దీపావళి వరకూ హాలీ డేస్..సీజేపీ నిరసనలకు బ్రేక్
విద్యార్ధులు జెన్ జీ లకు వేదికగా నిలిచిన కాక్రోచ్ జనతా పార్టీ వారికి ఇబ్బంది లేని విధంగా ఉద్యమాలను నిర్మిస్తోంది.
By: Satya P | 20 Oct 2026 8:03 PM ISTవిద్యార్ధులు జెన్ జీ లకు వేదికగా నిలిచిన కాక్రోచ్ జనతా పార్టీ వారికి ఇబ్బంది లేని విధంగా ఉద్యమాలను నిర్మిస్తోంది. అందుకే దీపావళి దాకా హాలీడేస్ ని ప్రకటించింది. ఉద్యమాలకు పోరాటాలకు ప్రస్తుతానికి బ్రేక్ అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. ఈ హాలీ డేస్ లో కాక్రోచ్ ఫ్రెండ్స్ అంతా తమ కుటుంబాలతో ఎంతో హ్యాపీగా గడపాలని ఆయన సూచించారు. అంతే కాదు సీజేపీకి ఇప్పటిదాకా మద్దతుగా కాక్రోచ్ ఫ్రెండ్స్ నిలిచారు అని గుర్తు చేసుకున్నారు.
ఆపేది లేదంటూ :
అదే సమయంలో సీజేపీ ఉద్యమాలను ఎక్కడా ఆపేది లేదని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ప్రస్తుతానికి విరామం మాత్రమే ప్రకటిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. దేశంలో దీపావళి వరకూ ఎలాంటి నిరసనలు చేపట్టబోమని చెబుతూనే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫైట్ చేస్తూనే ఉందామని కూడా కాక్రోచ్ ఫ్రెండ్స్ ని పిలుపు ఇచ్చారు. అదే సమయంలో ఆయన సీజేపీ నిరసనల ద్వారా మంచి చేస్తున్న తన సహచరులు సౌరవ్, అశుతోష్ సహా ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని భావోద్వేగాలకు గురి అయ్యారు. వారంతా ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
సీజేపీ వ్యూహాత్మకం :
ఇదిలా ఉంటే అక్టోబర్ 10న సీజేపీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు పిలుపు ఇచ్చింది. అయితే దానిని పోలీసు బలగాలతో పెద్ద ఎత్తున నిర్బంధాలతో అడ్డుకున్నారు. సీజేపీ 2.0 అన్న పేరుతో చేపట్టిన ఈ నిరసన అలా సక్సెస్ కాలేదు. దాంతో పాటు సీజేపీ తగిన వ్యూహం లేకుండా రంగంలోకి దిగిందని విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం అయితే పకడ్బందీగానే గ్రౌండ్ లోకి దిగి సీజేపీ ఆటను ముందే పసిగట్టి చెక్ చెప్పేసింది. అంతే కాదు జంతర్ మంతర్ ఇక మీదట ఉద్యమాల వేదిక కాదని ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో సీజేపీకి జంతర్ మంతర్ కి మధ్య బంధం కట్ అయిపోయింది.
కంటిన్యూ కాలేదు :
అలా తొలి విజయం మలి విజయంగా కంటిన్యూ కాలేదు. ఇక జంతర్ మంతర్ వద్ద నిరంతర ఉద్యమాలతో తనకు పండుగ సీజన్ లో వచ్చే ఆదాయాలను గండి కొడుతున్నారని అక్కడి వ్యాపారులు కూడా ఈ నిరసనల మీద మండిపడుతూ వచ్చారు. మరో వైపు చూస్తే సీజేపీ కీలక నేతలు జైలు పాలు అయ్యారు. దాంతో ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన మీదటనే సీజేపీ ప్రస్తుతానికి ఉద్యమాలకు సెలవు అంటూ ప్రకటించింది అని అంటున్నారు. ఉత్తరాదిన దసరా నుంచి దీపావళి వరకూ పండుగల సందడి అధికంగా ఉంటుంది. దాంతో ఉద్యమాలు చేపట్టినా కుదిరే వ్యవహారం కాదని అంటున్నారు.
ఈసారి అయినా :
ఇక సీజేపీ 2.0 అన్నది ఫెయిల్ అయిన తరువాత పునరాలోచనలో పడింది అని అంటున్నారు. దాంతో ఈసారి అయినా పూర్తి వ్యూహంతో రంగంలోకి దిగుతుందా అన్నదే చర్చగా ఉంది. సీజేపీలో ఆవేశం ఉంది కానీ ఆచరణ ముఖ్యమని అంటున్నారు. పైగా రాజకీయం అంటే జెన్ జీలని రప్పించడం కష్టమైన వ్యవహారం. నీట్ పరీక్ష లీకేజ్ మీద ఆందోళన అంటే వారు ఈజీగా కనెక్ట్ అవుతారు. అందుకే సీజేపీ ఇపుడు యూత్ మద్దతు ఎలా దక్కించుకుంటుంది అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది. చూడాలి సీజేపీ ఉద్యమాలు దీపావళి తరువాత ఏ కొత్త రూపుని తీసుకుంటాయో.
