Begin typing your search above and press return to search.

హస్తినలో హైటెన్షన్ !

‘కొండా సురేఖను మంత్రిపదవి నుండి తొలగించాలని, చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుండి తప్పించాలని క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా నేను పార్టీ అధిష్టానానికి సిఫారసు చేశాను.

By:  Garuda Media   |   2 Sept 2026 9:03 AM IST
హస్తినలో హైటెన్షన్ !
X

‘కొండా సురేఖను మంత్రిపదవి నుండి తొలగించాలని, చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుండి తప్పించాలని క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా నేను పార్టీ అధిష్టానానికి సిఫారసు చేశాను. దాని మీద పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను’ అని ఎంపీ మల్లురవి వ్యాఖ్యానించారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిలను పదవుల నుండి తప్పించే అంశం హస్తనకు చేరడంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలలో హైటెన్షన్ చోటు చేసుకుంది.

మంగళవారం ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో గంటపాటు భేటీ అయ్యారు. మంత్రి కొండా సురేఖను ఢిల్లీకి రావాలని పార్టీ నుండి ఆదేశాలు వచ్చాయి. కానీ మంగళవారం ఆమెకు పార్టీ పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం రాలేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లో సురేఖను బాధ్యతల నుండి తప్సించాలన్న అంశం మీదనే సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది.

అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయాలని, కొండా సురేఖతో పాటు మంత్రులు జూపల్లి క్రిష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లను మంత్రి పదవుల నుండి తొలగించి, వారి స్థానంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, మల్ రెడ్డి రంగారెడ్డి తదితరులకు అవకాశం ఇవ్వాలన్న చర్చ జరిగినట్లు తెలుస్తుంది.

అదే సమయంలో అడ్లూరికి స్పీకర్ పదవి, కొండా సురేఖకు క్యాబినెట్ హోదాతో డిప్యూటీ స్పీకర్ పదవులు ఇవ్వాలని, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి, పొన్నం, దుద్దిళ్ల శ్రీధర్ బాబుల శాఖలను మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుతుండగా, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కుటుంబంతో సహా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిసి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినట్లు తెలుస్తుంది.

శాసనసభ సమావేశాలకు ముందే మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ పూర్తి చేయాలని, కొండా సురేఖ వివాదాన్ని తేల్చాలని రాష్ట్ర కాంగ్రెస్ కోరుతుండగా, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ గురించి పార్టీ అధిష్టానం ప్రస్తుతానికి పక్కన పెట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు సమాాచారం. శాసనసభ సమావేశాల తర్వాతనే దాని గురించి ఆలోచిద్దామని, ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదు అని చెబుతున్నట్లు తెలుస్తుంది. అయితే కొండా సురేఖను రాజీనామా కోరతారని, పార్టీలో తగిన గౌరవం ఇస్తామని చెబుతారన్న వాదన కూడా బలంగా ఉంది.

మరి కొండా సురేఖ అంశంలోనైనా పార్టీ అధిష్టానం తేలుస్తుందా ? కేవలం వివరణలు కోరి మిన్నకుండి పోతుందా ? అన్నది చర్చానీయాంశంగా మారింది. కొండా సురేఖను తొలగించడం అయినా, మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేసినా తేనెతుట్టెను కదిపినట్లు అవుతుందా ? అన్న అనుమానం ఏఐసీసీ పెద్దలకు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్న దాని మీద హస్తినలో హైటెన్షన్ నెలకొంది.