ఆందోళనల నుంచి విజయం వరకు.. “ఇంకా చాలా దూరం ఉంది” సీజేపీ ఫౌండర్
విద్యా వ్యవస్థలోని లోపాలు, నీట్ పేపర్ లీక్ వంటి దారుణాలపై వినూత్నంగా గళమెత్తిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
By: Madhu Reddy | 26 July 2026 6:13 PM ISTవిద్యా వ్యవస్థలోని లోపాలు, నీట్ పేపర్ లీక్ వంటి దారుణాలపై వినూత్నంగా గళమెత్తిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ యువత, జెన్-జీ సపోర్ట్‌తో సాగిన ఈ పోరాటం ఊహించని విజయాన్ని అందుకోవడంతో సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఈ గెలుపు కేవలం ఆరంభం మాత్రమేనని, న్యాయం కోసం సాగే ఈ ప్రయాణంలో తాము ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.
యువత అండతోనే ఈ చారిత్రక విజయం:
డిజిటల్ కమ్యూనికేషన్ నిపుణుడు, సామాజిక కార్యకర్త అయిన అభిజీత్ దీప్కే నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి 'కాక్రోచ్ జనతా పార్టీ' అనే వేదికను స్థాపించారు. ఈ పోరాటం సాధించిన విజయంపై ఆయన స్పందిస్తూ.. "జెన్ జీ, సీజేపీ మద్దతుదారులు లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. ఇక ఇన్ని రోజులు వరుస నిరసనలు చేపట్టడం చాలా కష్టమైన పని. ఇక ప్రశాంతంగా నిద్రపోయి లేచా, ఇప్పుడు మనసులో ఎలాంటి ఆందోళన లేదు. కానీ ఇది ప్రారంభం మాత్రమే, సీజేపీ ఇంకా చాలా ముందుకు సాగాల్సి ఉంది" అని వీడియో మెసేజ్‌లో పంచుకున్నారు.
జంతర్ మంతర్ పోరాటం.. లభించిన ప్రతిఫలం:
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా అభిజీత్ దీప్కే నేతృత్వంలో శాంతియుతంగా నిరసన దీక్షలు సాగాయి. విద్యావ్యవస్థలో పారదర్శకత ఉండాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా అపారమైన మద్దతు లభించింది. ఇక ఈ పోరాటానికి దిగివచ్చి, నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని విద్యార్థుల ప్రజాస్వామ్య విజయంగా అభిజీత్ అభివర్ణించారు.
అనారోగ్యాన్ని సైతం లెక్కచేయని తెగువ:
సమస్యలపై పోరాడే క్రమంలో అభిజీత్ దీప్కే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు టైఫాయిడ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ఐవీ చికిత్స పొందుతున్నారు. ఇక అయినప్పటికీ, తన ఆరోగ్య పరిస్థితిని లెక్కచేయకుండా విద్యార్థుల హక్కుల కోసం, విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణల కోసం తన పోరాటం ఆగేది లేదని స్పష్టం చేయడం ఆయన డెడికేషన్‌కు నిదర్శనంగా నిలిచింది.
మున్ముందు మరిన్ని ఉద్యమాలు:
కేవలం ఒక నిరసనతోనే ఆగిపోకుండా విద్యావ్యవస్థలో పూర్తిస్థాయి మార్పు వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా డిజిటల్ విప్లవానికి నాంది పలికిన ఈ యువత శక్తి, రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఇక విద్యార్థుల హక్కుల కోసం నిలబడిన అభిజీత్ దీప్కే త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
