నవీన్ యాదవ్ కు తొలిసారి ప్రధాన పార్టీ టికెట్.. ఇక రైట్ రైటేనా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికో ఖరారైంది.. నియోజకవర్గ యువతలో పేరున్నా, వ్యక్తిగతంగా బలం ఉన్నా ప్రధాన పార్టీల అండ లేక ఇన్నాళ్లూ ఎమ్మెల్యే కాలేకపోయారు నవీన్ యాదవ్.
By: Tupaki Political Desk | 9 Oct 2025 9:25 AM ISTజూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికో ఖరారైంది.. నియోజకవర్గ యువతలో పేరున్నా, వ్యక్తిగతంగా బలం ఉన్నా ప్రధాన పార్టీల అండ లేక ఇన్నాళ్లూ ఎమ్మెల్యే కాలేకపోయారు నవీన్ యాదవ్. 2014లోనే ఎంఐఎం అభ్యర్థిగా బరిలో దిగి దాదాపు గెలుస్తారు అన్నంత ఊపులో కనిపించారు. గణనీయ సంఖ్య (41,656)లో ఓట్లు సాధించి చివరకు రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. 2018కి వచ్చేసరికి అదే ఎంఐఎం నుంచి మళ్లీ టికెట్ ఆశించారు. కానీ, చివరి నిమిషంలో ఆ పార్టీ.. అప్పటి అధికార బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడంతో నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది. అప్పటికీ 18,817 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు. 2023లో మాత్రం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరి పోటీ నుంచి తప్పుకున్నారు. అదే ఇప్పుడు నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ దక్కేలా చేసిందని చెప్పొచ్చు.
నాన్నే బలం.. బలహీనత..
నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్. ఒప్పుడు దివంగత పీజేఆర్ అనుచరుడిగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో మరీ ముఖ్యంగా యూసుఫ్ గూడలో పేరున్న వ్యక్తి. అయితే, ఆయనపై పలు ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. వీటిలో చాలావరకు వీగిపోయాయి. ఈ నేపథ్యమే ఆయనకు రాజకీయ ఎదుగుదలకు అడ్డంకి అయింది. తండ్రి వేసిన పునాది అండగా ఆయన రాజకీయ ప్రయాణాన్ని నవీన్ యాదవ్ చాలావరకు ముందుకుతీసుకెళ్లారు. ఎమ్మెల్యే మాత్రం కాలేకపోయారు. ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ టికెట్ దక్కడం మాత్రం కీలక మలుపు అని చెప్పొచ్చు.
గెలుపు ఓటముల మధ్య తేడా ఆయనే..
నవీన్ యాదవ్ 2014, 2018 ఎన్నికల్లో గెలవకున్నా.. గెలుపు-ఓటముల మధ్య వ్యత్యాసం చూపే స్థాయిలో ఓట్లు తెచ్చుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన 2014లో ఏకంగా 25 శాతం ఓట్లు పొందారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగానే 12 శాతంపైగానే ఓట్లు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన మాగంటి గోపీనాథ్ కు 30 శాతం పైగా ఓట్లు రాగా, మూడో స్థానంలో నిలిచిన అప్పటి ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి 20 శాతం పైగా ఓట్లు వచ్చాయి. 2018లో మాగంటి మళ్లీ గెలిచారు. ఆయనకు 44 శాతం, విష్ణుకు 34 శాతం ఓట్లు పడ్డాయి. దీన్నిబట్టే నవీన్ యాదవ్ పోటీ ప్రభావం ఏమిటో తెలుస్తోంది. కాగా, 2016లో బీఆర్ఎస్ హవా నడిచిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో నవీన్ యాదవ్ రహ్మత్ నగర్ డివిజన్ నుంచి ఎంఐఎం అభ్యర్థిగానే పోటీ చేసి 8971 ఓట్లు పొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి అబ్దుల్ షఫీ చేతిలో 2330 ఓట్ల తేడాతో ఓడారు.
బీసీ నినాదం.. ఈ సారి కీలకం...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవీన్ యాదవ్ రాజకీయ కెరీర్ కు కీలక మలుపు. కారణం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తుండడం. తొలిసారి ఒక ప్రధాన (జాతీయ) పార్టీ తరఫున టికెట్ రావడం అంటే మామూలు విషయం కాదు. పైగా బీసీలకు పెద్ద పీట వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పదేపదే చెబుతోంది. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ను దీనికి ఉదాహరణగా చూపుతోంది. బీసీ అయిన నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ వంటి ముఖ్యమైన నియోజకవర్గ సీటు ఇవ్వడాన్ని కూడా ఇకమీదట చూపించవచ్చు. మరోవైపు ఇప్పుడు గెలిస్తే గనుక జీహెచ్ఎంసీ పరిధిలో నవీన్ యాదవ్ పెద్ద నాయకుడిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.
బంధుత్వం గట్టిగానే..
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదివిన నవీన్ యాదవ్ వయసు 41 ఏళ్లు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుటుంబంతో వీరికి చాలఆ దగ్గరి బంధుత్వం కూడా ఉంది. ఆర్థికంగానూ బలంగా ఉన్న నవీన్ యాదవ్ కు ఎమ్మెల్యే కావాలన్నది చిరకాల కోరిక. అందుకే తన స్థాయిని తగ్గించుకునే ఉద్దేశం లేక 2018 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ఇప్పుడు ఆయన కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
సీఎం రేవంత్ కు ప్రతిష్ఠాత్మకం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ సీఎం రేవంత్ కు ప్రతిష్ఠాత్మకం. ఓటు స్వగ్రామంలో ఉన్నా.. ఆయన నివాసం కూడా ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ జెండా ఎగరవేసినందున జూబ్లీహిల్స్ లోనూ గెలిస్తే అది జీహెచ్ఎంసీ ఎన్నికలకు మరింత బలంగా మారుతుంది.
