Begin typing your search above and press return to search.

టాక్ ఆఫ్ ది నేషన్‌గా ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. వైరల్ కంటెంట్, సెటైరిక్ నిరసనలే అస్త్రాలుగా సాగిన ఉద్యమం

కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాక్రోచ్ జనతా పార్టీ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద నేషన్ గా మారిపోయింది.

By:  Tupaki Political Desk   |   25 July 2026 10:28 PM IST
టాక్ ఆఫ్ ది నేషన్‌గా ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. వైరల్ కంటెంట్, సెటైరిక్ నిరసనలే అస్త్రాలుగా సాగిన ఉద్యమం
X

కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాక్రోచ్ జనతా పార్టీ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద నేషన్ గా మారిపోయింది. దేశంలో నిరుద్యోగులు, సమాచార హక్కు కార్యకర్తలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. మే 15న ఒక కేసు విచారణ సందర్భంగా నిరుద్యోగులను పరాన్న జీవులు అంటూ సంభోదించడమే కాకుండా బొద్దింకలతో పోల్చారనే ఆగ్రహంతో అమెరికాలో చదువుకుంటున్న పుణేకు చెందిన అభిజిత్ దీప్కే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో ఎక్స్ లో సెటైరిక్ ఉద్యమం ప్రారంభించారు. ఇది రోజుల వ్యవధిలోనే దేశ యువతను ఆకర్షించడంతో మిలియన్ల కొద్ది ఫాలోవర్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అంతేకాకుండా నీట్ పేపరు లీకును అవకాశంగా తీసుకుని కాక్రోచ్ పార్టీ క్షేత్రస్థాయి ఉద్యమాలకు తెరతీసింది. విద్యావ్యవస్థలో లోపాలను సరిదిద్దాలనే ప్రధాన డిమాండ్ తోపాటు విద్యామంత్రి రాజీనామా చేయాలని విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగగా, కొన్నిచోట్ల ఆ నిరసనల్లో విద్యార్థుల వ్యంగ్య స్పందనలు కూడా ఆకర్షించాయి.

జూన్ 6న కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఢిల్లీ రావడంతో క్షేత్రస్థాయి ఆందోళనలు ప్రారంభం కాగా, ఈ నెల 20న పార్లమెంటు మార్చ్ ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత కాక్రోచ్ పార్టీ మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ తోపాటు పట్నా, భోపాల్ వంటి నగరాల్లో యువత సాగించిన సెటైరిక్ నిరసనలు కూడా వైరల్ అయ్యాయి. విద్యామంత్రి రాజీనామాతో ఆందోళనల్లో వ్యంగ్యం కూడా పనికొస్తుందని నిరూపించినట్లు అయిందని అంటున్నారు. జెన్ జీ నడిపిన ఈ ఉద్యమంలో వ్యంగ్యం హైలెట్ కావడమే విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా జెన్ జీ యువత ఆందోళనలు హింసకు తావివ్వగా, మన దేశంలో మాత్రం యువత బాధ్యతతో వ్యవహరించడమే కాకుండా, వ్యంగ్యం ద్వారా ప్రభుత్వానికి ఒత్తిడికి గురిచేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అత్యంత సెటైరికల్ గా, సృజనాత్మకతతో కూడిన నిరసనలతో ఆకట్టుకున్నారని అంటున్నారు. “హింసతో కాదు, వ్యంగ్యంతో, సెటైర్లతో రాజకీయ వ్యవస్థను కదిలించవచ్చని జెన్-జీ నిరూపించిందని అభిప్రాయపడుతున్నారు. ఎంత అణచివేసినా మళ్లీ పుట్టుకొచ్చే కాక్రోచ్‌ల వలె తమ డిమాండ్లు ఎప్పటికీ చావవు అనే నినాదంతో యువత చేపట్టిన ఈ పోరాటం విజయవంతమైందని అంటున్నారు. సిస్టమ్‌ను ఎంత మార్చాలని చూసినా పాత పద్ధతులే పునరావృతమవుతున్న తరుణంలో ఎక్కడికక్కడ చొరబడే కాక్రోచ్‌ల స్వభావాన్ని తమ నిరసన అస్త్రంగా మలచుకున్నారు.

