కాంగ్రెస్ కి యూత్ షేప్... ఇంటర్వ్యూలతో రాహుల్ బిజీ !
దేశంలోనే అతి పురాతనమైన పార్టీ కాంగ్రెస్ అన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వయసు ఈ రోజుకు 141 ఏళ్ళు. ఇంతటి సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పార్టీ వేరేది దేశంలో లేదు.
By: Satya P | 9 Sept 2026 9:19 AM ISTదేశంలోనే అతి పురాతనమైన పార్టీ కాంగ్రెస్ అన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వయసు ఈ రోజుకు 141 ఏళ్ళు. ఇంతటి సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పార్టీ వేరేది దేశంలో లేదు. అయితే కాంగ్రెస్ కాలానుగుణంగా మారుతున్నా ఇంకా అనేకమైన మార్పులు అవసరం అని అంటున్నారు. ఈ రోజుకీ కాంగ్రెస్ లో వృద్ధులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. కీలక స్థానాలలో వారే ఉన్నారు. రాజీవ్ గాంధీ సమయంలో ఒకసారి కాంగ్రెస్ కి యువ నాయకత్వం దక్కింది. రాజీవ్ పట్టుదలగా ముఖ్య కేంద్రాలలో యువతను నియమించి భారీ మార్పులను తెచ్చారు.
పెద్ద ఎత్తున మార్పు :
ఆయన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉంది. ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో అగ్ర నేతగా ఎదిగాక ఆయన కూడా యువతకు పెద్ద పీట వేస్తున్నా ఇంకా కాంగ్రెస్ రక్తంలో పాత తరం వాసనలే కనిపిస్తున్నాయి. ఇక లాభం లేదని స్వయంగా రాహుల్ గాంధీయే రంగంలోకి దిగారు, సంస్థాగతంగా చేసే మార్పులలో భాగంగా ఒకేసారి వందకు పైగా పార్టీ పదవులను యువ నేతలకు ఇచ్చేందుకు ఆయన సిద్ధం అయిపోయారు. వరసబెట్టి ఇంటర్వ్యూలు చేస్తూ రాహుల్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. దేశంలో ఏకంగా 120 జాతీయ ప్రధాన కార్యదర్శుల పదవులను యువ నేతలకు ఇవ్వాలన్నది రాహుల్ గాంధీ పట్టుదలగా కనిపిస్తోంది.
సీనియారిటీ కాదంటూ :
యువ నేతల ఎంపిక విషయంలో సీనియారిటీ అర్హత కాదని కాంగ్రెస్ తేల్చేసింది. పని తీరు ఎలా ఉంది నాయకులలో చురుకుదనం ఏ విధంగా ఉంది అన్నదే రాహుల్ గాంధీ స్వయంగా పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ ఫిలాసఫీని జనంలోకి బలంగా నిబద్ధతతో తీసుకుని పోయే వారే కావాలని ఆయన పట్టుబడుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శుల పదవుల కోసం ముందు వివిధ రాష్ట్రాలలో ప్రాధమికంగా ఎంపిక జరిగింది. అక్కడ నెగ్గి వచ్చిన వారికి చివరి దశలో రాహుల్ గాంధీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటుగా ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ ఇంటర్వ్యూల ప్రక్రియలో పాల్గొంటున్నారు.
అరవై శాతం యూత్ గా :
ఇక కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో ఏకంగా అరవై శాతం పదవులు యువతకు కేటాయించాలని రాహుల్ గాంధీ బలమైన నిర్ణయం తీసుకున్నారు. కొత్త ముఖాలను యువతను ముందు పెడితే కాంగ్రెస్ కి కూడా ఫ్రెష్ లుక్ వస్తుందని జనంలోకి ఈజీగా పార్టీ వెళ్తుందని ఆలోచిస్తున్నారు. ఇక ఎటువంటి సిఫార్సులు ఈ పదవుల కోసం పనిచేయవని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వారి పని తీరే పదవులు తెచ్చిపెడుతుందని అంటున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చి కష్టపడి పనిచేయగలమని భావించే యువ నేతలకు ఇది మంచి అవకాశంగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
జిల్లా స్థాయి నుంచే :
కాంగ్రెస్ లో ఇపుడు కొత్త మార్పు కనిపిస్తోంది. జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో వీలైనంత వరకూ యువతకే పెద్ద పీట వేస్తున్నారు. ఇపుడు దానిని జాతీయ స్థాయికి విస్తరించారు. అయితే పార్టీ పదవుల నియామకాల కోసం ఇంటర్వ్యూలు చేపట్టడం అన్నది రాహుల్ గాంధీయే మొదలెట్టారు. ఆయన యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ యూఐలలో ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారానే పదవులు భర్తీ చేసి మంచి ఫలితాలు సాధించారు. ఇపుడు అదే ప్రక్రియను జాతీయ కాంగ్రెస్ లో పదవులకు కూడా అనుసరిస్తున్నారు అని అంటున్నారు. ఈ రోజున దేశమంతా జెన్ జీ జపం చేస్తోంది. రాహుల్ గాంధీ కూడా యూత్ తో కలిసిపోతున్నారు. వారికి మద్దతుగా పోరాటాలలో పాల్గొంటున్నారు. ఇపుడు పార్టీలో కూడా యూత్ కి పెద్ద పీట వేయడం ద్వారా గ్రాండ్ ఒలడ్ పార్టీ కాదు యూత్ పార్టీ అని కొత్త రూపు తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నారు. మరి రాహుల్ అనుసరిస్తున్న ఈ విధానం బాగుంటే మిగిలిన పార్టీలు అనుసరిస్తాయేమో చూడాల్సి ఉంది.
