అధికారం పోయి 50 ఏళ్ళు... రిస్క్ చేస్తున్న కాంగ్రెస్
ఈ దేశంలో కాంగ్రెస్ కి అధికారం పోవడం అన్నది దక్షిణాదిన తమిళనాడులో మొదలైంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ కి వ్యాపించింది.
By: Satya P | 15 Jan 2026 11:10 PM ISTఈ దేశంలో కాంగ్రెస్ కి అధికారం పోవడం అన్నది దక్షిణాదిన తమిళనాడులో మొదలైంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ కి వ్యాపించింది. విశేషం ఏమిటి అంటే తమిళనాడు పశ్చిమ బెంగాల్ లో అయితే మళ్లీ అధికారం వైపు తొంగి చూడలేదు కాంగ్రెస్. అంతే కాదు ఈ రెండు రాష్ట్రాలను చూసి దేశంలో అనేక పార్టీలు కాంగ్రెస్ ని ఓడించడానికి రెడీ అయ్యాయి అలా ప్రాంతీయ పార్టీలు పుట్టుకుని వచ్చాయి. దీంతో కాంగ్రెస్ మూడు నాలుగు సార్లు కేంద్రంలో అధికారం కోల్పోయింది. ఇపుదు చూస్తే కాంగ్రెస్ కి దేశంలో మూడంటే మూడు రాష్ట్రాలే సొంతంగా ఉన్నాయి. ఇక కేంద్రంలో కాంగ్రెస్ బలం కూడా పెద్దగా పెరగడం లేదు, వరసగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు అవుతోంది.అయినా సరే కాంగ్రెస్ ని మెచ్చుకుని తీరాలి. ఎక్కడ ఎన్నికలు అయినా మిత్రులతో కలసి అయినా లేదా సొంతంగా అయినా పోటీకి దిగడం. ఇక దేశవ్యాప్తంగా ఈ రోజుకీ తెలిసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ అని చెప్పక తప్పదు.
బెంగాల్ లో సీన్ ఏంటి :
ఇదిలా ఉంటే ఒకనాడు కాంగ్రెస్ లో చేరి ఎదిగిన మమతా బెనర్జీ సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ అన్న పార్టీని పెట్టుకుని వరసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చింది. నాలుగోసారి కూడా గెలవాలని చూస్తోంది. ఇక మమత పార్టీకి పోటీగా బీజేపీ నిలబడింది. బెంగాల్ ని నాలుగు దశాబ్దాల పాటు ఏలిన వామపక్షాలు అయితే 2011లో అధికారం పోయిన తరువాత నానాటికీ గ్రాఫ్ తగ్గించుకుంటూ వస్తోంది. ఇక లెఫ్ట్ ని పక్కన పెట్టాలని కాంగ్రెస్ ఇపుడు చూడడం విశేషం.
పొత్తులతో ఎదగలేదు :
కాంగ్రెస్ విషయం తీసుకుంటే 2011లో తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. కానీ పెద్దగా లాభం లేకపోయింది. 2016, 2021 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలసి కూటమి కట్టి పోటీ పడినా కాంగ్రెస్ హస్త వాసి ఏమి పెరగలేదు, దాంతో ఈ ఏడాది మధ్యలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తేనే బెటర్ అన్న నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చిందని చెబుతున్నారు.
ఫ్రంట్ కి దూరంగా :
మరో వైపు చూస్తే వామపక్షాలు అటు తృణమూల్ కాంగ్రెస్ కి అలాగే బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ శక్తులను ఏకం చేసే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో కొంత కాలం క్రితం కోల్ కటాలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ తో సీపీం చర్చింది. కాంగ్రెస్ ని కూడా ఈ చర్చలకు పిలిచినా హాజరు కాకపోవడం ద్వారా అపుడే సంకేతాలు ఇచ్చింది. కూటములకు తాము దూరమని కూడా చెప్పినట్లు అయింది
క్యాడర్ సైతం సై :
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలా లేక కూటములతో కలసి వెళ్ళాలా అని పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో చర్చించింది. దానికి 90 శాతం పైగా జిల్లాల అధ్యక్షులు అయితే ఒంటరి పోరుకే వెళ్ళడం బెటర్ అని చెప్పేసారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర సర్కార్ రాష్ట్ర స్థాయి నాయకులు, అన్ని జిల్లాల అధ్యక్షులతో కలిసి మూడు రోజుల క్రితం వర్చువల్ గా నిర్వహించిన సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తం అయింది అని చెబుతున్నారు. సొంతంగా పోటీ చేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
లెఫ్ట్ ఓట్లు పడడం లేదు :
కాంగ్రెస్ లెఫ్ట్ కి దూరం జరగడానికి కారణం కాంగ్రెస్ అభ్యర్ధులకు లెఫ్ట్ ఓటర్ల మద్దతు దక్కడం లేదన్న ప్రధాన కారణం అంటున్నారు. అలాగే కాంగ్రెస్ ఓటర్లు లెఫ్ట్ అభ్యర్ధులకు ఓట్లు వేయడం లేదు, దాంతో రెండు పార్టీలు నష్టపోతున్నాయని గ్రహించే ఈ విధంగా కాంగ్రెస్ డెసిషన్ తీసుకుంది అని అంటున్నారు. ఇక ఈ విషయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఏ విధంగా నిర్ణయిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇండియా కూటమిలో లెఫ్ట్ పార్టీలు కీలకంగా ఉన్నాయి.
బహు ముఖ పోటీలు :
కాంగ్రెస్ కనుక ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటే బహుముఖ పోటీలు బెంగాల్ లో జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో 2024 లోక్ సభ ఎన్నికల్లో పొత్తు కట్టి కూడా ఆ పార్టీ కీలక నేత అధిర్ రంజన్ చౌదరి బహరంపుర్ స్థానంలో ఓటమి పాలు అయ్యారు. మరి ఇవన్నీ కళ్ళ ముందు ఉంటే ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్ ఏమి సాధిస్తుంది అన్నది కూడా చర్చగా ఉంది. అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా తృణమూల్ కి వెళ్ళిపోయింది. అలాగే లెఫ్ట్ యాంటీ ఓటర్లు కూడా కాంగ్రెస్ పొత్తుతో ఓటేయడం లేదు, దాంతో కాంగ్రెస్ సింగిల్ గా పోటీకి వస్తే తప్పకుండా ఎంతో కొంత ఆదరణ లభిస్తుంది అని ఆలోచిస్తున్నారు అంటున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ బెంగాల్ లో ఈ నెల 28న ఒక భారీ ర్యాలీని ప్లాన్ చేసింది అని అంటున్నారు. ఈ ర్యాలీ ధర్మతాలలోని షాహిద్ మినార్ వద్ద జరగనుంది, దానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గెతో పాటు ప్రియాంకా గాంధీ కూడా హాజరవుతారు అని అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ కి వచ్చే స్పందన ఎలా ఉంటుందో.
