ ఆన్‌లైన్ గ్రూప్‌లో కొందరు అభ్యంతరకర సందేశాలు పంపుకున్నారని.. ఆ సందేశాలను చూసి మరికొందరు వచ్చి తనపై దాడి చేశారని పేర్కొంది. ఈ డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా మెసేజ్‌లు ఇప్పుడు కేసులో అత్యంత కీలకమైన అంశాలుగా మారాయి.

అంతర్గత చర్యలు.. క్రిమినల్ కేసు లేకపోవడంపై ప్రశ్నలు

సంఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత బాధితురాలు యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం సంస్థాగతంగా విచారణ చేపట్టిన కార్నెల్ యాజమాన్యం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు విద్యార్థులలో కేవలం ఇద్దరిపైనే బహిష్కరణ వేటు వేసింది. మిగిలిన వారికి సస్పెన్షన్, వర్క్‌షాప్‌లకు హాజరుకావడం, వ్యాసాలు రాయడం వంటి తేలికపాటి చర్యలతో సరిపెట్టిందని బాధితురాలి తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు టాంప్‌కిన్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించినప్పటికీ క్రిమినల్ అభియోగాలు మోపేందుకు తగిన ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. అయితే ప్రాసిక్యూటర్లు క్రిమినల్ కేసుకు ఆధారాలు సరిపోవని చెప్పిన నేపథ్యంలో బాధితురాలు నష్టపరిహారం కోరుతూ సివిల్ కోర్టును ఆశ్రయించింది.

యూనివర్సిటీ బాధ్యతపై రేగుతున్న కొత్త చర్చ

ఈ దావా కేవలం వ్యక్తిగత ఆరోపణలకే పరిమితం కాకుండా విద్యార్థుల భద్రత విషయంలో యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని కూడా వేలెత్తి చూపుతోంది. ఒప్పంద ఉల్లంఘన, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి అంశాలపై కార్నెల్ యూనివర్సిటీతో పాటు ఆరోపణలు ఉన్న ఫ్రాటర్నిటీ సభ్యుల నుండి పరిహారం కోరుతోంది. ఈ పరిణామాలు విద్యాసంస్థల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదుల నిర్వహణ, పారదర్శక విచారణ.. సంస్థాగత బాధ్యతలపై సరికొత్త చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ఈ సివిల్ దావా కోర్టు విచారణలో ఉంది.