Begin typing your search above and press return to search.

నవ్వుతూ చెప్పే మాటల్లోనూ జాత్యహంకారం.. అమెరికా అమ్మాయికి ఇచ్చిపడేసిన భారతీయుడు

దీనికి ఇండియన్ ఏమాత్రం ఆవేశపడకుండా బెదరకుండా ‘దీన్ని ప్రశంస అనరు.. జాతివివక్ష అంటారు.. ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది’ అన్నట్టుగా సున్నితంగా ఇచ్చిపడేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

By:  A.N.Kumar   |   13 Aug 2026 12:04 PM IST
నవ్వుతూ చెప్పే మాటల్లోనూ జాత్యహంకారం.. అమెరికా అమ్మాయికి ఇచ్చిపడేసిన భారతీయుడు
X

జాత్యహంకారం అంటే కేవలం బహిరంగ దూషణలు.. అవమానాలు లేదా తీవ్రమైన భౌతిక వివక్ష రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది ఎంతో సున్నితంగా వినసొంపుగా చిరునవ్వుతో ఇచ్చే ఓ ‘కాంప్లిమెంట్’ రూపంలోనూ దాగి ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో నివసించే భారతీయులు.. ఇతర వలసదారులు తమ రోజువారీ జీవితంలో ఇలాంటి వ్యాఖ్యలను తరచూ ఎదుర్కొంటుంటారు. పైకి తీవ్రమైన ప్రశంసలా కనిపించినప్పటికీ వీటి వెనుక ఒక నిర్దిష్ట జాతి, దేశం లేదా సంస్కృతిపై ఉన్న ముందస్తు మూస అభిప్రాయాలు దాగి ఉంటాయన్నది పచ్చి నిజం.

తాజాగా అమెరికాలో ఒక భారతీయ కుటుంబం రెస్టారెంట్ కు వెళితే అక్కడ ఒక అమెరికన్ యువతి మీరు ఇండియన్ లాగా ఉన్నారు.. మీ వేష, భాష బాగున్నాయి.. మీరు చేత్తో వాసన చూడడం బాగుందన్నట్టుగా ప్రశంసిస్తూనే దెప్పిపొడిచింది. దీనికి ఇండియన్ ఏమాత్రం ఆవేశపడకుండా బెదరకుండా ‘దీన్ని ప్రశంస అనరు.. జాతివివక్ష అంటారు.. ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది’ అన్నట్టుగా సున్నితంగా ఇచ్చిపడేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సమాజంలో వీటిని ‘బ్యాక్‌హ్యాండెడ్ కాంప్లిమెంట్స్’ లేదా ‘మైక్రో అగ్రెషన్స్’ అని పిలుస్తారు. అంటే ప్రశంసిస్తున్నట్లు నటిస్తూనే పరోక్షంగా ఎదుటివారిని వారి మూలాలను బట్టి తక్కువ చేసి మాట్లాడటం. ఉదాహరణకు నువ్వు భారతీయుడివైనా ఇంగ్లీష్ ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నావో అనడం.. లేదా మీ దేశంలోని మిగతా వాళ్లతో పోలిస్తే నువ్వు చాలా భిన్నంగా.. అందంగా ఉన్నావ్ అని వ్యాఖ్యానించడం వంటివి వినడానికి సాధారణంగానే అనిపించవచ్చు. అయితే వీటి వెనుక భారతీయులకు సరిగ్గా ఇంగ్లీష్ రాదు లేదా వారు ఆధునికులు కారు అనే ప్రతికూల ముందస్తు అంచనా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి సాధించిన నైపుణ్యాన్ని లేదా వారి రూపాన్ని వారి జాతి, జాతీయతతో ముడిపెట్టి ఆశ్చర్యం వ్యక్తం చేయడమే ఇక్కడ అసలైన వివక్ష.

ఈ తరహా సూక్ష్మ వివక్ష వల్ల వెంటనే ప్రత్యక్ష గొడవలు జరగకపోవచ్చు.. కానీ పదే పదే ఇలాంటి మాటలు వినాల్సి రావడం వల్ల వ్యక్తుల్లో తీవ్ర మానసిక అసౌకర్యం, అభద్రతాభావం పెరుగుతాయి. అయితే ప్రతి వ్యాఖ్య వెనుక దురుద్దేశం ఉందనలేం. కొన్నిసార్లు అవగాహన లేకపోవడం లేదా సామాజిక మూస ధోరణుల ప్రభావం వల్ల కూడా ప్రజలు ఈ మాటలు అంటుంటారు. ఉద్దేశం ఏదైనప్పటికీ ఆ మాట వల్ల ఎదుటి వ్యక్తికి కలిగే వేదనను గుర్తించడం ఎంతో ముఖ్యం. ప్రశంస అనేది ఒక వ్యక్తి ప్రతిభను గౌరవించేలా ఉండాలి తప్ప వారి జాతీయతను తక్కువ చేసి చూపేలా ఉండకూడదు.

ఇలాంటి జాత్యహంకారాన్ని ఎదుర్కోవడం అంటే ప్రతీసారీ ఆవేశపడటం లేదా గొడవపడటం కాదు. మన అసౌకర్యాన్ని ప్రశాంతంగా, స్పష్టంగా తెలియజేయడం ద్వారా ఎదుటివారిలో మార్పు తేవచ్చు. ఆ మాట అనడంలో మీ ఉద్దేశం ఏమిటి లేదా ఇది నాకు ప్రశంసలా అనిపించడం లేదు అని సున్నితంగా ప్రశ్నించడం ద్వారా భావాన్ని వ్యక్తపరచవచ్చు. ముఖ్యంగా మన యాస, దుస్తులు లేదా సంస్కృతిపై వచ్చే పరోక్ష వ్యంగ్య వ్యాఖ్యలను కేవలం సరదాగా తీసుకోకుండా మన స్వీయ గౌరవాన్ని నిలబెట్టుకోవడం అవసరం. స్పష్టమైన అవమానమైనా, చిరునవ్వు వెనుక దాగిన సూక్ష్మ వివక్షనైనా సరే సాధారణ విషయంగా వదిలేయకూడదు. మనుషులను వారి మూస చట్రాల నుంచి బయటకు వచ్చి, నిజమైన వ్యక్తిత్వంతో గౌరవించినప్పుడే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యమవుతుంది.