Begin typing your search above and press return to search.

ఇండియా కూటమిలో చిచ్చు...ఎవరి దారి వారిదేనా ?

బీహార్ ఎన్నికలు కాదు కానీ ఇండియా కూటమిలో చిచ్చు రగులుకుంది. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అన్నీ ఈ దారుణమైన ఫలితాల మీద కస్సుబుస్సు మంటున్నాయి.

By:  Satya P   |   21 Nov 2025 12:22 PM IST
ఇండియా కూటమిలో చిచ్చు...ఎవరి దారి వారిదేనా ?
X

బీహార్ ఎన్నికలు కాదు కానీ ఇండియా కూటమిలో చిచ్చు రగులుకుంది. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అన్నీ ఈ దారుణమైన ఫలితాల మీద కస్సుబుస్సు మంటున్నాయి. తప్పు అంతా కాంగ్రెస్ మీదకు నెడుతున్నాయి. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలు, మిత్రులకు విలువ గౌరవం ఇవ్వకపోవడం కాంగ్రెస్ రాష్ట్ర శాఖల కర్ర పెత్తనంతో ప్రాంతీయ పార్టీలు బలి అయిపోతున్నాయని కూడా అంటున్నారు. కాంగ్రెస్ పెద్దన్న వైఖరి కారణంగా మిత్రులు నష్టపోతున్నారు అని ఇండియా కూటమిలో ఇతర పార్టీలు అంటున్నాయి. ప్రాంతీయ పార్టీలకు విలువ ఇచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చూసుకోవాలని మొదటి నుంచి ఆప్ చెబుతూ వస్తోంది. అది కాంగ్రెస్ వినకపోవడం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వేరేగా పోటీ చేసి ఆప్ విజయావకాశాలను దెబ్బ కొట్టడంతో బీహార్ లో ఆప్ సొంతంగానే అభ్యర్థులను పెట్టి పోటీకి దిగింది.

గరం గరం గా :

ఇక జార్ఖండ్ ముక్తీ మోర్చా బీహార్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంది. కాంగ్రెస్ వ్యవహార శైలి వల్లనే ఆ పార్టీ ఏకంగా ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. వీటికి మించి బీహార్ లో ఆర్జేడీ ఓటమికి కాంగ్రెస్ ప్రధాన కారణం అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లు చేస్తున్న పెత్తనం గత్తకపోతే కూటమికే ముప్పు అని శివసేన ఇప్పటికే స్పష్టం చేసింది. బీహార్ ఎన్నికల ఫలితాలు వేకప్ కాల్ లాంటివి అన్ కూడా ఆ పార్టీ చెప్పుకొచ్చింది.

అఖిలేష్ నాయకత్వం :

మరోవైపు బీహార్ ఎన్నికల ఫలితాల మీద సమాజ్ వాదీ పార్టీ కూడా తనదైన సైలిలో విశ్లేషణ చేసింది. బీహార్ ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని కోరింది. సరైన వ్యూహాలు లేవని పేర్కొంది. ప్రాంతీయ పార్టీలకు విలువ ఇవ్వాలని సూచించింది. ఇక ఎస్పీ నేతలు మరో అడుగు ముందుకేసి అఖిలేష్ యాదవ్ కి ఇండియా కూటమి పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

పునరాలోచన చేయాలి :

ఇక ఇండియా కూటమి వరస వైఫల్యాల నేపధ్యంలో అన్ని పరిస్థితులను కూడా పునరాలోచన చేసుకుని ముందుకు కదలాలని తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అన్నారు ముఖ్యంగా నాయకత్వం లోపాలను కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పెద్ద మాటనే వాడారు. ఇవన్నీ చూస్తూంటే మిత్రులు అంతా గుర్రుగానే కాంగ్రెస్ మీద ఉన్నారని అంటున్నారు. వారు కాంగ్రెస్ ని పక్కన పెట్టి నాయకత్వం అందుకోవాలని చూస్తున్నారు. అలా కానీ జరగకపోతే ఎవరి దారి వారిది అన్నట్లుగా సొంత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు.

అలాంటిదేమీ లేదు :

అయితే బీహార్ ఎన్నికల ఫలితాల తరువాత ఇండియా కూటమిలో విభేదాలు అని మిత్రులు అంతా గుర్రు మీద ఉన్నారని వస్తున్న వార్తల పట్ల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అయితే ఘాటుగానే స్పందించారు. ఇండియా కూటమిలో విభేదాలు లాంటివి ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. తామంతా ఒక్కటిగానే ముందుకు సాగుతామని అన్నారు. అంతే కాదు ఇండియా కూటమిని మరింత బలోపేతం చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. బీహార్ ఫలితాల తరువాత మరింతగా తాము సమీక్షించుకుని పటిష్టంగా మారేందుకు ఏమి చేయాలో అన్నీ చేస్తామని అన్నారు. మొత్తం మీద చూస్తూంటే ఇండియా కూటమి గతంలో ఎన్నడూ లేనంతగా కష్టాలలో ఉంది అని అంటున్నారు. చూడాలి మరి మిత్రుల మాట నెగ్గుతుందో లేక కాంగ్రెస్ తన నాయకత్వాన్ని గట్టిగా నిలబెట్టుకుంటుందో.