బీజేపీ బిల్లు మంటలు : 30 రోజులు జైలు...మాజీగానే పొలిటికల్ లైఫ్ !
ఇక కోర్టులే వారి విషయంలో విచారణ చేసి తీర్పులు చెబుతారు. అలా కోర్టు పరంగానే న్యాయం జరుగుతుంది.
By: Satya P | 20 Aug 2025 10:16 PM ISTఒక బిల్లు అన్నది ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఉంటే అటూ ఇటూగా అంతా జై కొడతారు. కానీ అదే బిల్లు ఏకంగా తమ రాజకీయ అస్తిత్వానికే ముప్పుగా మారితే ఏమి చేస్తారు. ఇపుడు అదే దేశంలోనూ జాతీయ స్థాయిలోనూ చర్చగా ఉంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఒక రాజ్యాంగ సవరణతో కూడిన బిల్లు ఇపుడు విపక్షాన్ని మంటక్కిస్తోంది. స్వపక్షంలోనూ కలవరం రేపుతోంది. ఇంతకీ ఏమా బిల్లు ఏమా కధ అంటే తెలుసుకోవాల్సిదే.
శతకోటి సందేహాలు :
కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ఒక బిల్లుని బుధవారం ప్రవేశపెట్టారు ఆ బిల్లు చూస్తే కనుక రాజకీయ నాయకులు అంతా దడ పుట్టుకునేలా ఉంది. రాజకీయాలు నిన్నా ఈ రోజూ ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. రాజకీయ అవినీతి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మేలు అన్నట్లుగా పరిస్థితి ఉంది. అంతే కాదు ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా గంపగుత్తగా ఫిరాయింపులు ఇవన్నీ కూడా అధికార లాలసతో చేస్తున్నవే. మరో వైపు చూస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రత్యర్ధులను వేటాడే ఆయుధాలుగా ఏలికల చేతులలో మారాయని కూడా విపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యం ఉంది. ఈ పరిస్థితులలో రాజకీయ నీతి కోసం ఒక బిల్లు అన్నది కనుక వస్తే దాని ఆచరణ అమలు మీద శతకోటి సందేహాలు పుట్టుకుని రావడం జరుగుతుంది. అలాగే హోం మంత్రి ప్రవేశపెట్టిన బిల్లు మీద కూడా ఎన్నో సందేహాలు వస్తున్నాయి.
పదవి పోవడం గ్యారంటీ :
అయిదేళ్ళ కాలానికి సరిపడా తీవ్రమైన నేరాలలో చిక్కుకుని వరుసగా ముప్పై రోజుల పాటు కనుక జైలు జీవితం అనుభవిస్తే ఆ మరుసటి రోజే పదవి పోవడం గ్యారంటీ. ఈ విధంగా హోం మంత్రిత్వ శాఖ 130వ రాజ్యాంగ సవరణ చేస్తూ లోక్ సభలో బిల్లుని ప్రవేశపెట్టింది. దీంతో లోక్ సభలో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బిల్లు చట్టంగా మారితే చాలా ఉపద్రవాలు జరుగుతాయని అన్న ఆందోళన అయితే అంతటా ఉంది. ఎలాగంటే రాజకీయ దురుద్దేశ్యంతో కేసులు పెట్టి తమకు గిట్టని రాష్ట్రంలో లేదా ప్రతిపక్ష సీఎంల మీద ప్రయోగిస్తే ఆ సీఎం జైలుకి వెళ్తే మాజీగా ఆటోమేటిక్ గా అయిపోతారు. దాంతో ప్రభుత్వం కుప్ప కూలుతుంది. మరి ఆ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్నదే అధికార పార్టీ మీద వస్తున్న ఆరోపణగా ఉంది.
నిందింతుడు మాత్రమే తప్ప :
సాధారణంగా చూస్తే కనుక ఎవరైనా ఏ కేసులో అయినా అరెస్టు అయి జైలుకి వెళ్ళినా నేరం రుజువు అయ్యేంతవరకూ వారిని నేరస్థుడిగా పరిగణించరు. వారి నిందితుడిగా మాత్రమే ఉంటారు. ఇక కోర్టులే వారి విషయంలో విచారణ చేసి తీర్పులు చెబుతారు. అలా కోర్టు పరంగానే న్యాయం జరుగుతుంది. కానీ ఈ బిల్లు కనుక చట్టం అయితే మాత్రం కోర్టుల తీర్పుతో సంబంధం లేకుండా నేరుగా చట్టం తన పని తాను చేస్తుంది. దాంతో తొందరగా శిక్ష పడుతుంది. చాలా సందర్భాలలో నిర్దోషులుగా ఉన్న వారూ శిక్షకు గురి అవుతారు అన్నది నిపుణుల మేధావుల మాట. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అన్నది కూడా అంతటా వ్యక్తం అవుతున్న భావన.
