'సవాళ్ల' రాజకీయంలో ప్రజలే సమిధలు!
ఇలా.. ఉదయం నుంచి దాదాపు సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ రాజకీయ కొట్లాటలో ఇరు పక్షాలు సాధించింది ఏమైనా ఉందా? అనే ప్రశ్న తప్ప మరొకటి లేదు.
By: Garuda Media | 3 July 2026 2:59 PM ISTతెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ వర్సెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ మధ్య గురువారం రోజు రోజంతా సవాళ్ల రాజకీయం సాగింది. నువ్వా-నేనా అన్నట్టుగా ఉదయం 8 గంటల నుంచే ఈ హడావుడి .. రాజకీయ విమర్శలు సంచలనం సృష్టించాయి. ఇలా.. ఉదయం నుంచి దాదాపు సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ రాజకీయ కొట్లాటలో ఇరు పక్షాలు సాధించింది ఏమైనా ఉందా? అనే ప్రశ్న తప్ప మరొకటి లేదు.
కానీ, ఈ రాజకీయ యాగీ కారణంగా సాధారణ ప్రజలకు చుక్కలు కనిపించాయి. బంజారాహిల్స్ నుంచి గన్ పార్క్ వరకు.. అసెంబ్లీ నుంచి కంచన్‌బాగ్ దాకా కూడా.. పోలీసులు నిర్బంధాలు విధించారు. ఈ రహదారులపై నిషేధాజ్ఞలు కొనసాగాయి. సాధారణ వాహనాలు, పౌరులను ఈ దారుల్లో నియంత్రించారు. ఫలితంగా విధులకు వెళ్లాల్సిన ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, కళాశాలలకు వెళ్లాల్సిన వారు కూడా తీవ్ర నరకం చవిచూశారు.
ప్రత్యామ్నాయ మార్గాలను సూచించేందుకు కూడా సమయం లేకపోవడం, రాజకీయంగా ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరగడంతో పోలీసులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అధికార పక్షం నుంచి మంత్రులే రోడ్డెక్కడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు బొల్లారం, బోడుప్పల్‌లో టీఆర్ ఎస్ అధ్యక్షురాలు కవిత ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన నిరసన కూడా దీనికి కలిసి వచ్చింది. ఇలా.. మొత్తంగా గురువారం హైదరాబాద్ నగరంలో ప్రజలు అగచాట్లు పడ్డారు.
భారీ అసహనం..
ఇటు ప్రభుత్వం, అటు ప్రధాన ప్రతిపక్షం వైఖరిపై సాధారణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఎవరికోసం ఈ సవాళ్లు అంటూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అప్పులపై సవాళ్లు రువ్వుకోవడాన్ని చాలా మంది ఎద్దేవా చేశారు. అధికారంలో ఎవరు ఉన్నా.. అప్పులు చేస్తున్నారని.. తర్వాత దీనిని రాజకీయం చేస్తున్నారని ఓయూ విద్యార్థి సంఘం నాయకులు విమర్శించారు. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. సవాళ్ల రాజకీయంలో సాధారణ ప్రజలే సమిధలుగా మారారని అంటున్నారు.
