Begin typing your search above and press return to search.

‘కాక్రోచ్’ పార్టీకి వ్యతిరేకంగా ‘హిట్’!!

బొద్దింకలు (కాక్రోచ్) చంపేందుకు 'హిట్' స్ప్రేను ఎలా వాడుతామో.. సోషల్ మీడియాలో ఈ కాక్రోచ్ పార్టీ జోరుకు బ్రేకులు వేసేందుకు 'హిట్’ పేరుతోనే ఓ యూజర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తి రేపుతోంది.

By:  Tupaki Political Desk   |   22 May 2026 6:04 PM IST
‘కాక్రోచ్’ పార్టీకి వ్యతిరేకంగా ‘హిట్’!!
X

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వింతైన, వినూత్నమైన డిజిటల్ యుద్ధం నడుస్తోంది. యువ విమర్శకులను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన 'కాక్రోచ్' వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 15న ట్విటర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ పెడుతున్నట్లు ఓ యువకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యంగ్య పార్టీకి సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతోంది. రోజురోజుకు ఫాలోవర్ల సంఖ్య పెరుగుతుండటంతో కాక్రోచ్ పార్టీ దూసుకుపోతోంది. ప్రధాన రాజకీయ పార్టీలను మించిన ఫాలోయింగ్ తో కాక్రోచ్ పార్టీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ కాక్రోచ్ పార్టీకి వ్యతిరేకంగా, ‘HIT జనతా పార్టీ’ పుట్టుకొచ్చింది.

బొద్దింకలు (కాక్రోచ్) చంపేందుకు 'హిట్' స్ప్రేను ఎలా వాడుతామో.. సోషల్ మీడియాలో ఈ కాక్రోచ్ పార్టీ జోరుకు బ్రేకులు వేసేందుకు 'హిట్’ పేరుతోనే ఓ యూజర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. దీంతో ఆన్‌లైన్ వేదికగా కాక్రోచ్ వర్సెస్ హిట్ యుద్ధం సెగలు పుట్టిస్తోందని చెబుతున్నారు. తామే ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటూ కాక్రోచ్ ఆర్మీ తమ నిరసనను డిజిటల్ ప్రకటనలతో హోరెత్తిస్తుంటే.. హిట్ ఆర్మీ కౌంటర్ మీమ్స్, రీల్స్‌తో దాడి చేస్తోందని చెబుతున్నారు. దీంతో ఇంటర్ నెట్ మొత్తం ఫన్నీ వీడియోలు, పోస్టర్లతో నిండిపోతోందని అంటున్నారు. ఇన్‌స్టాలో కాక్రోచ్, హిట్ పార్టీల రీల్స్, మీమ్స్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు.

దూసుకుపోతున్న ‘కాక్రోచ్’

ఇక ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఇన్‌స్టాగ్రామ్‌లో ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది. కేవలం వారం రోజుల్లోనే ఇన్‌స్టాలో 20.2 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించింది. దేశంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కన్నా ఈ సంఖ్య చాలా ఎక్కువ కావడం విశేషంగా చెబుతున్నారు. ‘ఎక్స్’లో కాక్రోచ్ పార్టీ సృష్టిస్తున్న కల్లోలంతో కలత చెందిన ప్రభుత్వ అనుకూల వర్గాలు ఫిర్యాదు చేయడంతో నిన్న సీజేపీ అకౌంట్ ను నిలిపివేశారు. దీంతో వెంటనే కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అంటూ మరో అకౌంటు పుట్టుకొచ్చింది. దీంతో ప్రభుత్వ వర్గాలు హిట్ జనతా పార్టీని ఏర్పాటు చేసి కౌంటర్ అటాక్ చేస్తున్నాయని అంటున్నారు.

నిరసనస్వరాలేనా?

కాగా, సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ పేజీ రీచ్ ను చూసి ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన ఎక్కవవుతోందని పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాక్రోచ్ పార్టీ పేరిట యువత నిరసన స్వరాలు మీమ్స్, రీల్స్, వీడియోల రూపంలో బయటకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ వర్గాలు ఈ పరిణామంపై జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. యువతలో ఈ స్థాయి అసహనం పెరగడానికి కారణాలేంటి? అన్న అంశాలపై అధ్యయనం చేయడం మంచిదని పరిశీలకులు సూచిస్తున్నారు.