ఐటీ తనిఖీల వేళ రియల్ ఎస్టేట్ టైకూన్ సూసైడ్
ఆయన వ్యాపార మోడల్ గురించి వ్యాపారవర్గాలు ప్రత్యేకంగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తుంటాయి.ఆయన అప్పులు లేకుండా వ్యాపారాల్ని నిర్వహిస్తుంటారు.
By: Garuda Media | 31 Jan 2026 10:01 AM ISTషాకింగ్ ఉదంతం ఒకటి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ టైకూన్.. కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీజర్ రాయ్ అలియాస్ డాక్టర్ చిరియాంకందత్ జోసెఫ్ రాయ్ తనను తాను పిస్టల్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అంతపెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్ ఇంతలా కాల్చుకొని సూసైడ్ కు పాల్పడ్డారు. ఈ వ్యవహారం బెంగళూరు వ్యాపార వర్గాల్ని కలిచి వేసింది. అసలేం జరిగిందన్న దానిపై పోలీసులు వెల్లడించిన వివరాలు సరిగా లేవన్న విమర్శ వినిపిస్తోంది.
సీజర్ రాయ్ బెంగళూరులో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరు. 2005లో కాన్ఫిడెంట్ గ్రూప్ ను స్థాపించిన రాయ్.. తమ సంస్థను రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు మౌలిక సదుపాయాలు, సేవా, విద్యా రంగాల్లోకి విస్తరించారు. ఆయన తన వ్యాపార కార్యకలాపాల్ని కర్ణాటక, కేరళతో పాటు యూఏఈలోనూ నిర్వహిస్తున్నారు. పలు మలయాళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
ఆయన వ్యాపార మోడల్ గురించి వ్యాపారవర్గాలు ప్రత్యేకంగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తుంటాయి.ఆయన అప్పులు లేకుండా వ్యాపారాల్ని నిర్వహిస్తుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి.. భారీ నెట్ వర్కు విషయంలో ఆయనకు చాలా మంచి పేరుందని చెబుతారు. అలాంటి ఆయన ఇంట్లో శుక్రవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి రెండు రోజుల ముందు నుంచి బెంగళూరులోని ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఆఫీసుకు వచ్చిన రాయ్ ను ఐటీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో కొన్ని డాక్యుమెంట్లు తీసుకొస్తానని చెప్పిన తన గదిలోకి వెళ్లిన రాయ్.. తన సర్వీస్ రివాల్వర్ తో తనను తాను కాల్చుకున్నారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆ వెంటనే ఆయన్నుహుటాహుటిన నారాయణ మల్టిస్పెషాలిజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్ సమయంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన సూసైడ్ చేసుకున్న విషయాన్ని విదేశాల్లో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉండటంతో చర్యలు తప్పవన్న ఉద్దేశంతో ఈ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. అయితే.. ఎంత ఐటీ తనిఖీలైనా అంత పెద్ద బిజినెస్ టైకూన్ ఇంతలా ఆత్మహత్య చేసుకుంటారా? అన్నది ప్రశ్నగా మారింది. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
