Begin typing your search above and press return to search.

యూరోప్ ను వణికిస్తున్న వలస భూతం

చరిత్రను చూస్తే.. సంపన్నుడి ఆరాచకం.. పేదోడి వేదనే కనిపిస్తుంది. కానీ.. అది అసలు నిజం కాదు. దాని వెనుక అసలు సూత్రం.. బలహీనుడే బలవంతుడి పెట్టుబడి.

By:  Garuda Media   |   4 Aug 2026 4:59 PM IST
యూరోప్ ను వణికిస్తున్న వలస భూతం
X

చరిత్రను చూస్తే.. సంపన్నుడి ఆరాచకం.. పేదోడి వేదనే కనిపిస్తుంది. కానీ.. అది అసలు నిజం కాదు. దాని వెనుక అసలు సూత్రం.. బలహీనుడే బలవంతుడి పెట్టుబడి. బలహీనుడి రక్తాన్ని ఎంతలా చిందిస్తే బలవంతుడు అంతకు రెట్టింపు బలాన్ని పెంచుకుంటాడు. అందుకు మతం, తెగలను ఆయుధాలుగా మార్చుకుంటాడు. సామాన్య ప్రజలు మతాన్ని.. తమ తెగల మూలాల్ని భావోద్వేగంతో ముడిపెట్టుకుంటాయి. వాటిని అసరాగా చేసుకొని.. రెండు భిన్న మతాలు.. పరస్పరం పొసగని తెగల మధ్య పోరు పెట్టి వారిద్దరి మీద అధిక్యతను ప్రదర్శించే దుర్మార్గం బలవంతుడి సొంతం. అదే బలం వారికి సంపదను తెచ్చి పెట్టటమే కాదు.. వారిని పాలకులుగా మారుస్తుంది. వారి చేతికి బలమైన ఆయుధాల్ని ఇస్తుంది. అన్నింటికి మించి తిరుగులేని అధికార క్షేత్రంగా మార్చేస్తుంది.

ఇలాంటప్పుడే న్యాయం.. ధర్మం.. నీతి.. లాంటి మాటలు తెర మీదకు వస్తాయి. నిజానికి ఈ మాటలన్ని కూడా సందర్భానికి తగినట్లుగా మారిపోతుంటాయి. అప్పటివరకు న్యాయం అన్నది కాస్తా.. అవతలి కోణం నుంచి చూసినప్పడు నిజం మరోలా కనిపిస్తుంది. అందుకే న్యాయం.. ధర్మం.. నీతి లాంటి మాటలు ఎప్పటికి స్థిరంగా ఉండవు. కాలానికి అనుగుణంగా వాటి స్థానాలు మారిపోతుంటాయి. ఇక్కడే మీకో ఉదాహరణ చెబుతాను. నిజానికి అదో చరిత్ర. దాన్ని ఒక కోణంలో చూసినప్పుడు కనిపించే వాస్తవం.. మరింత లోతుల్లోకి వెళ్లినంతనే దాని రూపురేఖలు మొత్తం మారిపోతాయి.

ఇంతకూ ఇప్పుడు ఇదంతా ఎందుకు? అన్న సందేహం కలుగుతుంది. సమకాలీన కాలంలో చోటు చేసుకునే ఎన్నో పరిణామాలకు చరిత్ర ఒక కారణం. గత వారంలో అంతర్జాతీయ మీడియా మొదలు స్థానిక మీడియా వరకు ఒక అంతర్జాతీయ అంశానికి సంబంధించిన వార్తకు కాస్తంత ప్రాధాన్యత ఇచ్చాయి. అదేమంటే.. ఆఫ్రికా నుంచి స్పెయిన్ అధీనంలోని స్యూటా నగరానికి ఒక్కసారిగా 60 వేల మంది శరణార్థులు వెల్లువలా వచ్చారని. వారిని నియంత్రించటానికి స్పెయిన్ దళాలు కాల్పులు జరపగా.. 72 మంది శరణార్థులు మరణించారని. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ అత్యవసరంగా సమావేశం కావాలని డిసైడ్ అయ్యింది. ఇదంతా వర్తమానంలో జరుగుతున్నది. దీన్ని కాసేపు ఇక్కడ ఆగి.. చరిత్రలోకి జర్నీ చేద్దాం.

మానవ చరిత్రలోనే అత్యంత క్రూరమైన..చీకటి అధ్యాయాల్లో ఒకటి కాంగో హోలోకాస్ట్. పదమూడేళ్ల పాటు సాగిన ఈ కిరాతక దోపిడీ గురించి తెలిసినప్పుడు ఒళ్లు జలదరింపునకు మాత్రమే కాదు.. యూరోప్ అందాలు అనే మాటను విన్నంతనే లక్షలాది ఆఫ్రికన్ల రక్తపుటేరులు గుర్తుకు వచ్చి.. ఆ అందాల వెనుక ఉన్న రాక్షసత్వం కనిపిస్తుంది. 1884లో బెర్లిన్ కాన్ఫరెన్స్ లో బెల్జియం దేశానికి కాంగో దేశాన్ని అప్పగించకుండా.. ఆ దేశ రాజు రెండో లియో పోల్డ్ కు వ్యక్తిగత ఆస్తిగా రాసిచ్చేశారు.

ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేసే మరో అంశం బెల్జియం దేశానికి దాదాపు 76 రెట్లు పెద్దదైన కాంగో దేశాన్ని అప్పగించారు. అతను సైతం కాంగోను చాలా పెద్దమనిషి తరహాలో కాంగో ఫ్రీ స్టేట్ అని పిలిచేవాడు. పేరుకు మాత్రమే ఇదంతా. కానీ.. వాస్తవం మాత్రం వేరుగా ఉండేది. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా కార్లు.. సైకిళ్ల తయారీ పెరిగింది. దీంతో రబ్బరుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కాంగో అడవుల్లో సహజ రబ్బరు పుష్కలంగా ఉండేది. దీన్ని కొల్లగొట్టటానికి లియోపోల్డ్ ‘‘ఫోర్స్ పబ్లిక్’’ అనే ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.

ఈ సైన్యం ఎంత క్రూరమైందంటే.. కాంగో దేశంలోని ప్రతి గ్రామానికి వెళ్లి.. ఎవరు ఎంత రబ్బరును సేకరించాలో టార్గెట్ పెట్టేవారు. ఎవరైనా వారికి పెట్టిన టార్గెట్ పూర్తి చేయకపోతే.. శిక్షగా వారి చేతుల్ని లేదంటే కాళ్లను నిర్దాక్షిణ్యంగా నరికేసేవారు. చిన్న పిల్లలను కూడా వదలకుండా చేతులు నరికి తమ క్రూరత్వాన్ని ప్రదర్శించేవారు. ఇక్కడితో అయిపోలేదు. మన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. గిరిజనల ప్రాణం తీసేందుకు బుల్లెట్ ను ఎందుకు వేస్ట్ చేస్తున్నావని.

ఆ సీన్ కు తగ్గట్లే కాంగోలోని బెల్జియం రాజు ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యానికి ఒక నిబంధన ఉండేది. ఫోర్స్ పబ్లిక్ సైనికులు వాడే ప్రతి బుల్లెట్ కు బదులు ఒక నరికిన చేతిని ఆధారంగా చూపించాలనే రూల్ ఉండేది. ఎందుకంటే తమ బుల్లెట్లను వేటాడేందుకు వృధా చేయలేదని నిరూపించుకోవటానికి బదులుగా సైనికులు అమాయకులైన ప్రజల చేతుల్ని నరికి చూపించేవారు. వీరి అరాచకం అక్కడితో ఆగలేదు. అడవుల్లోకి వెళ్లి రబ్బరు సేకరించి తెచ్చేలా మగాళ్ల మీద ఒత్తిడి చేయటానికి.. వారి భార్యలను.. పిల్లల్ని బందీలుగా సైన్యం పట్టుకునేది. అడవుల్లోకి మగాళ్లు వెళ్లి సైన్యం ఇచ్చిన టార్గెట్ కు తగ్గట్లు రబ్బరు తెచ్చి ఇస్తే వారిని విడిచి పెట్టేవారు.

ఈ క్రమంలో వేలాది మంది మహిళలు సదరు ప్రైవేటు సైనికుల లైంగిక దాడికి.. ఆకలికి మరణించేవారు. రబ్బరు.. ఏనుగు దంతాల కోసం పురుషులను కొరడాలతో కొట్టేవారు. బానిసలుగా మార్చి వారిని దారుణంగా హింసకు గురి చేస్తూ.. తమకు కావాల్సిన రబ్బరు.. ఏనుగు దంతాల కోసం హింసించేవారు. లియోపోల్డ్ 23 ఏళ్ల క్రూర పాలనలో కాంగోలో దాదాపు కోటి మంది (అక్షరాల) ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కాంగోలో జనాగా 2 కోట్లు. అలా కాంగో వనరుల్ని కొల్లగొట్టిన రాజు భారీగా ఆర్జించాడు. ఆ రక్తపు డబ్బుతో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్.. యాంట్ వెర్ప్ నగరాల్లో పెద్ద పెద్ద ప్యాలెస్ లు.. పబ్లిక్ భవనాలు.. స్మారక చిహ్నాలను నిర్మించాడు. ఈ రోజున బ్రస్సెల్స్ లో కనిపించే అందమైన భవనాలు.. స్మారకాల వెనుక అసలేం జరిగిందో మీకు ఇప్పుడు అర్థమైందా?

