Begin typing your search above and press return to search.

మహిళా రిజర్వేషన్ బిల్లు.. కేంద్రానికి కాంగ్రెస్ కీలక ప్రశ్నలు?

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళ రిజర్వేషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా హడావుడి చేస్తుండటాన్ని కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది.

By:  Tupaki Political Desk   |   12 April 2026 12:00 AM IST
మహిళా రిజర్వేషన్ బిల్లు.. కేంద్రానికి కాంగ్రెస్ కీలక ప్రశ్నలు?
X

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళ రిజర్వేషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా హడావుడి చేస్తుండటాన్ని కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉంటుండగా, అత్యావసరంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పార్లమెంటును సమావేశపరిస్తే నష్టమేంటి? అని విపక్షం నిలదీస్తోంది. ఈ విషయమై మిగతా విపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. దీంతో ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

ఎన్నికల దృష్టితోనేనా?

ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అవసరానికి మించి హడావుడి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రధానంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని విమర్శిస్తోంది. మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశాలు నిర్వహించి చర్చిద్దామని కేంద్రానికి లేఖ రాయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తాజాగా ప్రకటించింది. అదే సమయంలో పునర్విభజన బిల్లుతో లింకు పెట్టడం రాజ్యాంగ బద్దం కాదని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తోంది.

2011 లెక్కలు ఎందుకు?

దేశంలో ఒకపక్క జనగణన ప్రక్రియ మొదలు అవుతుండగా, 2011 జనాభా లెక్కలు ఆధారంగా డీలిమిటేషన్ చేయాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ సందేహిస్తోంది. ఈ ఏడాది జనగణన పూర్తి చేసి డీలిమిటేషన్ చేయొచ్చు అంటూ సూచిస్తోంది. 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున తాజా జనగణన లెక్కలు ఆధారంగా విభజన చేయడంలో వచ్చే ఇబ్బంది ఏంటో చెప్పాలని కాంగ్రెస్ అడుగుతోంది. మొత్తానికి మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల విషయంలో కాంగ్రెస్ చాలా సీరియస్ గా ఉన్నట్లుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అఖిలపక్ష సమావేశానికి డిమాండ్

ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు కేంద్రం హడావుడి చేయడంపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ ముందుగా అఖిలపక్షాన్ని సమావేశ పరచాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాము ఇతర విపక్షాలతో దీనిపై సమావేశం కావాలని యోచిస్తోంది. దీంతో మరో ఐదు రోజుల్లో జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సైతం వాడివేడిగా మారే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. కేంద్రం ఏదో రాజకీయ ప్రయోజనం ఆశించే తొందరపడుతోందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఆలోచనలకు గురి చేస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా 50 శాతం సీట్లను పెంచాలనే నిర్ణయం వల్ల ప్రయోజనం ఏం ఉండదని దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు కూడా నష్టపోతాయని కాంగ్రెస్ పార్టీ విశ్లేషిస్తోంది. ఏదిఏమైనా ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరాలతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు.