లోక్ సభతో పాటు అన్ని అసెంబ్లీలు రద్దు చేయాలి !
దేశంలో గత కొంతకాలంగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఈవీఎంల దుర్వినియోగం పెద్ద ఎత్తున జరిగింది అని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు.
By: Satya P | 4 Oct 2026 9:33 AM ISTబీజేపీ దేశంలో జమిలి ఎన్నికలను ఎపుడూ చెబుతూ ఉంటుంది. కానీ ఆచరణలో అయితే దానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. అయితే బీజేపీ ముచ్చటను తీర్చే సరికొత్త మార్గం ఒకటి ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్ధి గా ఉన్న కాంగ్రెస్ చెప్పకనే చెప్పడం విశేషం. దేశంలో ఇపుడు లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయాలని కాంగ్రెస్ అతి పెద్ద డిమాండ్ నే ముందు పెట్టింది. అలా చేస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం బతికినట్లు అంటోంది. ఈ డిమాండ్ ఎందుకు అంటే దేశంలో ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు అన్నీ అక్రమమే అని కాంగ్రెస్ ఒక్క లెక్కన తేల్చేసింది. అందుకే మళ్లీ తాజాగా ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తోంది.
ఈవీఎంల దుర్వినియోగం :
దేశంలో గత కొంతకాలంగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఈవీఎంల దుర్వినియోగం పెద్ద ఎత్తున జరిగింది అని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. అందువల్ల ఈ పాలక వర్గాలు ప్రభుత్వాలు చెల్లవని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా సహా అందరూ అక్రమంగా పదవులలో ఉన్నారని ఘాటు వ్యాఖ్యలే ఆయన చేశారు. తాజాగా కర్ణాటకలోని కలబుర్గిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఇప్పుడు పరిపాలన అంతా చట్టవిరుద్ధమైన ఎన్నికల పునాదిపైనే నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. భారీ ఎత్తున ఈవీఎంల దుర్వినియోగం జరిగింది అన్నారు. అందువల్ల దేశంలో ఎన్నికైన ముఖ్యమంత్రులందరూ అక్రమంగా ఆ పదవుల్లో ఉన్నట్టేనని భావించాలని ఖర్గే అంటున్నారు. ఇందుకోసమే దేశంలో లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను తక్షణం బ్యాలెట్ పత్రాలతోనే మళ్లీ ఎన్నికలను కొత్తగా నిర్వహించాలని ఖర్గే డిమాండ్ చేశారు.
దేశవ్యాప్త నిరసనలు :
దేశంలో మొత్తం అంతా ఎన్నికలను తాజాగా నిర్వహించాలన్నది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో పాటు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కూడా చర్చించినట్లుగా ఖర్గే చెప్పారు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించామని ఆయన గుర్తు చేశారు. అందులో భాగంగా అక్టోబర్ 6వ తేదీన ఢిల్లీలో విపక్ష ఎంపీలందరూ కలిసి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం దాకా భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పారు. దేశంలోని ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన విమర్శించారు. కావాల్ని ఓటర్ల పేర్లలో కొన్ని వర్గాల ప్రజల పేర్లను తొలగించే ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.
జమిలి ఎన్నికలకు దారి :
కాంగ్రెస్ ఏ ఉద్దేశ్యంతో ఈ డిమాండ్ చేసినా లోక్ సభతో పాటు మొత్తం 28 రాష్ట్రాల అసెంబ్లీలకు అలాగే ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి ఒకేసారి ఎన్నికలు పెడితే బీజేపీ కోరుకుంటున్నట్లుగా జమిలి ఎన్నికల విధానం అమలు అవుతుందని అంటున్నారు. పైగా ఎన్నికలు సక్రమంగానే నిర్వహించామని చెప్పి విపక్షాలు తరచూ చేస్తున్న ఆరోపణలకు తగిన విధంగా జవాబు చెప్పినట్లు అవుతుందని అంటున్నారు. మరి బీజేపీ ఈ అవకాశాన్ని తీసుకుని ఎన్డీయే పాలిత రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల అసెంబ్లీలను అలాగే లోక్ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