మరి..ఇంత జరుగుతున్నప్పుడు అక్కడి వారంతా ఊరుకున్నారా? ఎటూ పోయే ప్రాణమే కదా? అని పోరాడలేదా? అంటే.. పోరాడారు. కానీ.. తమ ఉనికి కోసం.. ప్రాణాలు కాపాడుకోవటానికి పోరాడే వారందరి వద్ద సంప్రదాయ ఆయుధాలైన విల్లు.. బాణాలు ఉంటే.. వారి మీద అధిక్యతను ప్రదర్శించే బెల్జియం రాజు ప్రైవేటు సైన్యం వద్ద మాత్రం ఆయుధాలు.. బుల్లెట్లు ఉండేవి. దీంతో.. కాంగో ప్రజల పోరు ఎప్పుడూ తక్కువగా ఉండేది.

ఇక్కడే మనల్ని బ్రిటీషోడు ఎలా అయితే విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని అమలు చేశాడో.. కాంగోలోని వేర్వేరు తెగలకు చెందిన వారి మధ్య పంచాయితీ పెట్టి.. తన అధిక్యత తగ్గకుండా చూసుకునేవాడు. కాంగోలోని వేర్వేరు తెగల మధ్య ఉండే అభిప్రాయభేదాల్ని తనకు అనుకూలంగా మార్చుకొని.. తన ప్రైవేటు సైన్యంలో వారిని చేర్చుకొని.. వారికి పత్ర్యర్థులైన వారి మీద వీరిని ప్రయోగించేవారు. అయితే.. ఈ తెగలకు ఉన్నతాధికారులుగా మాత్రం బెల్జియం జాతీయులు ఉండేవారు. ఈ కారణంగానే కాంగో తెగలు సంఘటితం కాలేకపోయాయి. కాంగో ప్రజలు పోరాడలేదని చెప్పటం లేదు. కొన్ని పెద్ద తిరుగుబాట్లు ఉన్నప్పటికి.. కాంగో ప్రజల మధ్య ఐక్యత లేకపోవటం.. తెగలు ఎన్ని ఉన్నా సంఘటితమై.. బెల్జియం రాజుకు వ్యతిరేకంగా పోరాడాలన్న భావనను తీసుకొచ్చి.. అందరిని ఏకతాటి మీదకు తెచ్చి.. వారిని ముందుకు నడిపే మహానాయకుడు లేకపోవటమే అసలుసిసలైన లోటు.

మరి.. ఈ అరాచకానికి ఎలా ఫుల్ స్టాప్ పడింది? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అక్కడికే వస్తున్నాం. రబ్బరు తోటల్లో జరుగుతున్న అరాచకం.. బెల్జియం రాజు చేస్తున్న కిరాతక చర్యల్ని బ్రిటన్.. అమెరికాకు చెందిన జర్నలిస్టులు పెద్ద ఎత్తున కథనాలు పబ్లిష్ చేయటంతో అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.. దీంతో 1908లో బ్రిటన్.. అమెరికా ఒత్తిడితో బెల్జియం రాజు లియోపోల్డ్ కాంగో దేశంపై తనకున్న వ్యక్తిగ యాజమాన్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బెల్జియం దేశం కిందకు కాంగో వెళ్లిపోయింది. 1960లో ఆ దేశానికి స్వాతంత్య్రం లభించింది. అప్పటివరకు ఆ దేశంలో వనరుల దోపిడీ సాగుతూనే ఉంది.

ఆఫ్రికా ఖండంలో యూరోపియన్ల సామ్రాజ్యవాదం ఎంతటి ఘోరాలకు పాల్పడిందన్న దానికి కాంగోలో బెల్జియం చేసిన దారుణాలే నిదర్శనంగా చెప్పొచ్చు. ఇదంతా చదువుతున్నప్పుడు అమెరికా.. బ్రిటన్ లు మనకు ఎంతో మంచి దేశాలుగా..ఏమైనా వారికి అంతో ఇంతో నీతి ఉందన్న భావం కలుగుతుంది. ఇదే అతి పెద్ద తప్పు. ఇక్కడే మరో చేదు వాస్తవాన్ని చెప్పుకోవాలి. ఎలాంటి భావోద్వేగ సంబంధం లేని ఒక దేశంతో మరో దేశానికి ఏం బంధం ఉంటుంది? కాంగో ప్రజలు ఏమైతేనేం? బ్రిటన్.. అమెరికాలు పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? నిజంగానే వారికి కాంగోకు మంచి చేయాలనో.. ఆ దేశాన్ని.. ఆ దేశ ప్రజలు పడుతున్న నరకానికి ముగింపు పలకాలని ముందుకు రాలేదు. గళం విప్పలేదు. తమ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తింటున్న అంశంతో పాటు.. ఇలానే వదిలేస్తే.. తమకు మించిన శక్తివంతుడిగా మరొకరు మారటానికి ఇష్టం లేకనే వారు స్పందించారని చెప్పొచ్చు.

