కాక్రోచ్...సక్సెస్ అయినట్లేనా ?
ఇక కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో జేపీ నడ్డా చర్చలు జరపడం అతి ముఖ్యమైన పరిణామంగానే చూస్తున్నారు.
By: Satya P | 21 July 2026 12:57 AM ISTకాక్రోచ్ జనతా పార్టీ. ఇదేదో సెటైరికల్ గా పెట్టుకున్న పేరు అనుకున్నారు. తీరా చూస్తే రెండు నెలల తేడాలో బీజేపీతో చర్చలను జరిపే స్థాయికి చేరుకుంది అంటే సీజేపీ ఎక్కడ నుంచి ఎక్కడికి చేరుకుంది అన్నది అర్ధమవుతోంది కదా అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాధరణంగా ఒక ర్యాలీ కానీ ఆందోళ కానీ పోలీసులు తలచుకుంటే ఆపేయగలరు. అది ఎంత పెద్ద పార్టీ నిర్వహించినా మరెంత పెద్ద నేతలు పిలుపు ఇచ్చినా కూడా దానిని కట్టడి చేయడం పోలీసులకు సులువైన పనే. ఇది ఎన్నో సార్లు రుజువు అయింది. కానీ కాక్రోచ్ పార్టీ జూలై 20న పార్లమెంట్ కి మార్చ్ అని పిలుపు ఇచ్చింది. అనుకున్నది అనుకున్నట్లుగా దానిని నెరవేర్చింది. పార్లమెంట్ దాకా కాక్రోచ్ దండు చేరుకుని నినదించడం ఒక బిగ్ సక్సెస్ అనుకుంటే బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ ప్రతినిధులు చర్చలు జరపడం మరో బిగ్ సక్సెస్ అని అంటున్నారు.
లైట్ తీసుకోలేని విధంగా :
ఒక రిజిస్టర్ పార్టీ కాదు, ఒక నాయకుడు కూడా వెంట లేరు. కానీ కాక్రోచ్ పార్టీతో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రపంచంలో అతి పెద్ద మెంబర్ షిప్ ఉన్న పార్టీ, దేశంలో అత్యధిక రాష్ట్రాలలో అధికారం నెరుపుతున్న పార్టీ ముమ్మారు గెలిచి కేంద్రంలో అధికారాన్ని కొనసాగిస్తున్న పార్టీ చర్చలు జరిపింది అంటే కాక్రోచ్ ని లెక్కలోకి తీసుకున్నట్లే కదా అని అంటున్నారు. కాక్రోచ్ పార్టీ వెనక ఎవరు ఉన్నారు అంటే దానికి జవాబు జంతర్ మంతర్ వద్ద కనిపించింది. అలాగే పార్లమెంట్ కి మార్చ్ చేసే చోట కనిపించింది. ఎటు చూసినా ఉవ్వెత్తిన యువగళంతో కాక్రోచ్ పార్టీ నవ శకం కనిపించింది. అందుకేనేమో కాక్రోచ్ పార్టీలో అంత ధీమా ఉంది. తమ పిలుపే ప్రభంజనం గా మారిందని వారికి అర్థమయ్యేలా దీక్షలకు పోరాటాలకు సిద్ధం అయ్యారని అంటున్నారు.
అదే కీలక పరిణామం :
ఇక కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో జేపీ నడ్డా చర్చలు జరపడం అతి ముఖ్యమైన పరిణామంగానే చూస్తున్నారు. ఇక చూస్తే కేంద్ర మంత్రి న్యూఢిల్లీలో నిరసనకారుల ప్రతినిధులతో సమావేశమవ్వదం విశేషం. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని నిరసనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని దాంతో వారితో చర్చలు జరిపామని ఆయన తెలిపారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని చెప్పారు. నిరసనకారుల ప్రతినిధి బృందంతో వివరంగా ప్రాథమిక మౌఖిక చర్చలు జరిగాయని అనంతరం వారు కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వక వినతి పత్రాన్ని సమర్పించారని కేంద్ర మంత్రి చెప్పారు. దెశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నవారు తమ ఆందోళనను విరమించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడం లో ప్రభుత్వానికి సహకరించాలని నడ్డా కోరారు.
ఇక ముందేంటి :
ఇదిలా ఉండగా కాక్రోచ్ పార్టీ భారీ ఆందోళన కార్యక్రమం విజయవంతం అయిన నేపథ్యంలో తరువాత ఏమి జరుగుతుంది అన్న చర్చ జరుగుతోంది. తర్వాత వారి అడుగులు ఎలా ఉంటాయి అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. దేశ రాజకీయాల్లో కాక్రోచ్ పార్టీ కీలకంగా మారుతుందా లేక విద్యార్థులు యువత సమస్యల మీద ఒక సామాజిక వేదికగా మారి ఆందోళనలు చేపడుతుందా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.
