వైసీపీని ఓడించిన కాంగ్రెస్...ఇది కదా రాజకీయ మజా !
ఏపీలో చీరాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 10 వార్డులు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. టీడీపీ 22, వైసీపీ 8 స్థానాలు సాధించాయి. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రభావంతో కాంగ్రెస్ బలం పెరిగినట్లు చర్చ జరుగుతోంది. ఈ ఫలితం వైసీపీకి కాంగ్రెస్ రూపంలో కొత్త రాజకీయ సవాల్‌గా మారుతుందా అనే ఆసక్తి నెలకొంది.
By: Satya P | 7 Nov 2026 8:13 AM ISTఏపీలో కాంగ్రెస్ ని కుదేలు చేసిన ఘనత వైసీపీది. కాంగ్రెస్ పేరుని ఆ ఓటు బ్యాంక్ ని మొత్తానికి మొత్తం తీసుకుని వైసీపీ బలపడింది. గత పదిహేనేళ్ళుగా ఏపీలో వైసీపీయే బలంగా ఉంది. రెండు ఎన్నికల్లో విపక్షంగా ఒక ఎన్నికల్లో 151 సీట్లతో అధికార పక్షంగా వైసీపీ నిలిచింది. ఈ రోజుకీ ఏపీలో వైసీపీ బలంగా ఉంది. అయితే 2024 ఎన్నికల్లో 11 సీట్లను సాధించిన వైసీపీ తన మొత్తం రాజకీయ జీవితంలో చేదు అనుభవం మూటకట్టుకుంది. ఇక తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఉనికి పోరాటమే చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కూటమితో పోరాడుతూ తడబడుతున్న వేళ ఎక్కడ నుంచి వచ్చిందో కాంగ్రెస్ తన బలాన్ని కూడదీసుకుని ఏకంగా వైసీపీనే దాటేసింది. దీంతో ఏపీలో వైసీపీకి కాంగ్రెస్ రూపంలో కొత్త సవాల్ ఎదురు కానుందా అన్న చర్చ అయితే మొదలైంది.
చీరాలలో కాంగ్రెస్ :
ఇక వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తాజాగా వచ్చాయి. ఇక్కడ టీడీపీ 22 వార్డుల్లో గెలవగా కాంగ్రెస్ 10 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. వైసీపీ 8, జనసేన 2, బీజేపీ 1, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. టీడీపీ ఛైర్పర్సన్ అభ్యర్థి హనీ స్పందన ఘన విజయం సాధించారు. సమీప వైసీపీ అభ్యర్థి కంటే ఆమె ఆరు వేలకు పైగా మెజార్టీతో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ టీడీపీకి ప్రతిపక్షంగా మారడం అంటే విశేషమే. దీంతో చీరాల మునిసిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుపై పీసీసీ చీఫ్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. ఒక విధంగా కాంగ్రెస్ కి చీరాల గేట్ వేగా మారిందా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ చీరాలలో ఓటమిని పొందడం ఒక ఎత్తు అయితే టీడీపీ నుంచి కాక కాంగ్రెస్ నుంచి ముప్పు కొత్తగా పొంచి ఉండడం మరో చర్చగా ఉంది. ఏపీలో కాంగ్రెస్ పని అయిపోయింది అని ఇక కోలుకోలేదని అంతా అనుకుంటున్న నేపథ్యంలో ఏకంగా ఒక మునిసిపాలిటీలో పది వార్డులను కాంగ్రెస్ సొంతం చేసుకుంది అంటే ఆశ్చర్యమే మరి. ఇంతటి భీకరమైన పోరులో సైతం కాంగ్రెస్ జెండా ఎగరవేయడం వైసీపీని పక్కకు నెట్టి తాను ముందుకు రావడం అంటే హస్త రేఖల దశ తిరిగిందా అన్నది అంతా ఆలోచిస్తున్నారు.
ఆమంచి ప్రభావం :
అయితే కాంగ్రెస్ చీరాల మున్సిపాలిటీ లో గెలవడానికి కారణం అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కారణం అని అంటున్నారు. ఆయన బలమైన నాయకుడు. ఒకసారి కాంగ్రెస్ నుంచి మరోసారి ఇండిపెండెంట్ గా గెలిచిన బలం ఆమంచి సొంతం. ఆయన కాంగ్రెస్ లో చేరి 2024 ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేస్తే బాగానే ఓట్లు సాధించారు. ఇప్పుడు ఆయన తన సొంత ఇలాకాలో కాంగ్రెస్ బలం పెంచి తనను తాను నిరూపించుకున్నారు అని అంటున్నారు. దాంతో ఆమంచి పలుకుబడి మీద కూడా చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ ఉన్నటే :
దీంతో పాటు మరో మాట కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ జనంలో ఉందని హస్తం గుర్తు కూడా చెదిరిపోలేదని అంటున్నారు. బలమైన నాయకులు ఉండి జెండా పడితే మళ్లీ హస్తం పార్టీ పుంజుకుంటుంది అని కూడా అంటున్నారు. ఇపుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయాల్సిన పని ఏపీలో బలమైన నాయకులను నియోజకవర్గాల వారీగా చూసుకోవడం. అవసరమైతే మాజీ కాంగ్రెస్ వాదులను ఘర్ వాపసీ పేరుతో తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తే ఏపీలో కాంగ్రెస్ మళ్లీ గట్టిపడుతుందని అంటున్నారు. ఏపీలో బీజేపీకి ఎప్పటికీ ఇలా సొంతంగా గెలిచే సన్నివేశం లేని చోట కాంగ్రెస్ వికసించడం అంటే జాతీయ రాజకీయ పరిణామాలు ఏపీలో కూడా కొత్త పాలిటిక్స్ కి దారి తీస్తాయని అంటున్నారు.
