జూబ్లీ హీట్ : ఎన్నికల వేళ కాంగ్రెస్ కొత్త స్టెప్ ప్లస్సేనా ?
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధిలో గణనీయంగా మైనారిటీలు ఉన్నారు. వారిని ఆకట్టుకోవడానికి ఈ పీక్ టైం లో అర్జంటు గా అజారుద్దీన్ ని మంత్రిని చేస్తున్నారు అని అంటున్నారు.
By: Satya P | 30 Oct 2025 9:24 PM ISTరాజకీయాల్లో ఎపుడూ మనోగతాలు అంతరంగాలు అన్నవి బయట పడకూడదు, వాటి చుట్టూనే వ్యూహాలు అల్లుకుని ఉంటాయి.కీలక సమయాల్లో ఒక కొత్త స్టెప్ వేసినా దాని వెనక ఏముంది అన్న విశ్లేషణ కచ్చితంగా ఉంటుంది. అంతే కాదు దానిని బట్టి ప్రత్యర్ధులు కౌంటర్ స్ట్రాటజీని రూపొందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి కొన్ని సందర్భాలలో ఆ స్టెప్ వెనక ఉన్న విషయం బయటపడితే అది ప్రత్యర్ధులకు అనుకోని విధంగా ఆయుధంగా మారే అవకాశాలు ఉంటాయి.
ఇపుడే ఎందుకో :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఈ డిసెంబర్ మొదటి వారం నాటికి రెండేళ్ళు పూర్తి అవుతుంది. రేవంత్ ప్రమాణం చేశాక కేబినెట్ లో ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి. అందులో కొన్నింటినీ ఈ మధ్యనే భర్తీ చేశారు. ఇంకా రెండు మూడు ఖాళీలు ఉన్నాయి అని అంటున్నారు. మరీ ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు కేబినెట్ లో బెర్త్ దక్కలేదు. అది ఒక విమర్శగానే ఉంది ప్రత్యర్ధులు దానిని పట్టుకుని ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే గతంలో కొత్తగా కొందరిని తీసుకున్నపుడే మైనారిటీ కోటా భర్తీ చేస్తే సరిపోయేది. కానీ అపుడు మానేసి అది అలాగే ఉంచేసి తీరా జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ సడెన్ గా ఈ స్టెప్ తీసుకోవడం రాజకీయంగా కరెక్ట్ వ్యూహమేనా అన్న చర్చ అయితే ఉంది అంటున్నారు.
ఓట్ల కోసమే అంటూ :
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధిలో గణనీయంగా మైనారిటీలు ఉన్నారు. వారిని ఆకట్టుకోవడానికి ఈ పీక్ టైం లో అర్జంటు గా అజారుద్దీన్ ని మంత్రిని చేస్తున్నారు అని అంటున్నారు. ఆయనను కనుక మంత్రిగా చేస్తే మైనారిటీ ఓట్లు అన్నీ గుత్తమొత్తంగా పడతాయా అన్నది కూడా మరో చర్చ ఉండనే ఉంది. ఎందుకంటే 2023 ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ సీటుకు ఆయనే కాంగ్రెస్ అభ్యర్థి అయినా కాంగ్రెస్ పార్టీ ఓటమి చూసింది. ఇపుడు కూడా ఆయన టికెట్ కోసం యత్నించారు. కానీ నవీన్ యాదవ్ ని చాయిస్ గా పెట్టుకుని ముందుకు కదిలారు. దాంతో ఆయనలో కానీ కొందరు మైనారిటీ వర్గాలలో కానీ ఒక రకమైన అసంతృప్తి ఉందని భావించి ఇపుడు ఈ సడెన్ స్టెప్ తీసుకున్నారా అన్నది కూడా మరో చర్చ.
మైండ్ గేమ్ స్టార్ట్ :
సరిగ్గా ఇక్కడే విపక్షాలు మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు పడుతోందని అందుకే ఉన్నట్లుండి మంత్రి వర్గంలోకి అజారుద్దీన్ తీసుకుని మరీ సర్వం ఒడ్డుతోందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ లో ఓటర్ల పల్స్ కాంగ్రెస్ కి ఇప్పటికే తెలిశాయి కాబట్టే ఇవన్నీ కొత్త ప్రయత్నాలు ఆఖరి పోరాటాలు అని బీఆర్ఎస్ అంటోంది. పక్కాగా మేమే గెలుస్తున్నామని బీఆర్ఎస్ నేతలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు బీజేపీ అయితే ఎన్నికల కోడ్ కి విరుద్ధంగా మంత్రి వర్గంలోకి ఈ సమయంలో ఒకరికి చోటిస్తున్నారని ఇదంతా ఓటర్లను ప్రలోభ పెట్టడమే అని ఈసీకే ఫిర్యాదు చేసింది. ఒక విధంగా విపక్షాలు మైండ్ గేమ్ ని స్టార్ట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఓటమి నుంచి తప్పించుకోవడానికే ఈ ఎత్తుగడ వేసిది అని అంటున్నారు.
సర్వేలు పక్కన పెడితే :
ఇక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సీటులో ఉప ఎన్నికల వేళ అనేక సర్వేలు వస్తున్నాయి. ఈ సర్వేలు తేల్చేది ఏంటి అంటే పోటా పోటీగా ఉందని. వార్ వన్ సైడ్ గా లేదని కూడా మరి కొన్ని సర్వేలు చెబుతున్న వేళ కాంగ్రెస్ ఈ దెబ్బతో దూసుకుని పోవాలని ఈ ట్రంప్ కార్డుని బయటకు తీస్తోందని అంటున్నారు అయితే కాంగ్రెస్ ఎత్తులు ఫలిస్తే మాత్రం మంచి మెజారిటీతోనే గెలుపు సాధ్యపడుతుంది. కానీ విపక్షాలు ఆడే మైండ్ గేమ్ కానీ జనాల్లోకి తప్పుడు సంకేతాలుగా వెళ్తే ఏమిటి అన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ ఎన్నికల ముంగిట నిలబడి తీసుకున్న ఈ కొత్త స్టెప్ కీలక ఘట్టంలో ప్లస్సేనా అన్నది హస్తం పార్టీతో పాటు అంతటా చర్చోపచర్చలుగా సాగుతున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుంది అన్నది.
