Begin typing your search above and press return to search.

బీఆర్ ఎస్‌ పై విమ‌ర్శ‌లు.. కాంగ్రెస్‌కు ప్ల‌స్సేనా?

ఎన్నిక‌లు ఏవైనా త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు పార్టీలు ప్ర‌య‌త్నిస్తాయి. దీనిని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు.

By:  Garuda Media   |   6 Feb 2026 5:00 PM IST
బీఆర్ ఎస్‌ పై విమ‌ర్శ‌లు.. కాంగ్రెస్‌కు ప్ల‌స్సేనా?
X

ఎన్నిక‌లు ఏవైనా త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు పార్టీలు ప్ర‌య‌త్నిస్తాయి. దీనిని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. ప్ర‌త్య‌ర్థుల‌ను ఎప్పుడు ఎక్క‌డ ఎంత వ‌ర‌కు కార్న‌ర్ చేయాలి.. ఎంత వ‌ర‌కు విమ‌ర్శించాల‌న్న విష‌యంలో మాత్రం పార్టీలు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే గ‌తంలో మాదిరిగా ప్ర‌స్తుత రాజ‌కీయాలు లేవు. నాయ‌కులు ఏం చెప్పినా.. ప్ర‌జ‌లు విశ్వ‌సించే ప‌రిస్థితి లేదు.

చేతిలో ఉన్న స్మార్టు ఫోన్ ప్ర‌జ‌ల‌కు అన్నీ చెప్పేస్తోంది. నాయ‌కులు గ‌తంలో ఏం చేశారు..ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనే విష‌యాల‌పై జోరుగా అనేక చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అధికారంలో ఉన్న పార్టీలైనా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీలైనా.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంది. గుడ్డిగా ఒక పార్టీని విమ‌ర్శించ‌డం ద్వారా ల‌బ్ధి పొందాల‌న్న వ్యూహాలు గ‌తంలో స‌క్సెస్ అయినా.. ఇప్పుడు ఆ త‌ర‌హా ప‌రిస్థితి అయితే లేదు.

తాజాగా ఏం జ‌రుగుతోంది?

తాజాగా తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య తీవ్ర యుద్ధ‌మే జ‌రుగు తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌.. ప్ర‌స్తుత కాంగ్రెస్ పార్టీ లోపాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. ఇదేస‌మ‌యంలో గ‌త రెండేళ్లుగా జ‌రిగిన ప‌రిణామాల‌ను, త‌మ‌పై పెడుతున్న కేసుల‌ను కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్తున్నారు. వీటినే సోష‌ల్ మీడియాలోనూ ప్ర‌చారం చేస్తున్నారు. దీనికి కౌంట‌ర్ ఇచ్చేస్థాయిలో కాంగ్రెస్ నేత‌లు దూకుడు పెంచ‌లేక పోతున్నార‌న్న వాద‌న ఆ పార్టీలోనే వినిపిస్తోంది.

ఇక‌, కాంగ్రెస్ వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నిస్తే.. ఇంకా బీఆర్ ఎస్ పార్టీ ప్ర‌భుత్వ లోపాల‌ను ఎండ‌గుడుతున్నారు. అంతేకాదు.. `జాతిపిత` కేసీఆర్ అంటూ.. బీఆర్ ఎస్ చేస్తున్న ప్ర‌చారానికి కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఇది ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతున్న‌ది చూడాలి. ఎందుకంటే.. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వానికి రెండేళ్లు గ‌డిచాయి. ఈ నేప‌థ్యంలో అది ప్ర‌జ‌ల‌కు ఏం చేసింద‌న్న‌ది ప్ర‌ధానంగా స్థానిక ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీనిపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేసుకుంటే.. కాంగ్రెస్‌కు మేలు జ‌రుగుతుంద‌ని.. బీఆర్ ఎస్‌ను టార్గెట్ చేసుకున్నా.. కేసీఆర్‌ను ల‌క్ష్యంగా చేసుకున్నా.. వ‌చ్చే ల‌బ్ధి అంతంత మాత్ర‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.