ఒకే గదిలో అమ్మాయి.. అబ్బాయి.. కరెక్టేనా? చివరికి పోలీస్ స్టేషన్ దారేనా?
ఓ నమ్మకమైన సర్వే ప్రకారం.. భాగ్యనగరంలో దాదాపు 400 హాస్టళ్లలో 70 వేల మందికి పైగా యువతీ యువకులు ఈ సరికొత్త లైఫ్ స్టైల్‌ను ఎంచుకుని ఒకే గదిలో ‘హ్యాపీ’గా కాలం గడిపేస్తున్నారట..
By: A.N.Kumar | 16 Jun 2026 9:15 AM ISTఒకప్పుడు బ్యాచిలర్స్ హైదరాబాద్ వస్తే "అన్నయ్యా.. ఒక చిన్న సింగిల్ రూమ్ దొరుకుతుందా?" అని అడిగేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. "రూమ్ దొరుకుతుందా?" అనేది పాత ప్రశ్న.. "రూమ్‌మేట్ అమ్మాయా? అబ్బాయా?" అనేదే ఇప్పటి నయా ట్రెండ్. నగరంలో కో-లివింగ్.. సహజీవనం.. షేర్డ్ అకామడేషన్ పేర్లతో సరికొత్త కల్చర్ సాఫ్ట్‌వేర్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ఓ నమ్మకమైన సర్వే ప్రకారం.. భాగ్యనగరంలో దాదాపు 400 హాస్టళ్లలో 70 వేల మందికి పైగా యువతీ యువకులు ఈ సరికొత్త లైఫ్ స్టైల్‌ను ఎంచుకుని ఒకే గదిలో ‘హ్యాపీ’గా కాలం గడిపేస్తున్నారట..
మొదట్లో ‘నెట్‌ఫ్లిక్స్’.. ముగింపులో ‘పోలీస్ స్టేషన్’
మొదట్లో అంతా రంగులమయంగానే ఉంటుంది. "నీ కాఫీ.. నా కాఫీ", "నీ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్.. నా నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్.. నీ ఈఎంఐ.. నా ఈఎంఐ కాదులే" అంటూ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ రేంజ్‌లో లైఫ్ సాగిపోతుంది. సోషల్ మీడియాలో #BestCouple, #LivingTogether అంటూ హార్ట్ సింబల్స్‌తో ఫొటోలు అప్‌లోడ్ అవుతుంటాయి. చూసేవాళ్లకు వీళ్లే కదా ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అనిపిస్తుంది. కానీ కాలక్రమేణా అసలు సినిమా మొదలవుతుంది.
స్వేచ్ఛతో మొదలై.. ‘ఫ్రిజ్‌లో చికెన్ బిర్యానీ’ దగ్గర ఘర్షణ
మొదట్లో "స్వేచ్ఛ"గా.. ఎవరి లైఫ్ వారిది అన్నట్టుగా మొదలైన ఈ సంబంధం.. మెల్లగా "నువ్వెక్కడికి వెళ్లావు?" "ఆ టైమ్‌లో ఎవరితో చాటింగ్ చేస్తున్నావు?" "నైట్ అంతా ఎవరితో ఫోన్ మాట్లాడావు?" అనే 24/7 సిఐడి విచారణ స్థాయికి చేరుకుంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కొన్ని గదుల్లో ప్రేమ కంటే ఫ్రిజ్‌లో దాచుకున్న చికెన్ బిర్యానీని పార్టనర్ సైలెంట్‌గా లాగించేయడమే పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూగా మారుతోందట.. "నా ఫుడ్ ఎవరు తిన్నారు?" అనే చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానలా మారి బ్రేకప్స్ దాకా దారితీస్తోంది. "ప్రేమలో కలిసినవాళ్లు... చివరికి పీఎస్‌లో మళ్లీ కలుస్తున్నారంటే, హైదరాబాద్ ట్రాఫిక్ తర్వాత ఇదే మన సిటీకి నయా ట్రెండ్ అనుకుంటా" అని ఒక నెటిజన్ వేసిన సెటైర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
లాయర్లుగా మారుతున్న ప్రేమికులు.. తలబాదుకుంటున్న ఓనర్లు
ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఎవరూ "టర్మ్స్ అండ్ కండిషన్స్" చదవరు. ఈ కో-లివింగ్ రిలేషన్‌షిప్‌లో కూడా అంతే.. మొదట్లో రూల్స్ మాట్లాడరు కానీ ముగిసే సమయంలో మాత్రం ఇద్దరూ సుప్రీంకోర్టు లాయర్ల మాదిరిగా మారిపోతారు. ఏడాది కిందటి పాత వాట్సాప్ చాట్‌లు, స్క్రీన్‌షాట్‌లను డిజిటల్ ఆధారాలుగా చూపిస్తూ కొట్టుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం వరకు హ్యాపీగా ఉన్న జంటలు.. ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో క్యూ కట్టి "సార్... అసలు విషయం ఏంటంటే..." అంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు ఇచ్చుకుంటున్నారు.
మరోవైపు హాస్టల్, పీజీ నిర్వాహకులు కూడా ఈ కొత్త తలనొప్పితో సగం చచ్చిపోతున్నారు. ఒకప్పుడు రూమ్‌ల నుంచి "సార్.. వాటర్ ప్రాబ్లం".. "వైఫై రావడం లేదు" అని కాల్స్ వచ్చేవి. ఇప్పుడు మాత్రం అర్థరాత్రి వేళ "సార్... నా రూమ్‌మేట్‌తో పెద్ద ప్రాబ్లం వచ్చింది.. వెంటనే రండి" అంటూ పంచాయితీ కాల్స్ ఎక్కువయ్యాయట..
నిపుణుల వార్నింగ్.. రూల్స్ మారినా.. రూట్ మారకూడదు
ఈ వ్యవహారంపై సైకాలజిస్టులు, లీగల్ నిపుణులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ట్రెండ్స్ మారినా కో-లివింగ్ పేర్లు పెట్టినా.. ఏ బంధానికైనా పరస్పర గౌరవం, బాధ్యత, స్పష్టత అనేవి బ్రేకులు లాంటివి. అవి లేకపోతే "కో-లివింగ్" పేరుతో మొదలైన లవ్ జర్నీ, కాస్తా రూట్ మారి "కో-కంప్లైంట్"గా మారి నేరుగా పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కడం ఖాయమని తేల్చి చెబుతున్నారు. సో.. రూమ్ షేర్ చేసుకునే ముందు కాస్త జాగ్రత్త సుమా..
