Begin typing your search above and press return to search.

ఏపీ పాలిటిక్స్‌లో ఇలాంటి 'హైలెట్స్‌' మంచివేనా ..!

కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నా వారిలో కొంతమంది వివాదాల‌ దిశగా అడుగులు వేస్తున్నారు. వివాదాలతోనే హైలెట్ అవ్వాలని చూస్తున్నారు

By:  Garuda Media   |   2 Feb 2026 6:00 AM IST
ఏపీ పాలిటిక్స్‌లో ఇలాంటి హైలెట్స్‌ మంచివేనా ..!
X

కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నా వారిలో కొంతమంది వివాదాల‌ దిశగా అడుగులు వేస్తున్నారు. వివాదాలతోనే హైలెట్ అవ్వాలని చూస్తున్నారు. సహజంగా ఒకప్పుడు ప్రజలకు చేరువ కావడం, వారికి పనులు చేయడం నియోజకవర్గం అభివృద్ధి చేయడం ద్వారా నాయకులు హైలెట్ అయ్యారు. అదేవిధంగా ప్రజా నేతలుగా ఎదిగేవారు. ఇది అందరికీ మేలు చేసిన పరిణామం. కానీ, రాను రాను వివాదాస్పద నాయకులు నిరంతరం చర్చల్లో ఉండడం.. తెలిసిందే.

ఒక ర‌కంగా చెప్పాలంటే.. వివాదం ఉంటేనే ప్రజలు గుర్తిస్తారు అన్న విధంగా పరిస్థితులు మారిపోవడంతో చాలామంది నాయకులు ఇప్పుడు వివాదాల చుట్టూ తిరుగుతున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతు న్నాయి. గడిచిన 18 నెలల కాలంలో దాదాపు 9 మంది నాయకులపై తీవ్ర స్థాయిలో వివాదాలు చలరేగాయి. వీటిలో లైంగిక వేధింపులు కావచ్చు, మహిళల ఆరోపణలు కావచ్చు, ఇతర వివాదాలు కావచ్చు, ఏదైన‌ప్పటికీ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు.

ఇక మధ్య స్థాయిలో అంటే సొంత పార్టీలోనే వివాదాలు పెట్టిన నాయకులు... వివాదానికి దారితీసిన నాయకులు కొందరు ఉన్నారు. ఇలాంటివారి విష‌యంలో పార్టీ కొంతవరకు సంయమనం పాటిస్తున్నా.. చర్యలు తీసుకోకపోవడంతో మరింత మంది రెచ్చిపోతున్నారనే వాదన టిడిపిలో వినిపిస్తోంది. ఇక‌, జనసేన కూడా గత కొంతకాలంగా వివాదాల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. మహిళా డాన్స్ మాస్టర్ వివాదంలో జానీ మాస్టర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

అదేవిధంగా తిరుపతికి చెందిన కిరణ్ రాయల్, పోలవరానికి చెందిన మరొక ముఖ్య నాయకుడు వివాదాల్లోనే చిక్కుకున్నారు. తాజాగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇట్లా ప్రస్తుతం కూటమిలో కొంతమంది నాయకుల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వానికి మచ్చలు మరకలు ఏర్పడుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం వైసీపీ పాలనను మరిపించేలాగా ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే కొంతమంది నాయకులు మాత్రం వారి వ్యవహార శైలిని మార్చుకోకపోగా వివాదాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే హైలెట్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమికి ఇబ్బందులు తప్పడం లేదు. మరి దీన్ని ఎలా చూస్తారు.. ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాలి.