జగన్ అండ్ కేసీఅర్ కి రాహుల్ ఫోన్ చేస్తారా ?
కాంగ్రెస్ పార్టీలోని గాంధీలను ఎదిరించి జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ మీదట కాంగ్రెస్ ని ఏపీలో లేకుండా కూకటి వేళ్ళతో పెకిలించి వేశారు
By: Satya P | 23 Aug 2025 4:00 AM ISTకాంగ్రెస్ పార్టీలోని గాంధీలను ఎదిరించి జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ మీదట కాంగ్రెస్ ని ఏపీలో లేకుండా కూకటి వేళ్ళతో పెకిలించి వేశారు. ఏపీలో ఒకనాడు ఎంతో బలమైన పార్టీగా కాంగ్రెస్ ఉంది. దేశమంతా ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో కాంగ్రెస్ ని ఓడించి ఇందిరాగాంధీని ఎంపీ సీట్లో స్వయంగా ఓడించినా ఉమ్మడి ఏపీలో మాత్రం కాంగ్రెస్ ని గెలిపించిన అభిమానం హస్తం పార్టీ సొంతం. అలాంటి కాంగ్రెస్ కి ఏపీలో పుట్టగతులు లేకుండా చేసిన ఘనత అయితే జగన్ మూటగట్టుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పెద్దలు మరీ ముఖ్యంగా గాంధీలకు టార్గెట్ అయ్యారు అని అంటారు.
కేసీఆర్ షాక్ తినిపించారా :
కట్ చేస్తే తెలంగాణా ఉద్యమ వేళ కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో టచ్ లో ఉంటూ అదే కేంద్ర ప్రభుత్వం ఆసరాతో తెలంగాణా రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్. ఆ సందర్భంగా రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తాను అని ఆయన హామీ ఇచ్చారు అని కూడా ప్రచారం సాగింది. అయితే తీరా రాష్ట్రం ఇచ్చాక కేసీఆర్ టీఆర్ఎస్ ద్వారా పోటీ చేసి తొలి సీఎం అయ్యారు. అంతే కాదు రెండోసారి కూడా ఆయన గెలిచి తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ కి దశాబ్దం పాటు అధికార వనవాసం ఏమిటో చూపించారు అంటారు.
ఈ ఇద్దరి విషయంలో అలా :
ఇక కేసీఆర్ అయినా జగన్ అయినా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కి చుక్కలు చూపించిన వారుగా ఆ పార్టీ పెద్దలు భావిస్తారు అని అంటారు. కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టిన వీరి విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం కూడా అలాగే వ్యవహరిస్తుందని అంటారు. అందుకే ఆ వైపు నుంచి పెద్దగా రియాక్షన్ అయితే ఉండదని చెబుతారు. ఈ రోజున కాంగ్రెస్ పెద్దన్నగా ఉన్న ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్ధిని నిలబెట్టింది. అయితే ఇక్కడ వ్యూహాత్మకంగానే నిర్ణయం తీసుకుంది. రాజకీయాలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్ధిగా చేశారు. అలా తెలుగు వారిని అభ్యర్థిగా చేయడంలో జగన్ కేసీఆర్ లను టార్గెట్ చేయడం స్ట్రాటజీ గా ఉందని అంటున్నారు.
ముందే తేల్చేసిన జగన్ :
అయితే జగన్ ఎలాంటి సంశయాలకు తావు లేకుండా తేల్చేశారు. తమ పార్టీ ఎన్డీయేకు మద్దతు ఇస్తుందని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ద్వారా చెప్పించారు. నిజానికి సెప్టెంబర్ 9 దాకా సమయం ఉంది. అంతవరకూ వేచి చూసి చివరి నిముషంలో తమ నిర్ణయం ప్రకటించవచ్చు. కానీ జగన్ మాత్రం అంత సమయం తీసుకోలేదు. కాంగ్రెస్ వైపు తాను లేను అని చెప్పడానికి ఆ వైపు నుంచి ఎలాంటి రాయబారాలు రాకుండా ఉండడానికే ముందుగా ప్రకటించారు అని చెబుతారు. కేసీఅర్ విషయం తీసుకుంటే కొంత సమయం తీసుకునేలా ఉంది. ఆ మీదట ఆయన కూడా ప్రకటిస్తారు. అయితే ఇండియా కూటమికి మద్దతు ప్రకటిస్తే బీజేపీ నుంచి విమర్శలు వస్తాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి అని రేపటి నుంచి మాట్లాడుతారు. అలా కాదు ఎన్డీయే అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటారు. దాంతో బీఆర్ ఎస్ అన్నీ ఆలోచించాల్సి ఉంటుంది అని అంటున్నారు.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ వ్యూహం :
అటు కేసీఆర్ ఇటు జగన్ వల్ల ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ దెబ్బ తినిపోయింది అని అధినాయకత్వం భావిస్తోంది. అందుకే ఏరి కోరి మరీ తెలుగు వారినే అభ్యర్ధిగా ఎంపిక చేశారు అని అంటున్నారు. ఏపీలో చూస్తే అపుడే పీసీసీ చీఫ్ షర్మిల జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీతో అక్రమ పొత్తు అని ఆమె ఘాటు విమర్సలు చేశారు. అలా జగన్ బీజేపీ ఒక్కటి అని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ కోల్పోయిన ఓటు బ్యాంక్ ని వెనక్కి తీసుకుని రావాలన్నది పక్కా ప్లాన్ అని అంటున్నారు.
బీఆర్ఎస్ విషయం తీసుకుంటే ఒకవేళ ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినా అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రత్యర్థిగానే పరిగణిస్తారు అంటున్నారు. అలా కాదు ఎన్డీయే కూటమి వైపు వెళ్తే బీజేపీతో కలిపి ప్రచారం చేయవచ్చు అన్నది వ్యూహం అంటున్నారు. మొత్తం మీద చూస్తే కేటీఆర్ మాకు ఎవరి నుంచి ఏ ఫోన్ రాలేదని తాము తటస్థ పార్టీ అని చెప్పారు. కానీ కాంగ్రెస్ పెద్దలు ఎవరూ ఫోన్ చేసేది ఉంటుందా అన్నది చర్చ. ఇక ఏపీలో చూస్తే జగన్ కి బీజేపీ పెద్దలు ఫోన్ చేశారు కానీ కాంగ్రెస్ వైపు నుంచి ఢిల్లీ పెద్దలు ఎవరు చేశారు అన్నది కూడా ప్రశ్నలుగా వస్తున్నాయి.