మరింత వివరంగా చెప్పాలంటే..బ్రిటన్ కు చెందిన ఇ.డి. మోరెల్ అనే షిప్పింగ్ క్లర్క్.. బెల్జియం నుంచి కాంగోకు కేవలం పిస్టళ్లు.. మందుగుండు సామాగ్రి మాత్రమే వెళుతున్నాయని.. కాంగో నుంచి బ్రిటన్ కు మాత్రం బిలియన్ల కొద్దీ విలువైన రబ్బరు.. వజ్రాలు వస్తున్నట్లుగా గుర్తించాడు. అదే సమయంలో కాంగోకు వెళ్లిన ఒక అఫ్రికన్ అమెరికన్ మెషనరీ విలియం షెపర్డ్.. ఆదేశంలో రబ్బరు టార్గెట్ రీచ్ కాని వారి కాళ్లు.. చేతులు నరికి వేసిన ఫోటోలని తీసుకొచ్చి పత్రికల్లో ప్రచురించాడు. దీంతో ఒక్కసారిగా అమెరికా, బ్రిటన్ లు నిద్ర లేచాయి. 1884లో బెర్లిన్ కాన్ఫరెన్స్ లో కాంగోను లియోపోల్డ్ కు అప్పగించినప్పుడు పెట్టిన నిబంధన అమలు కాకపోగా.. తమ దేశ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా వ్యవహరించిన బెల్జియం రాజు వైనం వారికి అర్థమైంది.

బెర్లిన్ కాన్ఫరెన్సు ఒప్పందం ప్రకారం కాంగోలో బ్రిటన్.. అమెరికా.. ఫ్రాన్స్ లాంటి ఏ దేశమైనా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ.. లియోపోల్డ్ మాత్రం కాంగోను తన సొంత ఆస్తిగా మార్చేసి.. భారీ ఎత్తున వనరుల్ని కొల్లగొడుతూ బిలియన్ల డాలర్లు వెనకేసుకోవటం.. ఆ విషయాన్ని అమెరికా.. బ్రిటన్ దేశాలు ఆలస్యంగా గుర్తించటంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. ఇదే పరిస్థితి మరికొంతకాలం సాగితే..చిన్న దేశమైన బెల్జియం.. దాని రాజు మరింత శక్తివంతం కావటం వారికి అస్సలు నచ్చలేదు. అప్పట్లో ప్రపంచాన్ని శాసిస్తున్న బ్రిటన్ కు తన కంటే చిన్నదేశమైన బెల్జియం.. దాని రాజు మహా సంపన్నుడిగా ఎదగటానికి తట్టుకోలేకపోయింది.

కాంగో లభించిన అపార సంపదతో లియోపోల్డ్ యూరప్ నడిబొడ్డున బలమైన ఆర్థిక శక్తీగా మారటం.. ఇది భవిష్యత్తులో ఐరోపా ఖండంలో తమ ఆధిపత్యానికి, ఆఫ్రికాలో తమ కాలనీలకు ముప్పుగా మారుతుందని బ్రిటన్ భావించింది. అమెరికాకు ఈ పరిణామం ఇబ్బందిగా మారింది. ఆ సమయంలోనే అమెరికా కొత్త శక్తిగా ఎదుగుతోంది. ఆఫ్రికాలోని సహజ వనరులు.. ఖనిజాల మీద అమెరికా కన్ను పడింది. లియోపోల్డ్ ఉన్నంత కాలం తమకు వ్యాపార అవకాశాలు దొరకవన్న విషయాన్ని గ్రహించింది. అదే సమయంలో కాంగోలో అతగాడి అరాచకాలు బయటకు రావటంతో.. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకొని బెల్జియంకు చెక్ పెట్టింది.

