Begin typing your search above and press return to search.

జంపింగుల‌తో రాజీనామా.. లెక్క‌లు వేస్తున్న కాంగ్రెస్‌!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయ నమోదు చేసుకుంది. సాధార‌ణ‌ మెజారిటీతో విజయం దక్కించుకుంటామని అంచనాలు ఉన్న కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ ప్రజలు దాదాపు 25 వేల‌ ఓట్లకు పైగా మెజారిటీ ఇచ్చి గెలిపించారు.

By:  Garuda Media   |   17 Nov 2025 7:00 AM IST
జంపింగుల‌తో రాజీనామా.. లెక్క‌లు వేస్తున్న కాంగ్రెస్‌!
X

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయ నమోదు చేసుకుంది. సాధార‌ణ‌ మెజారిటీతో విజయం దక్కించుకుంటామని అంచనాలు ఉన్న కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ ప్రజలు దాదాపు 25 వేల‌ ఓట్లకు పైగా మెజారిటీ ఇచ్చి గెలిపించారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ లాంటిది. దేశవ్యాప్తంగా పార్టీ పరిస్థితి దిగజారుతున్న క్రమంలో తెలంగాణలో తన ప్రభావాన్ని నిలబెట్టుకునేందుకు ఈ ఫలితం దోహద పడిందనే చెప్పాలి.

ఈ విషయం ఇలా ఉంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి పది మందిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం దక్కించుకున్న పదిమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీరందరితో పెద్ద సమస్య కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. వారిపై అనర్హత వేటు వేయించాలన్నది బీఆర్ఎస్ పార్టీ వ్యూహం. దీంతో అటు న్యాయపోరాటం ఇటు శాసనసభ పరంగా కూడా తీవ్రస్థాయిలో ఆ పార్టీ పోరాటం చేస్తోంది.

దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు స్పీకర్ ప్రసాద్ రావు విచారణ జరుపుతున్నారు. అయితే, ఇది ఎలా ఉన్నప్పటికీ తాజా జూబ్లీహిల్స్ ఫలితాల అనంతరం ఈ పది మందితో రాజీనామా చేయించి తిరిగి ఉప ఎన్నికలకు వెళ్లే ఆలోచన కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దీనిపై స్పష్టత లేనప్పటికీ కనీసం ఖైరతాబాద్ అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మరికొన్ని నియోజకవర్గాల్లో అయినా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి వారికి కాంగ్రెస్ కండువా కప్పి బీఫారంపై పోటీ చేయించి జూబ్లీహిల్స్ మాదిరిగానే విజయం దక్కించుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో జరుగుతున్న చర్చ.

అయితే అన్నివేళలా ఒకే ఫలితం వస్తుందా? ఒకే తరహాలో ప్రజలు తీర్పు చెబుతారా? అనేది కూడా ఆసక్తిగా మారింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో సానుభూతిపవనాలు కనిపించాయి. నవీన్ యాదవ్.. గతంలో మూడుసార్లు ఓడిపోయిన నేపథ్యానికి ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. కాబట్టి ఆయనను గెలిపించార‌ని ఒక చర్చ నడుస్తోంది. కానీ, జంపింగ్ లతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే ఈ తరహా సానుభూతి వ‌స్తుందా? అనేది ప్ర‌శ్న‌.

ఎందుకంటే బీఆర్ఎస్ కు బలమైన కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కచ్చితంగా తిరిగి ఆ పార్టీ గెలిచే అవకాశం కూడా అందరిని విశ్లేషకులు చెబుతున్న మాట, దీంతో అందరినీ గంప గుత్తుగా రాజీనామా చేయించకుండా ఇద్దరు ముగ్గురుతో రాజీనామా చేయించి ఆ ఫలితం అనంతరం మరో ఇద్దరితో రాజీనామా చేయించి ఇలా వన్ బై వన్ నాయకులను తమ వైపు తిప్పుకునేలా చేయాలన్న ఆలోచన కూడా పార్టీలో వినిపిస్తోంది.

అలా కాకుండా స్పీక‌ర్‌ ప్రసాదరావు విచారణ, అటు సుప్రీంకోర్టు నిర్ణయం తుది అంకానికి చేరుకుని సదరు పదిమందిపై అనార్హత వేట పడితే ఆరు సంవత్సరాలు వరకు వారు ఎన్నికల పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ బెడద నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంద‌ని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.