మంత్రుల పోరు: చేతులు కాలాక.. 'కాంగ్రెస్' తిప్పలు!
తెలంగాణలో బీసీ, ఎస్సీ మంత్రుల మధ్య చోటు చేసుకున్న వివాదానికి తెరదించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది.
By: Garuda Media | 9 Oct 2025 10:12 AM ISTతెలంగాణలో బీసీ, ఎస్సీ మంత్రుల మధ్య చోటు చేసుకున్న వివాదానికి తెరదించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో చోటు సంపాయించుకున్న ఎస్సీ నాయకుడు అడ్లూరి లక్ష్మణ్ మధ్య తీవ్ర వివాదాలు గత నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున సామాజిక వర్గ రాజకీయాలను కుదిపేసిన విషయం తెలిసిందే. అది కూడా.. కీలకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కావడంతో పార్టీకి పెద్ద తలనొప్పే ఏర్పడింది.
అంతేకాదు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నాయకులను ఏకం చేసేందుకు.. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగేందుకు చేసిన ప్రయత్నంలోనే మంత్రి పొన్నం.. తన సహచర మంత్రి, సొంత జిల్లా కరీంనగర్ కే చెందిన అడ్లూరిపై నోరు చేసుకోవడం.. తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో అడ్లూరి కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పొన్నంకు బలమైన కౌంటరే ఇచ్చారు. మరోవైపు అడ్లూరికి జరిగిన అవమానం.. వ్యక్తిగ తం కాదని.. అది ఎస్సీ సామాజిక వర్గంపై బీసీ మంత్రి పొన్నం చూపి అహంకారమని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.
ఈ విమర్శల వెనుక.. సహజంగానే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ ఉందన్న వాదనా వినిపించింది. కానీ, బీఆర్ ఎస్ నాయకులు ఆచి తూచి అడుగులు వేశారు. ఏమైనా నోరు చేసుకుంటే.. అటు బీసీ సామాజిక వర్గం తమకు దూరమవుతుందని భావించిన కారు పార్టీ నేతలు.. ఈ విషయంలో తెరచాటునే ఉండిపోయారు. మరోవైపు జూబ్లీహిల్స్‌లో మాత్రం బీఆర్ ఎస్ నాయకులు.. పొన్నం అడ్లూరిని విమర్శించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదేసమయంలో బీఆర్ ఎస్ అధికారిక మీడియాలోనూ ఇదే తరహాలో ఉన్నది ఉన్నట్టుగా పొన్నం చేసిన వ్యాఖ్యలను ప్రచారం చేశారు.
మొత్తానికి అతి కష్టం మీద కాంగ్రెస్‌కు ఈ నష్టం బోధపడింది. దీంతో ఇరువురు మంత్రులను ఆగమేఘాల పై విందు సమావేశానికి పిలిచి.. చర్చించి... సారీ అయితే చెప్పించింది. పొన్నం కూడా.. తనకు వ్యక్తిగతం గా జరుగుతున్న డ్యామేజీని గుర్తించి.. వెనక్కి తగ్గారు. మొత్తానికి టీకప్పులో తుఫాను తీరం దాటిందని.. పార్టీ చీఫ్ చెప్పుకొచ్చారు. కానీ.. అసలు ఈ వివాదం ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీకి డ్యామేజీగా మారుతుందని సీనియర్లు చెబుతున్నారు. చేతులు కాలాయని.. ఆనక తీరిగ్గా ఆకులు పట్టుకున్నారని.. దీనిని బీఆర్ ఎస్ తనకు అనుకూలంగా మార్చుకోవడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
