జాతీయ రాజకీయల్లో కీలక పరిణామాలు.. కాంగ్రెస్ కు ‘మహా’ శక్తి!
జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటుచేసుకునే సంకేతాలు అందుతున్నాయి. ప్రధానంగా విపక్ష కాంగ్రెస్ పార్టీ పునరేకీకరణ దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Political Desk | 1 July 2026 1:00 AM ISTజాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటుచేసుకునే సంకేతాలు అందుతున్నాయి. ప్రధానంగా విపక్ష కాంగ్రెస్ పార్టీ పునరేకీకరణ దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నుంచి విడిపోయి ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న పలువురు సీనియర్ నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకునేలా పావులు కదుపుతున్నారని, ఈ మేరకు జోరుగా చర్చలు కొనసాగుతున్నాయని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దెబ్బకు కుదేలు అయిన సీనియర్ నేతలు గత్యంతరం లేని పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇలాంటి వారిలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేని శివసేన (ఉద్దవ్ ఠాక్రే) పార్టీ కూడా హస్తం పార్టీ వైపు అడుగులు వేస్తోందని చెబుతున్నారు.
కేంద్రంలో బీజేపీ దెబ్బకు చెల్లాచెదురు అయిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), తృణమూల్ కాంగ్రెస్ (మమతాబెనర్జీ), శివసేన (ఉద్దవ్ ఠాకే) పార్టీలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలనే ప్రతిపాదనపై చర్చిస్తున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా ఢిల్లీ వేదికగా ఈ చర్చలు సాగుతున్నాయని, సానుకూల నిర్ణయాలు వెలువడుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మూడు పార్టీలు కలిసి ఒకేసారి కాంగ్రెస్ లో విలీనం అవుతున్నట్లు ప్రకటిస్తాయా? లేక వేరువేరుగా తమ భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేస్తాయా? అన్నదే తేలాల్సివుందని అంటున్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లో బీజేపీకి దీటుగా కాంగ్రెస్ పార్టీని నిలపాలనే వ్యూహంతో సీనియర్లు అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లుల కోసం 2/3 వంతు మెజార్టీ కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ.. విపక్షంలో ఉన్న చిన్న పార్టీలను లక్ష్యంగా చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని రాజకీయంగా నిర్వీర్యం చేసేలా ఆ పార్టీ పెద్దలు అడుగులు వేస్తుండటంతో పలు రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు గల్లంతు అవుతున్నాయని అంటున్నారు. దీంతో ఆయా పార్టీలు మనగడ కోసం కాంగ్రెస్ హస్తం అందుకుంటున్నాయని విశ్లేషిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో 2/3 వంతు మెజార్టీపై కన్నేసిన బీజేపీ పలు చిన్న పార్టీల ఎంపీలను బీజేపీలో చేర్చుకుంది. ఈ క్రమంలో ఆయా పార్టీల మనగడనే ప్రశ్నార్థకం చేసేలా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదపడంతో ఆప్, తృణమూల్, ఎన్సీపీ, శివసేన (యూబీటీ) పార్టీలు అధినేతలు కోలుకోలేని దెబ్బ తిన్నారని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రస్తుతం సమయం అనుకూలంగా లేదని భావిస్తున్న సీనియర్ నేతలు శరద్ పవార్, మమతా బెనర్జీ, ఉద్దవ్ ఠాక్రే సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తమ పార్టీలను కాంగ్రెస్ లో విలీనం చేస్తే, బీజేపీలోకి వలస వెళ్లిన ఎంపీలకు చెక్ చెప్పినట్లు అవుతుందని ఎత్తుగడ వేస్తున్నారని అంటున్నారు. ఆయా పార్టీలు అధికారికంగా కాంగ్రెస్ లో విలీనమైతే పార్టీ ఫిరాయించిన ఎంపీలు అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం పార్టీ మారిన ఎంపీలకు అధికారికంగా గుర్తింపు రాకపోవడంతో పార్టీ అధ్యక్షులుగా తామే ముందుగా కాంగ్రెస్ లో విలీనం అవుతున్నట్లు స్పీకర్, ఎన్నికల కమిషన్ కు లేఖ అందజేయడం ద్వారా ఫిరాయింపు ఎంపీలపై అనర్హత కత్త దూయొచ్చని వ్యూహం పన్నినట్లు చెబుతున్నారు. అప్పుడు బీజేపీ భావించినట్లు2/3 వంతు మెజార్టీ అసాధ్యమని అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే ఎన్సీపీ, శివసేన యూబీటీ, మమత పార్టీలు కాంగ్రెస్ పార్టీలో విలీనానికి వేగంగా అడుగులు వేస్తున్నాయని అంచనా వేస్తున్నారు.
