Begin typing your search above and press return to search.

రేవంత్ పాలనకు రెఫరెండమేనా ?

తెలంగాణాలో కాంగ్రెస్ ని రేసు గుర్రం మాదిరిగా పరుగులు తీయించి ఇక జీవితంలో ఓటమి అన్నదే ఉండదని నిబ్బరంగా ఉన్న బీఆర్ఎస్ ని ఓడించి గద్దె నెక్కిన రికార్డు రేవంత్ రెడ్డిది

By:  Satya P   |   6 Oct 2025 11:41 PM IST
రేవంత్ పాలనకు రెఫరెండమేనా ?
X

తెలంగాణాలో కాంగ్రెస్ ని రేసు గుర్రం మాదిరిగా పరుగులు తీయించి ఇక జీవితంలో ఓటమి అన్నదే ఉండదని నిబ్బరంగా ఉన్న బీఆర్ఎస్ ని ఓడించి గద్దె నెక్కిన రికార్డు రేవంత్ రెడ్డిది. తెలుగుదేశంలో ఎదిగి రాజకీయంగా విశేష అనుభవం సంపాదించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మహా సముద్రంలో గజ ఈతగాడుగా ఈదుతూ తాను అనుకున్న లక్ష్యాలను సాధించారు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఈ డిసెంబర్ నాటికి రెండేళ్ళు పరిపూర్తి చేసుకోబోతున్నారు. మరో పదేళ్ల పాటు కాంగ్రెస్ దే తెలంగాణాలో అధికారం అని తరచూ ధీమాగా చెబుతూ ఉంటారు రేవంత్ రెడ్డి. అంటే 2034 దాకా కాంగ్రెస్ జెండా తప్ప మరోటి ఎగరదు అన్నది ఆయన మార్క్ జోస్యం అన్న మాట.

జూబ్లీ పరీక్ష :

అయితే రేవంత్ రెడ్డి పాలన విషయంలో జనాలు అభిప్రాయం ఏమిటి అన్నది తెలియజేసే విధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తోసుకుని వచ్చింది. నిజానికి ఇది ఎవరూ కోరుకున్న ఎన్నిక కాదు. అక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కి చెందిన మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఎన్నిక వచ్చింది. దాంతో కాంగ్రెస్ కి ఒక విధంగా సవాల్ గానే చూడాలని అంటున్నారు.

గట్టి పోటీగానే :

మరీ ముఖ్యంగా ఈ సీటు కాంగ్రెస్ ది కాదు, 2023 ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపీనాధ్ గెలిచారు. అంతకు ముందు కూడా ఆయన అదే పార్టీ నుంచి గెలిచారు. ఇక 2014లో టీడీపీ నుంచి గెలిచారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు స్థాన బలం సామాజిక బలం ఆయనకు ఉంది. అంతే కాకుండా ఆయనకు మంచి పేరు కూడా ఉంది. ఆకస్మిక మరణంతో సానుభూతి కూడా దక్కే అవకాశం ఉంది. పైగా ఆయన సతీమణికే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. చాలా ముందుగానే అభ్యర్ధిత్వం ప్రకటించడంతో ఆమె జనంలోకి వెళ్ళి తమ వంతుగా ప్రచారం చేస్తున్నారు. ఇక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ కూడా దూకుడు పెంచింది.

బలాబలాలు తీరు ఇలా :

జూబ్లీ హిల్స్ లో టీడీపీకి మంచి బలం ఉంది. అయితే ఆ పార్టీ ప్రస్తుతం ఎన్నికల రాజకీయాల్లో లేదు దాంతో ఆ ఓట్లు ఎటు వెళ్తాయన్న చర్చ ఉంది. అయితే గత ఎన్నికల్లో మాగంటి గోపీనాధ్ కే టీడీపీ ఓట్లు వెళ్లాయని చెబుతారు. ఈసారి కూడా అదే జరిగితే కాంగ్రెస్ కి మరింత ఇబ్బంది అవుతుంది. అయితే కాంగ్రెస్ కి కూడా స్థానికంగా బలం ఉంది. బీసీ కార్డుతో ముందుకు రావాలని చూస్తోంది. ముస్లింస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మజ్లీస్ మద్దతు తీసుకుంటే గెలుపు సాధ్యమని కూడా లెక్కలేస్తోంది. బీజేపీకి కూడా కొన్ని ప్యాకెట్లలో బలం ఉంది కానీ టీడీపీ మద్దతు దక్కితేనే ఏమైనా చేయగలదు అని అంటున్నారు.

గెలిచి సత్తా చాటాల్సిందే :

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరుకి పూర్తి స్థాయిలో ఇది రెఫరెండం కాకపోవచ్చు కానీ ఒక అన్నం మెతుకు లాంటి ఫలితమే అంటున్నారు. అయితే కాంగ్రెస్ కి 2023 ఎన్నికల్లో హైదరాబాద్ పరిసరాలలో పెద్దగా సీట్లు దక్కలేదు. మరి రెండేళ్ళ పాలన తరువాత కాంగ్రెస్ ఏమైనా పుంజుకుందా అన్నది ఒక చర్చ. ఇక రేవంత్ రెడ్డి యువ నేతగా దూకుడుగా ఉన్నారు బీఆర్ఎస్ కి బలం పెరిగిందా లేక తగ్గిందా అన్నది కూడా జూబ్లీ హిల్స్ ఫలితం నిర్ధారిస్తుంది అని అంటున్నారు. ప్రతిపక్షాలకు నో చాన్స్ అని కాంగ్రెస్ అంటోంది. అది రిజల్ట్ లో రీ సౌండ్ చేయాలి.

అద్భుతాలు ఏవీ జరగకపోతే :

ఇక కాంగ్రెస్ లో చూస్తే అంతా కలసి పనిచేయాలి. రేవంత్ రెడ్డి వరకూ అయితే పార్టీలో ప్రభుత్వంలో బలంగానే ఉన్నారు. జూబ్లీ హిల్స్ గెలుపుతో దానిని నిరూపించుకుంటే లోకల్ బాడీ ఎన్నికల్లో మరింత జోష్ వస్తుంది. వ్యూహాలైతే ఆయన దిట్టంగానే రచిస్తున్నారు. చేతిలో అధికారం ఉంది, మందీ మార్బలం ఉంది, పైగా ఉప ఎన్నికలు అంటే అధికారంలో ఉండే పార్టీకే జనాలు ఎక్కువగా పట్టం కడతారు. ఈ రెండేళ్ళ కాలంలో చూస్తే కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే లేదని అంటున్నారు. దాంతో అద్భుతాలు ఏవీ జరగకపోతే కాంగ్రెస్ పక్కాగా గెలుస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.