కేజ్రీవాల్ కేసు తీసుకుంటే :
ఢిల్లీ సీఎంగా అప్పట్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ని 2024 మార్చి 21న అప్పటి ఈడీ అరెస్టు చేసింది. ఆయనకు తొలి మధ్యంతర బెయిల్ మే 10వ వచ్చింది. అప్పటివరకూ ఆయన జైలులోనే ఉన్నారు. అంటే దాదాపుగా నెలకు పైగా రోజులు అన్న మాట. ఆ టైం లో ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా సీఎంగా కొనసాగారు. ఇక ఆయనకు అనేక దఫాలుగా బెయిల్ తో కలుపుకుని మొత్తంగా ఆయనకు అయిదు నెలల పాటు జైలు జీవితం సాగింది. ఆయనకు సెప్టెంబర్ 10న సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కొత్త చట్టం కనుక అమలు అయితే కనుక కేజ్రీవాల్ జైలులో ఉన్న 31వ రోజే ఆయన సీఎం పదవి ఆటోమేటిక్ గా పోతుంది అని ఉదహరిస్తున్నారు.
జైలులో ఉన్న వారి జాబితా పెద్దదే :
వారూ వీరూ కాదు, ఆ పార్టీ ఈ పార్టీ కూడా కాదు మంత్రులు ముఖ్యమంత్రులు అనేక మంది దేశవ్యాప్తంగా చూస్తే జైలు జీవితం గడిపిన సందర్భాలు అనేకం భారత దేశ వర్తమాన చరిత్రలో ఉంది. ఆ జాబితా కూడా చాలా పెద్దదే. వీరిలో కొందరికే నేరం రుజువు అయింది. కొందరు నిర్దోషులుగా బయటకు వచ్చారు. ఇక మన న్యాయ వ్వవస్థలో ముఖ్య సూత్రమేంటి అన్నది చూస్తే కనుక వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి శిక్ష పడరాదు అన్నది స్పష్టంగా ఉంటుంది. ఇలా నిర్దోషులకు పొరపాటున శిక్షలు పడినపుడు వారికి పరిహారాలు అందించిన సందర్భాలు దేశంలో ఉన్నాయనే చెప్పాలి. ఏపీలోని ఆయేషా మీరా కేసులో అన్యాయంగా ఎనిమిదేళ్ళ పాటు జైలు జీవితం అనుభవించిన సత్యం బాబుకి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ బిల్లుని అర్జంటుగా ఎందుకు :
పార్లమెంట్ లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా వారం ముందు విపక్షాలకు సమాచారం ఇస్తారని విపక్షాలు అంటున్నాయి. కానీ ఈ బిల్లుని సడెన్ గా సభ ముందుకు తెచ్చారని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బదులిస్తూ ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు వెళ్తుందని ఈ కమిటీలో అధికార విపక్షాల ఎంపీలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఈ కమిటీ సూచనలు అధారంగానే బిల్లులో సవరణలు ఉంటాయని అంటున్నారు. అయితే ఈ బిల్లు మీద విపక్షాలు బయటకు ఆందోళన వ్యక్తం చేస్తూంటే అధికార పక్షం వైపు చూసినా ఆందోళనలు ఉన్నాయని అటున్నారు దాంతో ఈ బిల్లు పాస్ అవుతుందా అన్న కొత్త చర్చకు తెర లేస్తోంది. రాజ్యాంగ సవరణ చేయాలీ అంటే మూడింట రెండు వంతుల సభ్యుల బలం అధికార పార్టీకి ఉండాలి. లోక్ సభలో 362 మంది మద్దతు కావాలి ఎన్డీయేకు ఉన్నది 293 మాత్రమే. రాజ్యసభలో చూస్తే 245 స్థానాలకు గానూ 164 మంది మద్దతు కావాలి. ఎన్డీయేకు ఉన్నది 130 మంది మద్దతు మాత్రమే అని అంటున్నారు. మరి ఈ బిల్లు ఎలా ఆమోదం పొందుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.
