Begin typing your search above and press return to search.

గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ‘నీట్’ బూస్ట్.. రాహుల్ నాయకత్వంపై విశ్వాసం పెరుగుతుందా?

జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

By:  Tupaki Political Desk   |   23 July 2026 3:37 PM IST
గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ‘నీట్’ బూస్ట్.. రాహుల్ నాయకత్వంపై విశ్వాసం పెరుగుతుందా?
X

జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నీట్ పేపర్ లీకేజీ ఉదంతంపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు, ఢిల్లీలో జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ లోక్‌సభలో విపక్ష నేత (ఎల్ఓపీ) రాహుల్ గాంధీ చేపట్టిన మెరుపు ధర్నా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యాలయాలపై జరిగిన దాడులు ఆ పార్టీకి రాజకీయంగా సానుభూతిని తెచ్చిపెడుతున్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పునరుజ్జీవ ప్రయత్నాలకు ఊతమిస్తాయా అన్న కోణంపైనా విస్తృత చర్చ జరుగుతోంది.

జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల చరిత్ర ఉంది. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్. అయితే ఇదంతా గతం, ఇప్పుడు పరిస్థితి వేరు. గతం ఒక ఘన చరిత్ర అన్నట్లుగానే కొన్నాళ్లుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. అయితే ఇప్పుడు పరిస్థితులు కుదటపడుతున్న వాతావరణం కనిపిస్తోందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. 2014లో కేంద్రంలో అధికారం కోల్పోయి, ఆ తర్వాత వరుసగా జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యంతో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో 99 సీట్లతో ప్రతిపక్షంగా నిరూపించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అధికార ఎన్డీఏ, మరీ ముఖ్యంగా బీజేపీపై వెన్నుచూపని పోరాటం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు సరికొత్త పంథాతో రాజకీయం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీగా ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ మిగిలిన విపక్షాలను కలుపుకుని పోవడంలో గతం కంటే మెరుగైన విధంగా పనిచేస్తోందని అంటున్నారు. కాకపోతే ఆయా పార్టీలు స్థానిక పరిస్థితులు, అంతర్గత కారణాలతో నిర్లిప్తంగా మారుతున్నా, ఆయా ప్రాంతీయ పార్టీల అగ్ర నాయకత్వానికి కాంగ్రెస్ అండగా నిలుస్తూ తనను తాను మలుచుకుంటున్న తీరు ఆకట్టుకుంటోందని అంటున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలోనూ కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ ఇంటి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాను ఇందుకు తాజా ఉదాహరణగా చూపుతున్నారు.

వారసత్వంగా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రాహుల్.. ఆ పార్టీకి పునరుజ్జీవం తేవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. అయితే వరుసగా మూడు ఎన్నికల్లో ఆయన వైఫల్యం చెందినా నాయకుడిగా ఇప్పుడిప్పుడు తనను తాను నిరూపించుకుంటున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా 2024 ఎన్నికల ముందు నుంచి రాహుల్ తీరులో మార్పు వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ జోడో యాత్ర ద్వారా పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరయ్యేలా ప్రయత్నాలు చేసిన రాహుల్ ఇప్పుడు దేశం ఏం కోరుకుంటుందన్న విషయమై అవగాహన పెంచుకున్నారని అంటున్నారు. దీంతో సమయానుకూలంగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దేలా చురుగ్గా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.

ప్రస్తుతం నీట్ పేపర్ లీక్ వ్యవహారం జాతీయస్థాయిలో కుదిపేస్తుండగా, ఈ విషయంలో కాంగ్రెస్ ఎంటర్ అయిన తీరుతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయమై సుదీర్ఘ పోరాటం జరుగుతుండగా, ఈ నెల 20న నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసిందని అంటున్నారు. ఆ రోజు కేంద్ర బలగాలు విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ చేసిన మెరుపు ధర్నా దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. అంతేకాకుండా 21న రాహుల్ తోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు కూడా కేంద్రంపై ఒత్తిడి చేసేలా ఆందోళనలు చేయడం, ఈ విషయంలో బీజేపీ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గినట్లు సంకేతాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా మారిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.