Begin typing your search above and press return to search.

గ్లోబల్ బ్రాండ్.. లోకల్ బ్లండర్!

సదరు ప్రకటనలో చూపించిన కంటెంట్ ఆందోళనకరంగా ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

By:  Srikanth Kontham   |   18 Jun 2026 7:00 PM IST
గ్లోబల్ బ్రాండ్.. లోకల్ బ్లండర్!
X

ఆధునిక మార్కెటింగ్ ప్రపంచంలో వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి బ్రాండ్లు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. ఈ క్రమంలో కొన్ని సంస్థలు సామాజిక బాధ్యతను, నైతిక విలువలను పూర్తిగా విస్మరిస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ లైంగిక ఆరోగ్య ఉత్పత్తుల సంస్థ పాకిస్తాన్ విభాగం విడుదల చేసిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపింది. లైంగిక వేధింపులు ..సమ్మతి లేని ప్రవర్తనను తేలికగా చూపేలా ఉన్న ప్రకటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సదరు ప్రకటనలో చూపించిన కంటెంట్ ఆందోళనకరంగా ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఒకరిపై మితిమీరిన వ్యామోహం పెంచుకోవడం.. వారి అనుమతి లేకుండా ప్రవర్తించడం వంటి అంశాలను ఈ ప్రకటనలో పరోక్షంగా ప్రోత్సహించినట్లు ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో సమ్మతి అనే భావనపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన ఒక బ్రాండ్.. దానికి భిన్నంగా లైంగిక వేధింపులను సాధారణీకరించేలా మార్కెటింగ్ వ్యూహాన్ని రచించడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రకటన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కావడంతో ప్రజలు సదరు సంస్థపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, లైంగిక దాడుల వంటి సున్నితమైన అంశాలను కేవలం వ్యాపార లాభాల కోసం, ప్రచారం కోసం వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని నెటిజన్లు మండిప డుతున్నారు. ఇలాంటి కంటెంట్ సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతుందని నేరపూరిత ప్రవర్తనను సమర్థించినట్లు అవుతుందని పలువురు సామాజిక విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా అంతర్జాతీయ బ్రాండ్లు ఇలాంటి సున్నితమైన ఉత్పత్తులను ప్రమోట్ చేసేటప్పుడు ఎంతో బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. లైంగిక ఆరోగ్యం - హక్కుల గురించి మాట్లాడేటప్పుడు పరస్పర అంగీకారం అనేది ప్రాథమిక సూత్రం. కానీ ప్రాంతీయ మార్కెట్లలో వ్యూహాల పేరుతో స్థానిక బృందాలు తీసుకునే ఇలాంటి అనాలోచిత ఆలోచ‌న‌లు, సదరు బ్రాండ్ అంతర్జాతీయ ప్రతిష్టను సైతం మసకబారుస్తాయి. క్రియేటివిటీ పేరుతో సరిహద్దులు దాటడం సరైన పద్ధతి కాదని నెటిజన్లు మండిప‌డుతున్నారు.

ఈ వివాదం కార్పొరేట్ సంస్థలలోని అంతర్గత సమీక్షా లోపాలను ఎత్తిచూపుతోంది. ఒక ప్రకటనను ప్రజల్లోకి విడుదల చేయడానికి ముందు అది సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని అంచనా వేయడంలో కంటెంట్ రైటర్లు, క్రియేటివ్ డైరెక్టర్లు , మేనేజ్‌మెంట్ పూర్తిగా విఫలమయ్యారని ఈ ఘటన నిరూపిస్తోంది. సామాజిక సమస్యలను హేళన చేసే విధంగా రూపొందించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

వాణిజ్య ప్రకటనలు కేవలం ఉత్పత్తులను అమ్ముకోవడానికి మాత్రమే కాదు. అవి సమాజంలోని సంస్కృతిని, ఆలోచనా విధానాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి బ్రాండ్లు కేవలం వైరల్ అవ్వాలనే తాపత్రయంతో కాకుండా నైతిక విలువలకు కట్టుబడి ఉండటం అవసరం. సమ్మతి .. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం అనేది ప్రతి రంగంలోనూ తప్పనిసరి అని ఈ వివాదం మరోసారి గుర్తుచేస్తోంది.