Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన ఈడీ.. భారీగా డబ్బు, నగదు స్వాధీనం!

దేశవ్యాప్తంగా సుమారుగా రెండు రోజులపాటు 31 ప్రాంతాలలో ఈడీ అధికారులు.. చేతికి చిక్కిన సాక్షాధారాలతో విస్తృతంగా దాడులు నిర్వహించారు.

By:  Madhu Reddy   |   23 Aug 2025 7:44 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన ఈడీ.. భారీగా డబ్బు, నగదు స్వాధీనం!
X

పొలిటికల్ పరంగా ఎంతో మంది నేతలు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఏదో ఒక సందర్భంలో అక్రమంగా సంపాదించిన సంపాదనతో చిక్కిపోతూ ఉంటారు. అలా ఇప్పటికే ఎంతోమంది మనీలాండరింగ్, అక్రమ బెట్టింగ్ కేసుల్లో ఇరుక్కొని నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పీని ఈడీ అధికారులు అరెస్టు చేసినట్లు సమాచారం. సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిత్రదుర్గ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వ్యవహరిస్తున్నారు.

2 రోజులపాటు 31 ప్రాంతాలలో ఈడీ అధికారులు సోదాలు..

దేశవ్యాప్తంగా సుమారుగా రెండు రోజులపాటు 31 ప్రాంతాలలో ఈడీ అధికారులు.. చేతికి చిక్కిన సాక్షాధారాలతో విస్తృతంగా దాడులు నిర్వహించారు. దీని ఆధారంగానే వీరేంద్రను కూడా అరెస్టు చేశారు అధికారులు. ఈ దాడులతో దుబాయిలో బడా కంపెనీలు, క్యాసినోలతో సంబంధం ఉన్న అతి పెద్ద బెట్టింగ్ సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఆగస్టు 22, 23వ తేదీలలో బెంగళూరు, ముంబై, హుబ్లీ, చిత్రదుర్గ, జోద్పూర్, గ్యాంగ్ టాక్ , గోవా వంటి ప్రదేశాలలో ఈడీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించగా.. ఐదు ప్రముఖ క్యాసినోలు, బిగ్ డాడీ, ఓషన్ రివర్స్, పప్పీస్ ఫ్రైడ్, ఓషన్ 7, పప్పీస్ గోల్డ్ లలో తనిఖీలు చేశారు.

భారీగా బయటపడ్డ బంగారం, నగదు, ఇతర ఆస్తులు..

ఇక వీటిలో 6 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 12 కోట్ల రూపాయల నగదు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీరేంద్ర దుబాయ్ కి చెందిన కొన్ని సంస్థలతో సంబంధం ఉన్న అక్రమ బెట్టింగ్ ప్లాట్ ఫామ్ లను నడుపుతున్నట్లు తేలింది. కింగ్ 567, రాజా 567 అనే అక్రమ బెట్టింగ్ ప్లాట్ ఫామ్ లను కూడా వీరేంద్ర నిర్వహిస్తున్నట్లు ఈడి అధికారులు నిర్ధారించారు. అంతేకాదు వీరేంద్ర సోదరుడు కేసి తిప్పేస్వామి డైమండ్ సోఫ్ టెక్ , టిఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్ నైన్ టెక్నాలజీస్ అనే మూడు దుబాయ్ ఆధారిత సంస్థల ద్వారా బ్యాక్ ఎండ్ నుంచి కార్యకలాపాలను నిర్వహించినట్లు కూడా తేల్చారు. వీటి ద్వారా అక్రమంగా అంతర్జాతీయ స్థాయిలో మనీ ల్యాండరింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా ఈ దాడుల్లో 12 కోట్ల రూపాయల నగదు.. కోటి రూపాయల విదేశీ కరెన్సీ.. 6 కోట్ల విలువచేసే బంగారం.. 10 కిలోల వెండి.. నాలుగు విలాసవంతమైన వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పి ఎం ఎల్ ఏ 2002 యాక్ట్ కింద 17 బ్యాంకు ఖాతాలు, 2 లాకర్లను సీజ్ చేసిన అధికారులు వీరేంద్ర మరో సోదరుడు కేసీ నాగరాజు, ఆయన కుమారుడు పృథ్వీ ఎన్ రాజు ఇళ్ల నుండి ఆస్తి రికార్డులు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర పై కేస్ ఫైల్..

ఇకపోతే గ్యాంగ్ టక్ లో ఒక క్యాసినో ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమిని అద్దెకు తీసుకోవడానికి వీరేంద్ర గ్యాంగ్ టక్ వెళ్లగా అక్కడ ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. అరెస్ట్ అయిన వెంటనే గ్యాంగ్ టక్ లోని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా తదుపరి విచారణ కోసం బెంగళూరుకి తరలించనున్నారు. ఇక ఈ రేంజ్ లో దందా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యం వ్యక్తం చేసేలా చేస్తోంది. ముఖ్యంగా ఈయన మామూలు బెట్టింగ్ రాజా కాదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.