విద్యార్థుల వినూత్న నిరసనలు

ఢిల్లీతో పాటు దేశంలోని పలుచోట్ల విద్యార్థులు ప్రదర్శించిన నిరసనాస్త్రాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సంప్రదాయ ధర్నాలు, రాస్తారోకోలకు పూర్తి భిన్నంగా జెన్-జీ యువత అత్యంత సృజనాత్మక పద్ధతులను ఎంచుకున్నారని, తద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించి విద్యామంత్రి రాజీనామాకు ఒత్తిడి తీసుకువచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నిరసనల్లో ప్రధాని మోదీ క్యాబినెట్‌పై సెటైర్లు హైలెట్ గా నిలిచాయని అంటున్నారు. "మోదీ క్యాబినెట్‌ (మంత్రివర్గం) కంటే ఐకియా స్టోర్‌లో దొరికే క్యాబినెట్‌ (అల్మారా) చాలా బాగుంటుంది" అంటూ ఓ యువతి వ్యంగ్యంగా ప్లకార్డును ప్రదర్శించడం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అదేవిధంగా జంతర్‌మంతర్‌ వద్ద ఫుట్‌పాత్‌పై పరీక్ష హాల్‌లో పరీక్ష రాస్తున్నట్టుగా, ఆ పక్కనే ప్రశ్నపత్రాలు అమ్ముతాం అంటూ మరికొందరు తిరుగుతూ వీధి నాటకాలు వేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.

బిహార్‌లోని పట్నాలో పోలీసులు వాటర్‌ క్యానన్లు ప్రయోగిస్తే.. ఆందోళన చేస్తున్న విద్యార్థుల్లో చాలా మంది ఆ నీటి కింద తడుస్తూ, డ్యాన్సులు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. ఒకచోట విద్యార్థులను భద్రతా బలగాలు వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళుతుండగా.. మరికొందరు విద్యార్థులు ఆపి, వ్యాన్‌ వెనుకవైపు తలుపు తెరిచారు. లోపలున్న విద్యార్థులంతా కిందికి దిగి, ఎలాంటి ఆవేశపూరిత నినాదాలు, వాదనలేమీ చేయకుండా పాటలు పెట్టుకుని అంతా డ్యాన్స్‌ చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ నెల 20న విద్యార్థులపై భద్రతా బలగాలు భారీగా లాఠీచార్జి చేసిన తర్వాత బలగాలు తిరిగి వెళుతుంటే.. ‘చాలా మంచి పనిచేశారు, ఇంటికి వెళ్లాక విద్యార్థులను కొట్టామని మీవాళ్లకు చెప్పండి’ అంటూ చప్పట్లు కొడుతూ సాగనంపారు.

అదేవిధంగా భద్రతా బలగాలు గన్‌లతో గస్తీకాస్తుంటే.. జెన్‌ జీ నిరసనకారులు తాగిపడేసిన కూల్‌డ్రింక్‌ టిన్నులు, సిగరెట్‌ పెట్టెలను తెల్లటి టేప్‌తో అంటించి గన్‌లా తయారు చేసి, మా వద్దా తుపాకులు ఉన్నాయంటూ వ్యంగ్య నిరసనలు తెలిపారు. ఢిల్లీలో ఒక చోట టియర్‌గ్యాస్‌ గన్‌ పట్టుకున్న జవాను వద్దకు కొందరు విద్యార్థులు వెళ్లి, ‘‘ఇది టియర్‌ గ్యాస్‌ గన్‌ కదా సర్‌.. మేం ఎన్నడూ చూడలేదు. ఒక్కసారి ప్రయోగించండి, కనీసం పనిచేస్తుందో, లేదో అయినా టెస్ట్‌ చేయండి’’ అని వెంటపడ్డారు. దీంతో సదరు జవాను నవ్వుతూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం కూడా తీవ్ర ఒత్తిడికి గురైందని అంటున్నారు.

ఈ విభిన్నమైన నిరసనా పద్ధతులు రాజకీయ నాయకులను, పోలీసులను సైతం ఆశ్చర్యపరిచాయి. హింసాయుత మార్గాలను పూర్తిగా పక్కన పెట్టి, కేవలం సెటైరిక్ అస్త్రాలతోనే ప్రభుత్వాలను ఆలోచింపజేయడంలో సక్సెస్ అయ్యారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. సంప్రదాయ నిరసనల శకం ముగిసి, డిజిటల్ యుగపు సెటైరికల్ నిరసనల శకం ప్రారంభమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హింస లేకుండా, కేవలం చురుకైన ఆలోచనలతో ప్రభుత్వాలను కదిలించవచ్చని 'కాక్రోచ్ పార్టీ' నిరూపించి, దేశంలోని కోట్లాది మంది యువతకు రోల్ మోడల్‌గా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు.