Begin typing your search above and press return to search.

పాల పొంగు కాక్రోచ్...హుష్ గప్ చుప్ !

యువత అంటేనే వేడి. అది పాలపొంగు లాంటిది. దాని శక్తి అపారం. అదే సమయంలో ఉనికి అతి స్వల్పం.

By:  Satya P   |   24 Sept 2026 8:54 AM IST
పాల పొంగు కాక్రోచ్...హుష్ గప్ చుప్ !
X

యువత అంటేనే వేడి. అది పాలపొంగు లాంటిది. దాని శక్తి అపారం. అదే సమయంలో ఉనికి అతి స్వల్పం. యువ శక్తిని మోహరించి గట్టిగా కట్టి సమర భేరీ మోగిస్తే అది అతి పెద్ద భూకంపమే సృష్టిస్తుంది. కానీ యువ శక్తిని సంఘటితం చేయడం ఎంత సులువో దీర్ఘ కాలం కట్టి ఉంచడం అంత కష్టం. ఇపుడు అలాంటి పరిస్థితినే కాక్రోచ్ జనతా పార్టీ ఎదుర్కొంటోందని అంటున్నారు. సరిగ్గా నాలుగు నెలల క్రితం సీజేపీ అన్న ఆన్ లైన్ పార్టీ ఒక ప్రభంజనం. ఎక్కడ చూసినా అవే ఊసులు. అవే మాటలు. అవే నినాదాలు. ఈ దేశాన్ని దాని గతిని మార్చేసే సత్తా ఉన్న యువత అంతా దాని వెంట ఉన్నారు అని అంతా అనుకునేంతగా ఒక ప్రభంజనం వీచింది. అయితే ఇది ఒక అతి పెద్ద ఉద్యమానికి మాత్రమే నాయకత్వం వహించి అందులో అద్భుతమైన విజయం అయిన తరువాత చప్పబడిపోయిందా అన్న చర్చ వస్తోంది.

జంతర్ మంతర్ మ్యాజిక్ :

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేసిన భారీ ఉద్యమంతో కేంద్రంలో బలమైన పార్టీకి ప్రభుత్వానికే కలవరం రేగినంత పని అయింది. ఏకంగా ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో ఆ విజయం అపూర్వం అద్వితీయం అని అంతా అనుకున్నారు. ఇక దాని తరువాత చూస్తే ఈ దేశానికి నవ నాయకత్వం వస్తుందని జెన్ జీతోనే ఈ దేశం కొత్త దశను దిశను వెతుక్కుంటుందని అనేక రకాలుగా విశ్లేషణలు అయితే వినిపించాయి. తీరా చూస్తే సీన్ వేరేలా ఉంది అని అంటున్నారు. ఇక సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ అభిజీత్ దీప్కే దీని తరువాత పాఠశాలలు మౌలిక సదుపాయాలు అని మరో ఉద్యమానికి పిలుపు ఇచ్చారు. అయితే అది అనుకున్నంతగా స్పందన పొందలేదు. ఆ తరువాత సీజేపీ తన విధి విధానాలు ఏమిటో తెలుసుకునే పనిలో ఉందా లేక స్తబ్దుగా ఉందా అన్నది అర్థం కాని స్థితిలోకి వెళ్ళింది అని అంటున్నారు.

ఢిల్లీ వర్శిటీ సక్సెస్ తో :

ఇక ఢిల్లీ వర్శిటీ విద్యార్ధి సంఘానికి జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో సీజేపీ ఎక్కడ ఉంది అని ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ కీలకమైన పదవులు అన్నీ బీజేపీ అనుబంధం అయిన విద్యార్ధి సంస్థ ఏబీవీపీ సొంతం చేసుకుంది అని గుర్తు చేస్తున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం తాజా ఫలితాలు చూస్తే కనుక సీజేపీ ప్రభావం మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా జెన్ జీ యువతలో సీజేపీ పట్టు గట్టిగా ఉంటే ఈ ఫలితాలు వేరే విధంగా వచ్చేవని అంటున్నారు. అంటే సీజేపీ ఒక్క ఉద్యమంతోనే తన పరుగుని ఆపేసిందా అన్న కొత్త చర్చ కూడా మొదలవుతోంది.

ఊపు కాదు చూపు కావాలి :

ఊపు ఉత్సాహం అన్నవి పాల పొంగు లాంటివి. అవి ఎంతో సేపు ఉండవు. ఒక పటిష్టమైన కార్యాచరణ కోసం తగిన చూపు ఉండాలి. అలాగే ఏమి చేయాలి, ఏమి చేయబోతున్నామన్న స్పష్టత ఉండాలి. అది లేకపోతే మాత్రం ఫలితం ఉండదని అంటున్నారు. సీజేపీ ఇపుడు యువత మనసులను గెలుచుకోవడానికి మరో తప్పు కేంద్రం చేయాలని చూస్తోందా అన్న చర్చ వస్తోంది. ఒక వేళ అలా చేసినా తిరిగి యువత దానికి ఏ విధంగా కనెక్ట్ అవుతారు అన్నది మరో ప్రశ్నగా ఉంది. అంతే కాదు అన్ని ఉద్యమాలు జంతర్ మంతర్ కావు అని అంటున్నారు. ఇక యువత ఎపుడూ తన కెరీర్ మీదనే ఫోకస్ పెడతారు, పైగా వారు పోరాటాలలో నిజాయతీని చూస్తారు. రాజకీయ రంగు రుచి వాసన ఉంటే ఆ వైపు చూడరని అంటారు. నీట్ పరీక్ష విషయంలో జరిగిన తప్పులే యువత ఉద్రేకానికి కారణం అయ్యాయి. దాంతో వారి ఆవేశం ఆన్ లైన్ వేదికగా పెల్లుబికింది. దానికి సీజేపీ రూపంలో వేదిక దొరికింది.

ఒక అద్భుతం జరిగింది :

అలా ఒక అద్భుతం జరిగింది. ముందే చెప్పుకున్నట్లుగా అద్భుతాలు అంటే అవి ఎపుడో ఒకసారి జరుగుతాయి. అవి జరిగిన తరువాతనే వాటి ప్రభావాన్ని చూస్తారు. అంటే అద్భుతం సృష్టించాలని ఎవరు అనుకున్నా అది వెర్రి తనమే అవుతుంది. ఇపుడు దేశంలో జెన్ జీ పాలకులకు అనుకూలమా వ్యతిరేకమా అన్నది ప్రశ్న కాదు, వారు సంఘటితం అయ్యేంత పెద్ద అంశం ఎపుడు వస్తుంది అన్నదే ప్రశ్న. ప్రస్తుతానికి అయితే సీజేపీలో హుష్ గప్ చుప్ అన్నట్లుగా సైలెన్స్ ఉందని అంటున్నారు. యువతను తట్టి లేపిన సంస్థగా ఒక భావన అయితే జనంలో ఉంది. మంచి విధానాలతో ముందుకు వస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో చూడాలి మరి.