Begin typing your search above and press return to search.

మార్కెట్ మాయాజాలం: బంగారం-వెండి కాదు ఇప్పుడు 'రాగి'కి టైమొచ్చేసింది!

భారీ నిర్మాణాల‌లో రాగి వినియోగం పెరుగుతోంది.. ఇలాంటి స‌మ‌యంలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సుంకాలు `రాగి` మార్కెట్ ని ప్ర‌భావితం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది

By:  Sivaji Kontham   |   8 Sept 2026 9:00 AM IST
మార్కెట్ మాయాజాలం: బంగారం-వెండి కాదు ఇప్పుడు రాగికి టైమొచ్చేసింది!
X

ప్ర‌పంచ వ్యాప్తంగా డేటా సెంట‌ర్లు పెరుగుతున్నాయి.. ప‌వ‌ర్ ప్రాజెక్టులు మ‌ల్టిప్లై అవుతున్నాయి. భారీ నిర్మాణాల‌లో రాగి వినియోగం పెరుగుతోంది.. ఇలాంటి స‌మ‌యంలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సుంకాలు `రాగి` మార్కెట్ ని ప్ర‌భావితం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ స‌న్నివేశం గ్లోబ‌ల్ మార్కెట్లో ఊహించ‌ని ప‌రిణామాల‌కు దారి తీయ‌బోతోంది. బంగారం, వెండి కాదు ఇప్పుడు `రాగి` టైమొచ్చిందన్న చ‌ర్చ వేడెక్కించేస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పారిశ్రామిక లోహమైన రాగి ధరలు ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరి సంచలనం సృష్టించాయి. లండన్ మెటల్ ఎక్స్‌ఛేంజ్ (LME)లో బెంచ్‌మార్క్ కాపర్ ధర టన్నుకు ఏకంగా 14,533 డాలర్ల రికార్డు గరిష్ఠ స్థాయిని తాకింది. గతంలో జనవరిలో నమోదైన 14,527.50 డాల‌ర్ల‌ రికార్డును అధిగమించి.. అనంతరం స్వల్పంగా తగ్గి 14,518 వద్ద స్థిరపడింది. అమెరికా దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) - ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సరఫరా కొరత వల్ల కాపర్ ధరల్లో ఈ ఊహించని భారీ పెరుగుదల నమోదైంది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు భారీగా రాగి నిల్వలను అమెరికాకు తరలించడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. అమెరికా ఆధారిత కామెక్స్ వద్ద కాపర్ నిల్వలు ఏకంగా 7.66 లక్షల షార్ట్ టన్నుల (6.95 లక్షల మెట్రిక్ టన్నులు) రికార్డు స్థాయికి చేరాయి. టారిఫ్‌లపై స్పష్టత వచ్చే వరకు .. సరఫరాలు అమెరికా వైపే ఎక్కువగా మళ్లుతున్నంత కాలం.. అంతర్జాతీయంగా లోహాల ధరలు ఇలాగే అధికంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా మినహా ప్రపంచంలోని ఇతర ప్రధాన మార్కెట్లలో రాగి నిల్వలు దారుణంగా పడిపోవడం వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. చైనాలోని షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్‌ఛేంజ్ (SHFE) వద్ద ఉన్న కాపర్ నిల్వలు మార్చి మధ్య నాటితో పోలిస్తే 85 శాతం తగ్గి కేవలం 63,000 టన్నులకు పడిపోయాయి. ఇది జనవరి 2024 తర్వాత నమోదైన అత్యల్ప నిల్వ స్థాయి. అలాగే ఎల్ఎమ్‌ఈ సిస్టమ్ నుండి మరో 1.21 లక్షల టన్నుల రాగి విత్‌డ్రా కాబోతుండటంతో గ్లోబల్ మార్కెట్‌లో రాగి కొరత మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కేవలం రాగి మాత్రమే కాకుండా.. అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్ బలహీనపడటంతో ఇతర బేస్ మెటల్స్ ధరలు కూడా పుంజుకున్నాయి. జింక్ లోహం 1.1 శాతం పెరిగి టన్నుకు 3,988 డాల‌ర్ల వద్ద స్థిరపడగా (మే 2022 తర్వాత గరిష్ఠ స్థాయి), అల్యూమినియం 0.7శాతం పెరిగి 3,315 డాల‌ర్ల వద్ద.. టిన్ 0.4 శాతం పెరిగి 55,100 డాల‌ర్ల‌ వద్ద ట్రేడ్ అయ్యాయి. మరోవైపు నికెల్ 0.7 శాతం, సీసం 0.3 శాతం స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.