Begin typing your search above and press return to search.

జాతీయ రాజకీయాల్లో సరికొత్త సంచలనం.. 'కాక్రోచ్ జనతా పార్టీ' భవిష్యత్తు కార్యాచరణ ఇదే!

ఈ కోర్ కమిటీ సమావేశంలో దేశాన్ని కుదిపేస్తున్న పలు కీలక సామాజిక, ఆర్థిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు దీప్కే వెల్లడించారు.

By:  Tupaki Political Desk   |   5 Aug 2026 3:54 PM IST
జాతీయ రాజకీయాల్లో సరికొత్త సంచలనం.. కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఇదే!
X

జాతీయస్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందనే అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. విద్యార్థులు నిరుద్యోగుల సమస్యపై గళం విప్పి, కేంద్ర మంత్రితో రాజీనామా చేయించిన సీజేపీ తదుపరి అడుగులు ఆసక్తి రేపుతున్నాయి. విద్యార్థులు, యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న సీజేపీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశం ఉందా? అనే చర్చే ఎక్కువగా జరుగుతోంది. అయితే ఈ విషయమై చర్చించేందుకు బుధవారం సీజేపీ నేతలు సమావేశం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ముందు సీజేపీ భవిష్యత్తులో ఏం చేయబోతుందనే అంశంపై వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, ప్రభుత్వాలను నిలదీసే బలమైన ప్రజా గొంతుకగా నిలవాలని తాము నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యవస్థలపై నమ్మకం తగ్గుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై గళం విప్పేందుకు తాము అడుగులు వేస్తామని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి ‘ప్రెజర్ గ్రూప్’గానే ఉంటాం..

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరుగుతున్న సీజేపీ కోర్ కమిటీ సమావేశం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ కీలక భేటీకి ముందు.. పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే పార్టీ భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టతనిచ్చారు. దేశంలో ఇప్పటికే వందల సంఖ్యలో రాజకీయ పార్టీలు ఉన్నాయని, కానీ నిరుద్యోగం, పాలనా వైఫల్యాలు మాత్రం అలాగే ఉంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులలో ఒక రాజకీయ పార్టీగా కంటే శక్తివంతమైన ‘ఒత్తిడి సమూహం’ (ప్రెజర్ గ్రూప్) ఎంతో అవసరమని అభిజిత్ దీప్కే తేల్చిచెప్పారు. ప్రజాక్షేమం కోసం ప్రభుత్వాలు, వ్యవస్థలపై నిరంతరం ఒత్తిడి తెచ్చే బలమైన గొంతుకగా తమ వేదిక మారుతుందని ఆయన సంకేతాలు ఇచ్చారు.

ఈ కోర్ కమిటీ సమావేశంలో దేశాన్ని కుదిపేస్తున్న పలు కీలక సామాజిక, ఆర్థిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు దీప్కే వెల్లడించారు. ముఖ్యంగా మీడియా, న్యాయవ్యవస్థ వంటి కీలక ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో క్రమంగా తగ్గిపోతున్న విశ్వాసంపై లోతుగా చర్చించాల్సివుందన్నారు. దేశ యువతను వేధిస్తున్న తీవ్రమైన నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇథనాల్ కలిపిన ఇంధన విధానం, దాని ప్రభావాలపై కూడా చర్చలు జరుపుతామన్నారు.

మార్గదర్శిగా సోనమ్ వాంగ్ చుక్

సీజేపీకి ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ మెంటర్‌గా వ్యవహరిస్తారని పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటంలో ఆయన సలహాలు, మార్గదర్శకాలను సీజేపీ నిరంతరం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా పరీక్ష పేపర్ లీకేజీలు, విద్యా రంగంలోని లోపాలకు వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులపై పెట్టిన అక్రమ ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలవాలని భావిస్తున్న సీజేపీ.. రానున్న రోజుల్లో దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చూడాల్సివుందని అంటున్నారు.