Begin typing your search above and press return to search.

దళపతి విజయ్ సాహసోపేత నిర్ణయం.. 'తమిళ తాయ్ వాజ్తు’పై అసెంబ్లీలో తీర్మానం

'తమిళ తాయ్ వాజ్తు' గీతానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ గీతాన్ని ప్రముఖ కవి మనోన్మయం సుందరం పిళ్లై 1891లో రచించిన ప్రఖ్యాత నాటకం 'మనోన్మయం' నుంచి స్వీకరించారు.

By:  Tupaki Political Desk   |   10 Aug 2026 11:46 AM IST
దళపతి విజయ్ సాహసోపేత నిర్ణయం..  తమిళ తాయ్ వాజ్తు’పై అసెంబ్లీలో తీర్మానం
X

తమిళనాడులో అధికారిక కార్యక్రమాలు, విద్యాసంస్థల్లో రాష్ట్ర గీతానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ గీతం కంటే ముందే రాష్ట్ర గీతమైన 'తమిళ తాయ్ వాజ్తు'ను తప్పనిసరిగా ఆలపించాలని స్పష్టం చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అసెంబ్లీలో అన్ని పార్టీల నుంచి ఏకగ్రీవ మద్దతు లభించింది.

ఈ నిర్ణయం వెనుక బలమైన సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం ఉందని చెబుతున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. అధికారిక వేడుకల్లో తొలుత వందేమాతరం గీతాన్ని, ఆ తర్వాత జాతీయ గీతం జన గణ మన ఆలపించాలని, రాష్ట్ర గీతాలను ఆ తర్వాతే ఉంచాలని సూచించిన నేపథ్యంలో తమిళనాడులో దీనిపై చర్చ చెలరేగింది. కొన్ని విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవ వేడుకల్లో 'తమిళ తాయ్ వాజ్తు'కు మూడవ స్థానం కేటాయించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సాంస్కృతిక, భాషా హక్కుల పరిరక్షణే లక్ష్యంగా సీఎం విజయ్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

'తమిళ తాయ్ వాజ్తు' గీతానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ గీతాన్ని ప్రముఖ కవి మనోన్మయం సుందరం పిళ్లై 1891లో రచించిన ప్రఖ్యాత నాటకం 'మనోన్మయం' నుంచి స్వీకరించారు. తమిళనాడులో ప్రతి ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభంలోనూ 'తమిళ తాయ్ వాజ్తు'ను మొదటిగా ఆలపించే సంప్రదాయాన్ని 1970లో అప్పటి సీఎం కరుణానిధి ప్రభుత్వం అధికారికంగా తీసుకువచ్చింది. దశాబ్దాల ఈ సంప్రదాయానికి కొనసాగింపుగా, గత డీఎంకే ప్రభుత్వం 2021 డిసెంబర్ 12న దీనికి అధికారికంగా 'రాష్ట్ర గీతం' హోదాను కల్పించింది.

అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సీఎం విజయ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మన మాతృభాష మన కన్నతల్లి అంత పవిత్రమైనదని, తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది ప్రతి తమిళుడి ప్రాణం, భావోద్వేగం అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు గడ్డపై 'తమిళ తాయ్ వాజ్తు'కు ఎప్పుడూ ప్రథమ స్థానమే దక్కాలని, దానికి మొదటి స్థానం ఇవ్వడం రాష్ట్ర హక్కు అని స్పష్టం చేశారు. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులందరూ ఈ తీర్మానాన్ని బలపరచగా, సభ దీనిని ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ తాజా నిర్ణయంతో ఇకపై తమిళనాడులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల అధికారిక కార్యక్రమాల్లో తొలుత 'తమిళ తాయ్ వాజ్తు', ఆ తర్వాతే జాతీయ గీతాలకు సంబంధించిన నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అమలవుతాయని స్పష్టమైంది. తమిళ అస్తిత్వం, భాషా గౌరవాన్ని కాపాడే దిశగా సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణాది రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.