అప్పుడు రాజస్థాన్.. ఇప్పుడు కర్ణాటక.. కాంగ్రెస్ లో లోపమెక్కడ?
ప్రధానంగా కొన్నిరోజులుగా కర్ణాటక రాజకీయాల్లో కొనసాగుతున్న రచ్చ.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంలో నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని అంటున్నారు.
By: Tupaki Political Desk | 9 Dec 2025 9:00 PM ISTకాంగ్రెస్ అగ్ర నాయకత్వంలో వ్యూహాత్మక లోపాలపై విస్తృత చర్చ జరుగుతోంది. సరైన మేథోమధనం లేకపోవడం, ప్రస్తుత రాజకీయాలకు తగ్గట్టు ఎత్తుగడలు వేయలేకపోవడం వల్ల ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ క్రమంగా కనుమరుగు అవుతున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. గుడ్డిలో మెల్లలా ఒకటి రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినా, ఆ అధికారం నిలబెట్టుకోవడంలో కూడా కాంగ్రెస్ నాయకత్వం విఫలమవుతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉండగా, ఆ మూడుచోట్ల అంతర్గత సమస్యలు ఇబ్బందికరంగా మారాయని అంటున్నారు. ప్రధానంగా కొన్నిరోజులుగా కర్ణాటక రాజకీయాల్లో కొనసాగుతున్న రచ్చ.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంలో నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని అంటున్నారు.
2023లో రికార్డు మెజార్టీతో కన్నడ నాట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఆపసోపాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠం ఆశించారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఆయన విస్తృతంగా పర్యటించి, తానే సీఎం అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకున్నారు. ఇదేసమయంలో ప్రస్తుత సీఎం సిద్దరామయ్య కూడా సీఎం అభ్యర్థిగానే బరిలో దిగారు. ఇలా ఇద్దరు నేతల మధ్య సీఎం కుర్చీపై పోటీ ఎన్నికల ముందు నుంచే మొదలైంది. అయితే అప్పట్లో ఇద్దరినీ ప్రోత్సహించిన కాంగ్రెస్.. వివాదాన్ని తెగని పంచాయతీగా మార్చేసిందన్న విమర్శలకు కారణమైంది. అధిష్టానం సూచనలతో తొలుత సిద్ధూకు ముఖ్యమంత్రి పదవి వదులుకున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పుడు సీఎం పీఠంపై ఆశలు పెంచుకుంటూ ఆ దిశగా పావులు కదుపుతున్నారు.
తన మనసులో మాటను బహిరంగంగా బయటపెట్టకపోయినా, ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ సీఎం సీటుపై కూర్చోవాలనే ఆలోచనకు సంకేతాలుగానే చెబుతున్నారు. దాదాపు రెండు నెలలుగా ఆయన అధికార మార్పిడిపై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాల్సిన కాంగ్రెస్ అధిష్టానం నాన్చుతూ వస్తోంది. దీంతో గతంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ అవలంబించిన విధానమే ఇప్పుడు పాటిస్తోందా? అన్న చర్చ జరుగుతోంది. 2023కు ముందు రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ఆ సమయంలో యువకుడైన సచిన్ పైలట్ సీఎం సీటు ఆశించగా, వృద్ధ నేత అశోక్ గెహ్లోత్ ను కాంగ్రెస్ ప్రోత్సహించింది. దీంతో రెండోసారి ఆ రాష్ట్రంలో అధికారం కాపాడుకోలేకపోయిందని అంటున్నారు.
ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరో రాజస్థాన్ గుర్తుకు వస్తోందని కాంగ్రెస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య అధికార బదిలీపై తొలి నుంచి అధిష్టానం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తుండటం వల్ల పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. ప్రజల్లో కూడా పార్టీపై చులకన భావం ఏర్పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. డీకే శివకుమార్ కోర్కెను ఆమోదిస్తున్నది? లేనిది స్పష్టం చేయకపోవడం వల్ల ఆయన ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న ధోరణితో తన మనోగతాన్ని ఆవిష్కరిస్తున్నారు. దీంతో కర్ణాటక రాజకీయం తరచూ పతాక శీర్షికలకు ఎక్కుతోందని అంటున్నారు. ఇక తాజాగా కర్ణాటక రాజకీయాలపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా జోక్యం చేసుకున్నారని అంటున్నారు. ఈ నెల 15 వరకు ఎవరూ కర్ణాటక పీటముడిపై మాట్లాడొద్దని, ఆ రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. సోనియా ప్రియ శిష్యుడిగా పేరున్న డీకే శివకుమార్ కు ఆ రోజు అయినా రూట్ క్లియర్ అవుతుందా? లేకపోతే ఆయన ప్రయత్నాలకు ఎండ్ కార్డు వేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.