ఇదంతా చూసిన తర్వాత ఎవరికి మీద ఎవరికి ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉండవన్నది ఇదంతా చూసినప్పుడు అర్థమవుతోంది. బలహీనుడి సంపదను బలవంతుడు ఎలా దోచేస్తారన్నదానికి ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు. ఇలా కాంగోను ఎవరికి వారు వనరులను పీల్చేయటంలో ఎవరూ తక్కువ కాదు. ఇలా ఆఫ్రికా సంపదను కొల్లగొట్టిన ప్రాశ్చాత్య దేశాలు.. ముఖ్యంగా యూరోప్ ఇప్పుడు కొత్త తలనొప్పిని ఎదుర్కొంటోంది. ఆయా దేశాల్లో జనాభా తగ్గటం.. ఆర్థిక మందగమనం లాంటి సమస్యల వేళ.. ఆఫ్రికా దేశాల్లో పెరుగుతున్న నిరుద్యోగం.. సమర్థవంతమైన ప్రభుత్వాలు లేకపోవటంతో ఉపాధి కోసం ఇప్పుడు తమకు సమీపంలోని యూరోప్ దేశాలకు వలసల రూపంలో పోటెత్తుతున్న పరిస్థితి.

ఇక్కడ భౌగోళిక అంశాల్ని కాస్త ప్రస్తావించాలి. మొరాకో - స్పెయిన్ దేశాల మధ్య జిబ్రాల్డర్ జలసంధి వెడల్పు కేవలం 14 కి.మీ. మాత్రమే. దీంతో ఆఫ్రికా నుంచి వలసలు మొరాకో నుంచి పడవల్లో స్పెయిన్ దక్షిణ తీరానికి సులువుగా చేరుకునే పరిస్థితి. ఉత్తర ఆఫ్రియా దేశాలైన ట్యునీషియా, లిబియా నుంచి ఇటలీకి చెందిన లాంపెడుసా ద్వీపం, సిసిలీ దీవులు చాలా దగ్గరగా ఉంటాయి. ట్యూనీషియా నుంచి లాంపెడుసా కేవలం 113 కి.మీ. దూరంలోనే ఉంది. ఇప్పుడు వెల్లువెత్తుతున్న వలసల్ని సరిగా నియంత్రించకపోతే యూరోపియన్ దేశాలకు మొదటికే మోసం వచ్చే పరిస్థితి.

అందుకే.. ఇప్పుడు అత్యవసరంగా యూరోపియన్ యూనియన్ సమావేశమవుతోంది. వలసల కట్టడికి చేపట్టాల్సిన చర్యల మీద వారు మధనం చేసే పరిస్థితి. నిజానికి ఆఫ్రికా దేశాల్లో వనరుల తరలింపుతో పాటు.. ఆ దేశాల్లో పరిశ్రమల స్థాపన.. ఉపాధి కల్పన.. స్థిరమైన ఆర్థిక వ్యవస్థల నిర్మాణానికి పెట్టుబడులు పెట్టి ఉంటే ఇప్పుడీ సమస్య దాపురించేది కాదు. వనరులు కొల్లగొట్టేది ఆఫ్రికాలో అయితే.. వాటి ఉత్పత్తులకు వేదికలుగా తాము ఉండి సంపదను పోగేయటం మీదనే ఎక్కువగా ఫోకస్ చేయటంతో.. ఆఫ్రికా దేశాల నుంచి వలసలు భారీగా యూరోపియన్ దేశాల మీద పడిపోతున్న పరిస్థితి.

ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్.. ఫ్రాన్స్.. స్పెయిన్ లాంటి యూరోపియన్ దేశాలు ఇప్పుడు ఆర్థికంగా.. సైనికంగా పూర్వపు శక్తిని కోల్పోయావన్నది వాస్తవం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అమెరికా.. చైనా.. భారత్ లాంటి ఎదుగుతున్న దేశాల వైపు మొగ్గుతుందన్నది నిజం. ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశాల నుంచి శరణార్థులను తమ దేశంలోకి వచ్చే ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఆయా దేశాల్లో భారీ ఎత్తున పెట్టుబడులుపెట్టి.. ఉపాధి అవకాశాలు పెంచటం మీదనే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే అంతో ఇంతో మార్పు వచ్చే వీలుంది. లేనిపక్షంలో యూరోప్ లో శాంతిభద్రతల సంక్షోభం ఖాయం. ఇప్పటికే వలస వచ్చిన పలువురు స్థానిక చట్టాల్ని గౌరవించకపోవటంతో స్థానికులకు.. వలసదాులకు మధ్య అల్లర్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్రవాద ముఠాలు అక్రమ వలసల రూపంలో చొరబడితే.. యూరోపియన్ దేశాలకు కొత్త సవాలు ఎదురైనట్లే.