రాహుల్ జగన్ గ్యాప్ అక్కడే ?
2010లోనే తన పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఆ తరువాత సొంత పార్టీ పెట్టుకున్నారు.
By: Satya P | 15 Aug 2025 9:26 AM ISTకాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ ఫ్యామిలీ దశాబ్దాల పాటు ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్సార్ అనేక పదవులు అందుకున్నారు. రెండు సార్లు పీసీసీ చీఫ్ అయ్యారు. అంతే కాదు అనేక సార్లు ఎమ్మెల్యే ఎంపీగా కూడా అయ్యారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ పార్టీతోనే. ఇక జగన్ విషయానికి వస్తే ఆయన తొలిసారి ఎంపీ అయింది కాంగ్రెస్ టికెట్ మీదనే. అయితే ఆయన గట్టిగా రెండేళ్ళు కూడా కాంగ్రెస్ ఎంపీగా ఉండలేదు. 2010లోనే తన పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఆ తరువాత సొంత పార్టీ పెట్టుకున్నారు.
కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ :
చిత్రమేంటి అంటే వైఎస్ జగన్ కొత్తగా పెట్టుకున్న పార్టీలో కూడా కాంగ్రెస్ ఉంది. ఇలా కాంగ్రెస్ ని మరవలేకనా లేక ఆ పార్టీ బ్రాండ్ తమకే ఉండాలనా లేక కాంగ్రెస్ అన్నది జనరల్ గా ఎవరైనా పెట్టుకోవచ్చు అన్న ఆలోచనతోనా మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే జగన్ అధినేతగా కొనసాగుతున్నారు. విజయాలు అపజయాలు అన్నీ ఆ పార్టీతోనే ఆయన అందుకుంటున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ కాకుండా మరే పేరు పెట్టుకున్నా లేక కాంగ్రెస్ కాకుండా ఇంకే పేరు కలుపుకున్నా కాంగ్రెస్ జగన్ ని అంతలా టార్గెట్ చేసి ఉండేది కాదేమో. దాంతో తమ ఓట్లను కొల్లగొట్టడానికే జగన్ ఇలా చేశారు అన్న అక్కసు ఉంది. అది నిజమైంది అన్న బాధ ఉంది. దాంతో కాంగ్రెస్ కి ఏపీలో మొదటి టార్గెట్ అయితే జగన్ అయ్యారు.
కలిసేది లేదుగా :
జగన్ కి సొంతంగానే ఉండడం ఇష్టం. ఎంతలా అంటే పొత్తు పార్టీలు సైతం ఎంతో కొంత సలహాలు సూచనలు ఇచ్చి నడిపించాలని చూస్తే సహించలేనంత అని అంటారు. అందుకే సోలో ఫైట్ కే ఆయన మోజు పడతారు అని చెబుతారు. ఇక దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ దాని ఓటు బ్యాంక్ గాంధీల సొంతం కావచ్చు. కానీ ఏపీలో మాత్రం ఆ ఓటు బ్యాంక్ అంతా తమ తండ్రి వైఎస్సార్ చలవతో వచ్చినదే అన్నది జగన్ బలమైన నమ్మకం అని చెబుతారు. తన తండ్రి రెక్కల కష్టంతోనే ఎక్కువ మంది ఎంపీలు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కి దక్కారు అని అలా కేంద్రంలో రెండు సార్లు యూపీఏ సర్కార్ ఏర్పడింది అన్న బలమైన భావన కూడా ఉందని అంటారు. దాంతో కాంగ్రెస్ ని ఆయన ఎపుడూ దూరం పెడతారు అని చెబుతారు.
జగన్ ని తగ్గించాలనే టార్గెట్ :
జగన్ ఓటమి టీడీపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ సంతోషంగా ఉంటుంది అన్నది ఒక కఠినమైన విశ్లేషణ. ఎందుకంటే జగన్ కనుక రాజకీయంగా తగ్గినా బలహీన పడినా ఆ పార్టీ వెనక ఉన్న ఓటు బ్యాంక్ మళ్ళీ భద్రంగా తమ వైపే వస్తుంది అన్నది కాంగ్రెస్ వారి నమ్మకం. అందుకే జగన్ ని కలుపుకుని పోవడం లేదు అని చెబుతారు ఇక దేశంలో చూస్తే శరద్ పవార్ కాంగ్రెస్ ని వీడి పార్టీని సొంతంగా పెట్టారు మమతా బెనర్జీ పెట్టారు. ఆ పార్టీల పేర్లలో కూడా కాంగ్రెస్ ఉంది. వారు కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తే తమ వెంట తీసుకుని వెళ్ళారు. అయితే వారు బాగా అక్కడ రాజకీయంగా పాతుకుపోయారు. ఏపీలో చూస్తే వైసీపీ ఒక్క ఎన్నికల్లోనే గెలిచింది. మరోసారి గెలిస్తే కనుక పాతుకుని పోతుంది. అందుకే ఈసారి చాన్స్ అసలు ఇవ్వకూడదు అన్నది కూడా కాంగ్రెస్ పెద్దల వ్యూహం పంతం అని అంటున్నారు.
విడివిడిగా ఉంటూనే :
ఇక రాహుల్ గాంధీ ఒక వారసత్వ నాయకుడు అని వైసీపీ వారి మాటగా ఉంటే జగన్ తండ్రి ప్రాపకం నుంచి రాజకీయంగా ఎదిగారు అన్నది కాంగ్రెస్ వాదుల నుంచి వచ్చే విమర్శ. రాహుల్ గాంధీ బలపడకూడదు అన్నది వైసీపీ పెద్దల ఆలోచన అయితే జగన్ రాజకీయంగా ఎదగరాదు అన్నది కాంగ్రెస్ వారి వ్యూహం. ఈ విధంగా ఉత్తరం దక్షిణంగా ఉన్న ఈ రెండు పార్టీలు కలిసేది బహుశా ఇప్పట్లో ఉండదేమో. ఎందుకంటే ఇవన్నీ ఎవరికి వారి రాజకీయ అవసరాలు ఆలోచనలు. అంతే కాదు రాహుల్ గాంధీ ఫోకస్ వేరు, జగన్ వైఖరి వేరు అని కూడా చెబుతారు. మొత్తం మీద చూస్తే ఏపీలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకోవాలని చూస్తోంది. దానికి జగన్ ఇంటి ఆడపడుచునే ముందు పెట్టి వైసీపీని పొడుస్తోంది. చూడాలి ఈ రాజకీయ సయ్యాట ఎన్ని మలుపులు తిరుగుతుందో.
