Begin typing your search above and press return to search.

ఏపీ కాంగ్రెస్ కి బీసీలే దిక్కునా ?

ఏపీలో కాంగ్రెస్ పైకి లేస్తుందా అసలు లేపే ఆలోచనలు ఉన్నాయా. కాంగ్రెస్ అధినాయకత్వం మదిలో ఏముంది ఇవన్నీ ప్రశ్నలే.

By:  Satya P   |   29 July 2025 4:00 AM IST
ఏపీ కాంగ్రెస్ కి బీసీలే దిక్కునా ?
X

ఏపీలో కాంగ్రెస్ పైకి లేస్తుందా అసలు లేపే ఆలోచనలు ఉన్నాయా. కాంగ్రెస్ అధినాయకత్వం మదిలో ఏముంది ఇవన్నీ ప్రశ్నలే. అంతే కాదు కాంగ్రెస్ కి ఏపీ మీద ఏ రకమైన వ్యూహాలు ఉన్నాయి. గత మూడు ఎన్నికల నుంచి డిపాజిట్లు గల్లంతు అవుతూ వస్తున్న పార్టీని దాని మానన వదిలేస్తున్నారా లేక వచ్చే ఎన్నికల నాటికి ఏమైనా పొత్తు ఆలోచనలు చేస్తున్నారా ఇవన్నీ కూడా సందేహాలే. కాంగ్రెస్ కి ఒకనాడు దన్నూ ధైర్యం ఇచ్చింది ఉమ్మడి ఏపీ. అలాంటి కంచుకోటలో ఈ రోజు కాంగ్రెస్ డీలా పడడం కాదు బేలగా మారిపోయింది.

ఏపీలో కాంగ్రెస్ దైన్యం :

కాంగ్రెస్ వర్తమానం ఎలా ఉంది అంటే దైన్యం అని చెప్పాలనే అంటారు అంతా. గతమెంతో ఘనం అని ఒకటికి పదిసార్లు వల్లె వేసుకోవాలి తప్ప ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ తీరు చూస్తే బావురుమనాల్సి ఉందని కాంగ్రెస్ కి ఇంకా వీరాభిమానులుగా ఉన్న వారు చెప్పే మాట. దేశంలో ఎమర్జెన్సీ విధించినపుడు 1977లో మొత్తం అంతా కాంగ్రెస్ ఓడింది. కానీ 1978లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ని గెలిపించి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ఊపిరులు అద్దిన ఘనత ఏపీ కాంగ్రెస్ కి ఉంది అలాంటి కాంగ్రెస్ ఈ రోజున ఏ తీరున పయనిస్తోంది అన్న ఆలోఅనలు ఆ పార్టీవాదులలో ఉన్నాయి.

ఇంకా వారే మిగిలారు :

కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం చంపుకోలేక పదవుల వెంట పడకుండా ఇంకా అనేక మంది సీనియర్లు ఆ పార్టీని అట్టిబెట్టుకుని ఉన్నారు అంటే అదే కాంగ్రెస్ సిద్ధనత బలం అని అంటారు. ఈ రోజుకీ కాకలు తీరిన సీనియర్ నేత మౌనంగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఎప్పటికైనా హస్తరేఖలు మారకపోతాయా జాతకం తిరగబడకపోతుందా అన్నదే వారి ఆలోచన. అలా జరగాలన్నదే వారి ఆశ, ఆకాంక్ష కూడా. అయితే కాంగ్రెస్ ఎత్తిగిల్లాలంటే సరైన చర్యలు తీసుకోవాలని పార్టీని మొత్తం ప్రక్షాళన చేసి సరైన వారి చేతిలో నాయకత్వం పెట్టాలన్న డిమాండ్ అయితే వినిపిస్తూ వస్తోంది.

హైకమాండ్ ఫోకస్ పెడుతుందా :

దేశంలో కాంగ్రెస్ మెల్లగా మెరుగుపడుతోంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ సెంచరీ మార్క్ దాటింది. ఆ పార్టీ మిత్రులతో కలిపి ఈ రోజు పార్లమెంట్ లో బలంగా ఉంది. రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రధాన్ ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. ఇక తెలంగాణాలో పదేళ్ళ పోరాటం తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో అంతకు ముందే గెలిచింది. తమిళనాడులో డీఎంకేతో కలసి తన రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకుంటోంది. కేరళలో చూస్తే వామపక్ష కూటమికి సరైన పోటీగా ఉంది. అక్కడ కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉందని చెప్పాలి. ఎటొచ్చి ఏపీలోనే కాంగ్రెస్ పాతాళం అంచులు చూస్తోంది. మరి కాంగ్రెస్ మీద జాతీయ స్థాయి పెద్దల చూపు ప్రసరించడం లేదా అన్న చర్చ అయితే గట్టిగానే జరుగుతోంది.

సామాజిక సమీకరణలతోనే :

ఏపీలో రాజకీయం అంతా సామాజిక సమీకరణల మీదనే ఆధారపడి ఉంది. దాని ఆధారంగానే పార్టీలు కూడా ముందుకు సాగుతున్నాయి ఏపీ అంటేనే కులాల సంకుల సమరం అని చెబుతారు. దాంతో ఏపీలో ఇపుడు చూస్తే కమ్మలు టీడీపీకి రెడ్లు వైసీపీకి కట్టుబడిన సన్నివేశం కనిపిస్తోంది. అలాగే కాపులు చూస్తే పవన్ కళ్యాణ్ వైపు సాగుతున్నారు అన్నది తెలుస్తోంది. మరి ఉన్నది ఎవరు అంటే బీసీలు. రాజ్యాధికారం కోసం బీసీలు ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నారు వారిని ముందు పెట్టి వారికి సారధ్యం అందించి కాంగ్రెస్ సాగితే ఏపీలో రాజకీయంగా సామాజికంగా ఎంతో కొంత పురోగతి కనిపిస్తుందని అంటున్నారు మరి ఆ దిశగా కాంగ్రెస్ పెద్దల అలోచనలు ఉంటాయా అన్నదే చర్చగా ఉంది.

కూటమి వర్సెస్ వైసీపీ :

ఏపీలో చూస్తే కూటమి అధికారంలో ఉంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. దాంతో కూటమి వైసీపీల మధ్య రాజకీయ సమరం సాగుతోంది. కాంగ్రెస్ పాత్ర ఈ నేపధ్యంలో ఎంత అన్నది చర్చగా ఉంది. దాంతో కాంగ్రెస్ తాను రేసులో నిలబడాలి అంటే ఎలాంటి మొహమాటాలూ లేకుండా అధికార టీడీపీ కూటమి మీద సమర శంఖం పూరించాలి. అదే సమయంలో వైసీపీని కూడా ధీటుగా ఎదుర్కోవాలి. అపుడే జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఏపీ రాజకీయ తెర మీద కనిపిస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి హై కమాండ్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందా అన్నది.