కాక్రోచ్ పార్టీకి బలం ఎక్కడ నుంచి వస్తోంది ?
ఏదో కాక్రోచ్ పార్టీ వాట్సప్ ద్వారా ఇన్స్టా ద్వారా సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన పార్టీ అని లైట్ తీసుకుంటే ఈ రోజుకి పెరిగి పెద్దదవుతోంది.
By: Satya P | 20 July 2026 12:40 AM ISTఏదో కాక్రోచ్ పార్టీ వాట్సప్ ద్వారా ఇన్స్టా ద్వారా సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన పార్టీ అని లైట్ తీసుకుంటే ఈ రోజుకి పెరిగి పెద్దదవుతోంది. ఏకంగా పార్లమెంట్ వద్ద భారీ ర్యాలీకి పిలుపు ఇచ్చే స్థాయికి ఈ పార్టీ గమనం సాగుతోంది. కాక్రోచ్ పార్టీ అంటే కుర్రాళ్ళ గోల అనుకుని ఉదాశీనం వహించడం కుదరదు అని గట్టిగా చెప్పాలని చూస్తోంది. మే 16న ఈ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఏర్పాటు అయింది. జూలై కి వచ్చేసరికి ఫిజికల్ గానే ఉద్యమిస్తోంది. జంతర్ మంతర్ వేదిక వద్ద సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అమరణ దీక్షలో ఉన్నారు. ఆయన ఈ నెల 20న పార్లమెంట్ మార్చ్ కి సీజేపీ తరఫున పిలుపు ఇచ్చారు. అయితే దీనికి ఇంతవరకూ పోలీసులు అనుమతి లేదని అంటున్నారు. అయినా సరే పార్లమెంట్ పరిసరాలతో పాటు కీలక ప్రాంతాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసి ఉంచారు. పోలీసు బలగాలు అన్ని చోట్ల మోహరించాయి.
పట్టించుకోకపోవడమే :
ఎక్కడ ఏ రూపంలో అసంతృప్తి ఉన్నా ఆది బలంగా మారడానికి చూస్తుంది. దాని కోసం అవసరమైన వేదికను అది నిర్మించుకుంటుంది. ఇది సహజసిద్ధమైన ప్రక్రియగానే సాగిపోతుంది. వ్యక్తులు పేరులు వారి బలాలు వారి నేపధ్యం ఇక్కడ ప్రశ్న కాదు, వెనక ఉన్న అసంతృప్తి ఏమిటి అది ఎలా వచ్చింది, మూలాలు ఏమిటి అన్నది లోతైన పరిశీలన చేయాల్సిన అవసరం ఎపుడూ ఉంటుంది. దానిని కనుక చూడకపోతే ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోతే మాత్రం ఇలా కొత్తగా పుట్టుకొచ్చిన వేదికలే క్రమంగా బలోపేతం అవుతాయి. ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం అసోం రాష్ట్రంలో యువ న్యాయవాదులు అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలెట్టి భారీ ఉద్యమాలు తీసి చివరికి అసోం గణ పరిషత్తుని స్థాపించి ప్రభుత్వాన్నే ఏర్పాటు చేయగలిగారు. అలా యువ నాయకుడు అప్పటికి అవివాహితుడు అయిన ప్రఫుల్ల కుమార్ మహంత ముఖ్యమంత్రి పీఠం అందుకున్నారు. ఈ దేశంలో యువతకు అధికారం అంటే అదొక ప్రత్యక్ష ఉదాహరణగా చెబుతూ ఉంటారు.
సీరియస్ గానే సీజేపీ :
సీజేపీ అన్నది సెటైరికల్ గా ఏర్పాటు అయిన రాజకీయ వేదిక అని మొదట్లో అనుకున్నా ఇపుడు చూస్తే ప్రతీ ప్రజా సమస్య మీద సీరియస్ గానే మాట్లాడుతోంది. గట్టిగానే గళం విప్పుతోంది. విపక్షాలు సైతం సీజేపీ వాదనకు మద్దతుగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సీజేపీ రాజకీయ కోణానికి ఎత్తుకున్న అంశాలకు బలమైన ఆమోద ముద్ర పడుతోంది. ఇక యువత కూడా సీజేపీకి మద్దతుగా ఉన్నారని అంటున్నారు యువతలో ఎపుడూ అసహనం ఉంటుంది. అసంతృప్తి ఉంటుంది. వారిది ఇన్స్టెంట్ ఫైర్. అలా వచ్చేస్తుంది. అయితే దానిని నిలిపి ఉంచేలా చేయడంలోనే సీజేపీ లాంటి కొత్త వ్యవస్థల నేర్పూ ఓర్పూ ఆధారపడి ఉంటాయి. ఇక్కడ సీజేపీ చేస్తున్నది అదే నీట్ పరీక్షా పత్రం లీక్ అంటూ మొదలెట్టిన ఈ సోషల్ మీడియా ఉద్యమం కాస్తా ఇపుడు గ్రౌండ్ లోకి దిగింది. చలో పార్లమెంట్ అంటోంది. ఎంత మద్దతు అన్నది తరువాత తెలుస్తుంది, కానీ సీజేపీ కూడా ఒక నిరసన గళమేనా అని ఉదాశీనంగా ఉంటే మాత్రం ఇబ్బందే అన్నది తెలియచెప్పే లాగానే పరిణామాలు ఉండబోతున్నాయి.
వ్యతిరేకత పోగు చేసి :
సీజేపీ లాంటివి నిజానికి రాజకీయంగా గెలిచేటంత సీన్ ఉండదు, అదే అవతల వారి ధైర్యం కూడా కావచ్చు. కానీ ఇలాంటి వేదికలు కచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని ఎంతో కొంత ప్రతిబింబిస్తాయి. అంతే కాదు వ్యతిరేకతను నెమ్మదిగా పోగు చేసి పెడతాయి. ఆ వాతావరణాన్ని వాడుకునే స్థితిలో విపక్షాలు బలంగా ఉంటే మాత్రం అది అధికార పక్షానికి ఎపుడూ ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే ఎవరు ప్రశ్నించారు అన్నది ప్రధానం కాదు, ఏ విషయం మీద అన్నది అతి ముఖ్యం. లోపాలు ఉంటే సర్దుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా లైట్ తీసుకుంటే మాత్రం ఇంతింతై వటుడింతే అన్నట్లుగా అసంతృప్తులే ఒక వేదికగా మార్చుకుంటాయి. ఇక్కడ ఒక్కటే విషయం చెప్పాలి. సీజేపీ లాంటి పార్టీల ఉనికి వాటి బలం ఎక్కడ ఉంది అంటే అధికార పక్షాల ఉదాశీనత నుంచే అన్నదే జవాబు.
