ప్రియాంక గాంధీ వంతు... కరెక్ట్ గా టార్గెట్ !
కాంగ్రెస్ పార్టీ ఇపుడు దూకుడు మీద ఉంది. ఆ పార్టీ గేర్ మార్చి స్పీడ్ పెంచేసింది. పోయిన చోటనే వెత్తుక్కోవాలని అంటారు.
By: Satya P | 22 Sept 2025 9:16 AM ISTకాంగ్రెస్ పార్టీ ఇపుడు దూకుడు మీద ఉంది. ఆ పార్టీ గేర్ మార్చి స్పీడ్ పెంచేసింది. పోయిన చోటనే వెత్తుక్కోవాలని అంటారు. ఆ విషయం శతాధిక వృద్ధ పార్టీ అయిన కాంగ్రెస్ కి వేరేగా చెప్పాల్సినది లేదు. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితం బీహార్ లో కాంగ్రెస్ అధికారం పోగొట్టుకుంది. అదే సమయంలో యూపీ కూడా దూరం అయింది. దాంతో బీహార్ తో మొదలెట్టి ఉత్తరాదిన బలపడాలని చూస్తోంది. దాని కోసం తొందరలో జరగనున్న బీహార్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంది.
అందుకే సీడబ్ల్యూసీ :
కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విధాన మండలి అయిన సీడబ్ల్యూసీ సమావేశాలను ఈసారి బీహార్ లో నిర్వహిస్తునారు. ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఇవి జరగనున్నాయి. సాధారణంగా ఢిల్లీలో ఈ సమావేశాలు జరుగుతూంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం ఢిల్లీ వెలుపల నిర్వహిస్తారు. ఇపుడు బీహార్ లో నిర్వహిస్తున్నారు అంటే కాంగ్రెస్ టార్గెట్ ఎంత కరెక్ట్ అన్నది అర్ధం అవుతోంది. ఈ నెల 24న జరిగే ఈ సమావేశాలకు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంకా గాంధీ హాజరవుతున్నారు.
ప్రియాంకా యాత్ర స్టార్ట్ :
ఇక సీడబ్ల్యూసీ ముగిసిన తరువాత ఈ నెల 26 నుంచి ప్రియాంకా గాంధీ బీహార్ లో పది రోజుల పాటు హర్ ఘర్ అధికార యాత్ర పేరుతో భారీ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. గత నెలలో ఏకంగా 15 రోజుల పాటు రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించి కాంగ్రెస్ కి కొత్త బలం తీసుకుని వచ్చారు. ఇపుడు దానికి మరింత ఊపు తెచ్చేందుకు కీలక వర్గాలను లక్ష్యంగా చేసుకుని ప్రియాంకా గాంధీ జనంలోకి వస్తారని అంటున్నారు.
వారితోనే విజయం :
బీహార్ మొత్తం జనాభాలో అత్యధిక మహిళలు ఉన్నారు. అంతే కాదు ఓటర్లలో కూడా మూడు కోట్ల 41 లక్షల మంది వారే ఉన్నారు. అంటే అత్యధిక ఓటు బ్యాంక్ అన్న మాట. వారి మద్దతు ఉన్న పార్టీలే ప్రతీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వచ్చాయి. ఈసారి కూడా వారి మద్దతు పొందిన పార్టీలదే బీహార్ పీఠం అని సర్వేలు చెబుతున్న వేళ కాంగ్రెస్ ప్రత్యేకించి గురి పెడుతోంది. అందుకే ప్రియాంకా గాంధీని రంగంలోకి దింపుతోంది అంటున్నారు.
ఆ ఓటు బ్యాంక్ కోసం :
కాంగ్రెస్ పార్టీకి వెన్ను దన్నుగా ఉండే ముస్లింలు, బీసీలు కూడా చాలా ఎన్నికల నుంచి దూరం అయ్యారు. ఇపుడు వారిని సైతం దగ్గర తీసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ఓబీసీల కోసం కులగణన అంటూ కాంగ్రెస్ చాలా కాలం క్రితమే డిమాండ్ ఎత్తుకుంది. అంతే కాదు ముస్లిం సమాజం మీద ఫోకస్ పెట్టింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే వారికి క్షేమం అన్న నినాదంతో మచ్చిక చేసుకుంటోంది. ప్రియాంకా గాంధీ యాత్ర సందర్భంగా ఈ వర్గాలతో నేరుగా ముఖా ముఖీ చర్చలు భేటీలు ఉంటాయని అంటున్నాఅరు. మొత్తానికి బీహార్ లో ఈసారి కాంగ్రెస్ గణనీయంగా సొంతంగా పుంజుకోవాలని పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది .
