తెలంగాణలో ట్రైయిన్ రివర్స్.. నిధుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష
రాజాపూర్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే గారికి గ్రామీణ రోడ్లు, పెండింగ్ బిల్లులు చూసి మైండ్ బ్లాక్ అయిందట.
By: A.N.Kumar | 26 Oct 2026 8:15 PM ISTసాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిధుల కోసం ధర్నాలు చేయడం.. రోడ్లమీద బైఠాయించడం చూస్తుంటాం. కానీ తెలంగాణలో రివర్స్ ట్రెండ్ నడుస్తోంది.. 'మనదే రాజ్యం.. మనదే అధికారం' అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలోనే ఓ ఎమ్మెల్యే గారు నిధుల కోసం ఏకంగా 30 వేల మందితో ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించడం ఇప్పుడు కాంగ్రెస్ మార్క్ 'ఇంటర్నల్ డెమోక్రసీ'కి పరాకాష్టగా నిలిచింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే పాపం ఆయన ఆవేదన కాస్త నవ్వులపాలు కాకపోయినా.. పాలకుల తీరుపై పేలే చురకల్లా మారాయి..
మంత్రుల నియోజకవర్గాలకేనా 'మంచి రోజులు'?
రాజాపూర్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే గారికి గ్రామీణ రోడ్లు, పెండింగ్ బిల్లులు చూసి మైండ్ బ్లాక్ అయిందట. రోడ్లు వేస్తామని ఓట్లు వేశారు.. ఇప్పుడు జనాలు "ఏదీ రోడ్డు?" అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక అనిరుధ్ రెడ్డి గారు తీవ్ర అసహనానికి గురయ్యారు.
సరే నిధుల కోసం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్కలను కలిశారా అంటే.. హ్యాపీగా కలిసి హామీలు కూడా తెచ్చుకున్నారు. కానీ "హామీలు ఇవ్వడంలో ఉన్న వేగం.. నిధులు విడుదల చేయడంలో ఏదీ స్వామీ?" అనేది ఇప్పుడు ఆయన అసలు ప్రశ్న. మంత్రుల నియోజకవర్గాలకైతే వెంటనే బిల్లులు క్లియర్ అవుతాయట.. మరి మిగతా ఎమ్మెల్యేలు పాపం ఊరకే బొమ్మల్లా చూడాలా? ‘కాంట్రాక్టర్ చనిపోతే రూ.5 కోట్ల బిల్లు ఇచ్చారు.. మరి జడ్చర్లకు రూ.40 కోట్ల బిల్లులు రావాలంటే నేనూ చనిపోవాలా?’ అంటూ ఆయన విసిరిన సెటైరిక్ పంచ్ చూసి గాంధీ భవన్ నాయకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.. "నేను బతకాలా వద్దా అనేది ప్రభుత్వమే తేల్చాలి" అని ఆయన అనడం చూస్తుంటే నిధుల కోసం ఎమ్మెల్యేలు ఎలాంటి 'రిస్క్' చేయడానికైనా సిద్ధపడుతున్నారని అర్థమవుతోంది.
30 వేల మందితో దీక్ష.. సర్కారుకు బిగ్ టెస్ట్
'పని కాకపోతే పక్కకు తప్పుకోవడం' లేదా 'సొంత ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించడం'.. ఇందులో రెండో దారినే ఎంచుకున్నారు మన జడ్చర్ల ఎమ్మెల్యే. నిధులు రాకపోతే ఏకంగా 30,000 మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానంటూ హెచ్చరించడం ఇప్పుడు హాట్ టాపిక్.
పనిలో పనిగా సొంత పార్టీ ప్రభుత్వానికే కాదు.. పరోక్షంగా మంత్రులకూ గట్టి షాకే ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి ఎమ్మెల్యేలు పడుతున్న తిప్పలు చూస్తుంటే "అధికారంలో ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే" అనే రేంజ్లో సీన్ తయారైంది.
మరి జడ్చర్ల ఎమ్మెల్యేగారి ఈ 'సాహసోపేత ప్రకటన'తోనైనా గాంధీ భవన్లో కదలిక వస్తుందో లేదో చూడాలి. లేదా ఆయన అన్నట్లే 30 వేల మందితో దీక్ష చేసేదాకా 'బడ్జెట్ ముహూర్తం' కుదరదంటారా? ఏది ఏమైనా సొంత ఎమ్మెల్యే విసిరిన ఈ సెటైరికల్ ఛాలెంజ్ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుకు ఒక సవాలుగా మారడం ఖాయం
