మంట పెట్టింది మధు యాష్కీ !
హైదరాబాద్ ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
By: Garuda Media | 21 Aug 2026 9:27 AM ISTహైదరాబాద్ ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నది. అందునా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి తండ్రిని సస్పెండ్ చేయడం దీనికి మరో కారణం.
అయితే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా సీనియర్ బీసీ నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్ కు సభ్యురాలిగా అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో తన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటోలు వేయలేదని, తన తండ్రి ఫోటోలు వేయకుండా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారని, బీసీ మహిళా నేతను దూషిస్తూ జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బీసీ సంఘాలు, పలు పార్టీలు జక్కిడి శివచరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో జక్కిడి శివచరణ్ రెడ్డి తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గౌడ సామాజికవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఆడియో కూడా పెద్దఎత్తున వైరల్ అయింది. ఆ తరువాత ఎరుకల సామాజికవర్గానికి చెందిన వారిని దూషించడంతో వారు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. వివిధ సామాజిక వర్గాలను ఉద్దేశించి కించపరుస్తూ మాట్లాడి వివాదాలకు కారణం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభాకర్ రెడ్డిని తాజాగా సస్పెండ్ చేసింది.
ఈ నేపథ్యంలో తన సస్పెన్షన్ ను నిరసిస్తూ జక్కిడి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి గాంధీభవన్ ను ముట్టడించారు. ‘సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్‘ పేరుతో నినాదాలు చేస్తూ ‘మధుయాష్కీ గౌడ్ కు నియోజకవర్గం గురించి ఏమీ తెలియదని, పార్టీ పదవులను ఆయన అమ్ముకుంటున్నారని, ఆయన ఎల్బీ నగర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాతనే కుల,మతాల పేరుతో చిచ్చు పెడుతున్నారని, జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆడియో, వీడియోల్లో ఒకవైపు వాయిస్, వీడియోలు మాత్రమే బయటకు వస్తున్నాయని, మరోవైపువి ఎందుకు రావడం లేదని’ ప్రశ్నించారు. ఎల్బీనగర్ లో రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగింపు వద్దని వ్యతిరేకించినందుకే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తన సస్పెన్షన్ విషయంలో కుట్రలు చేసింది మధుయాష్కీ అని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.
