దీదీకే బెంగాలీలు జై.. ఓట్ వైబ్ సర్వే నిజం కాదా?
రాజకీయం ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తమకు ప్రయోజనం కలిగించే అంశాల విషయంలో ఎంతటి కరకు నిర్ణయాలకైనా వెనుకాడవు.
By: Garuda Media | 15 March 2026 6:00 PM ISTరాజకీయం ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తమకు ప్రయోజనం కలిగించే అంశాల విషయంలో ఎంతటి కరకు నిర్ణయాలకైనా వెనుకాడవు. గతానికి భిన్నంగా అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన వేళ..తిమ్మిని బమ్మిని చేయటం ఒక ఆర్ట్. ఇటీవల కాలంలో పోల్ మేనేజ్ మెంట్ రూపురేఖలు పూర్తిగా మారింది. విటమిన్ ఎంను ప్రయోగించాలే కానీ..అబద్ధాల్ని అక్షర సత్యాలుగా ప్రచారం చేసే ప్లాట్ ఫాలకు కొదవలేదు. ఇదంతా ఎందుకంటే.. తాజాగా పశ్చిమ బెంగాల్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాలీలు ఎటువైపు ఉన్నారు? అన్న అంశంపై తాము సర్వే చేశామని.. దాని ఫలితాలు ఇలా ఉన్నాయంటూ ‘‘ఓట్ వైబ్’’ అనే సర్వే సంస్థ తాజాగా వెల్లడించింది. అందులో మమతా బెనర్జీకి సానుకూలత ఉందని.. ఆమెను బెంగాలీ ఓటర్లు ఇప్పటికి ఆదరిస్తున్నట్లుగా పేర్కొంది.
ఈ సర్వే రిపోర్టును చదివినప్పుడు.. జాగ్రత్తగా పరిశీలించినప్పుడు కొత్త సందేహాలు వ్యక్తమయ్యాయి. అందులో ముఖ్యమైనది.. ఈ సర్వే ఎప్పుడు విడుదల చేశారు? ఏ సంస్థ దీన్ని తొలుత పబ్లిష్ చేసింది? ఆ తర్వాత ఇదెన్ని మీడియా వేదికల మీద ఫోకస్ అయ్యిందన్నది మర్చిపోకూడదు. ఈ సందేహాన్ని రివర్సు ఇంజినీరింగ్ ద్వారా వెతకటం చూస్తే.. సర్వేలో పేర్కొన్న అంశాల కంటే కూడా.. ఈ సర్వే సంస్థ.. ముక్కలు ముక్కలుగా పలు మీడియా సంస్థల్లో వార్తల రూపంలో జొప్పించే తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పలు వేదికలను షేర్ చేసుకోవటానికి ముందు విస్మయానికి గురయ్యే మొదటి అంశం.. ఈ సర్వే తొలిసారి జనవరిలో విడుదలైంది. మరింత వివరంగా చెప్పాలంటే.. 2026 జనవరి ఆరున డిజిటల్ ఫ్లాట్ ఫారమ్స్ మీద మొదటిసారి బయటకు వచ్చింది. న్యూస్ టాక్ అనే యూట్యూబ్ చానల్ లో జనవరి ఆరు, మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో ఈ సర్వే మీద విశ్లేషణ మొదలైంది. ఆ తర్వాత జనవరి 30న న్యూస్ 24 హిందీ చానల్ తన ప్రైమ్ టైమ్ డిబేట్ లో మొదటి సర్వేగా ప్రసారం చేసింది.
ఫిబ్రవరి 2026లో బెంగాల్ ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్న వేళ.. ఈ సర్వే వివరాల్నిమరోసారి రీ ప్యాకేజీ చేసి మార్చి మొదటి వారంలో వైరల్ చేయటం కనిపిస్తుంది. అలా దఫదఫాలుగా విడుదల కావటం.. ఎప్పటికప్పుడు కొత్త సంస్థ అన్నట్లు వేర్వేరు మీడియా సంస్థల్లో పబ్లిష్ కావటం కనిపిస్తుంది. ఇంతకూ ఈ సర్వే సంస్థ వెనుక ఉన్నది ఎవరు? అతడేం చేస్తుంటారు? లాంటివి చూస్తే.. తాజా సర్వే అంటూ జరుగుతున్న ప్రచారం వెనుక అమితాబ్ తివారీ ఉన్నారు. గతంలో ఆయన వివిధ జాతీయ ఛానళ్లకు తన సొంత సంస్థ ద్వారా విడుదల చేస్తుంటారన్న మాట బలంగా వినిపిస్తోంది.
కొన్ని డిజిటల్ మీడియా సంస్థల్లో వెల్లడైన ఫలితాలు.. మిగిలిన అంశాలను చూస్తే..కొన్ని తక్కువ పాపులార్టీ ఉన్న న్యూస్ వెబ్ సైట్స్ లో స్పాన్సర్డ్ ట్యాగ్ తో రిపోర్టులు కనిపించటం గమనార్హం. జనవరిలో వచ్చిన సర్వేను.. తాజాగా విడుదలైన సర్వేగా కొన్ని మీడియాసంస్థల్లో వార్తా కథనాలుగా కనిపించటం విశేషం. కొత్త సీసాలో పాతసారా పేరుతో వ్యవహారం నడుస్తుందని చెప్పక తప్పదు. ఇక్కడే మరో అంశాన్ని గమనించాలి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కౌంట్ డౌన్ మొదలైన వేళ.. ఈ సర్వేను పెద్దగా పట్టలేదు. ఇప్పుడు మరోసారి సర్వే పేరుతో వెలుగు చూడటం.. ప్రస్తుత ముఖ్యమంత్రి సేఫ్ పొజిషన్ లో ఉన్నట్లుగా ఈ సర్వే సారాంశాన్ని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో జనవరిలో విడుదల చేయించిన సర్వే.. సరికొత్త ఓపినియన్ పోల్ ఫలితాల మాదిరి విడుదల చేయటం విశేషంగా చెప్పాలి. పాత సర్వే రిపోర్టును లేటెస్ట్ ఓపీనియన్ పోల్.. రౌండ్ 2 థీమాటిక్ సర్వే పేరుతో సరికొత్తగా పబ్లిష్ చేయటం గమనార్హం. ఇదంతా చూస్తే.. ఎంతో నమ్మకమైన సంస్థలు సైతం ఈ తప్పుడు సంప్రదాయానికి తెర తీయటం ద్వారా విశ్వసనీయతకు భంగం వాటిల్లదని చెప్పాలి.
