Begin typing your search above and press return to search.

తిరుచ్చి ఈస్ట్ ను విజయ్ ఎందుకు వదిలేశారు?

తనను అక్కున చేర్చుకున్న తిరుచ్చి తూర్పు నియోజకవర్గాన్ని వదిలేయటం ద్వారా అక్కడి ఓటర్లు నిరాశకు గురి కావటం ఖాయం.

By:  Garuda Media   |   11 May 2026 11:07 AM IST
తిరుచ్చి ఈస్ట్ ను విజయ్ ఎందుకు వదిలేశారు?
X

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సి. జోసెఫ్ విజయ్ కాసేపటికే కీలక నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తిరుచ్చి తూర్పు.. పెరంబూర్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయటం.. ఈ రెండింటిలోనూ గెలుపొందటం తెలిసిందే. అయితే.. చెన్నై మహా నగరంలోని భాగమైన పెరంబూర్ ను అట్టి పెట్టుకొని.. తాను గెలిచిన రెండో నియోజకవర్గానికి(తిరుచ్చి తూర్పు) రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే ఆయన తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు.. తన రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటరీకి పంపేశారు.

నిజానికి తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి రాజీనామా చేయాలని ప్రమాణ స్వీకారానికి ముందే నిర్ణయాన్ని తీసున్నప్పటికి.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కాసేపటికే తన రాజీనామా లేఖను తన మంత్రివర్గ సహచరులైన కేఏ సెంగోట్టయ్యన్.. పి. వెంకటరామన్ ద్వారా అసెంబ్లీ కార్యదర్శికి పంపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాసేపటికే ఆయన తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇదొకటిగా చెప్పొచ్చు. ఎందుకంటే.. దీనికి చాలానే అంశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం విజయ్ రాజకీయ వ్యూహాత్మక చతురతకు నిదర్శనంగా చెబుతున్నారు.

ఒక వ్యక్తి రెండు స్థానాల్లో ఎమ్మెల్యేగా ఉండకూదన్న ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని గౌరవిస్తూ.. పాలనా పగ్గాలు చేపట్టగానే నిబంధనల ప్రకారం తీసుకున్న ఈ నిర్ణయంలో ఆసక్తికర అంశాలకు లోటు లేదనే చెప్పాలి. పైకి ఒక స్థానానికి రాజీనామా చేసి.. మరో స్థానాన్ని నిలుపుకున్నట్లు కనిపించినా..ఆయన తీసుకున్న నిర్ణయం విజయ్ రాజకీయ పరిణితికి నిదర్శనంగా చెబుతున్నారు. ఎందుకంటే.. తనను గెలిపించిన రెండు నియోజకవర్గాల్లో ఒకటి అట్టి పెట్టుకొని.. రెండో దానికి రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు.. సదరు నియోజకవర్గ ప్రజలు ఒకింత నిరాశకు గురి కావటం ఖాయం.

తనను అక్కున చేర్చుకున్న తిరుచ్చి తూర్పు నియోజకవర్గాన్ని వదిలేయటం ద్వారా అక్కడి ఓటర్లు నిరాశకు గురి కావటం ఖాయం. ముఖ్యమంత్రి తమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే.. ఎవరు మాత్రం సంతోషించరు. కాకుంటే.. సీఎంగా విజయ్ అత్యధిక సమయం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరంలో ఉంటారు. అలాంటప్పుడు చెన్నైకు దాదాపు 350కి.మీ. దూరంలో ఉండే తిరుచ్చి తూర్పుస్థానాన్ని అట్టి పెట్టుకునే కన్నా.. చెన్నై మహా నగర పరిధిలోని పెరంబూరును అట్టి పెట్టుకోవటం మేలు.

అంతేకాదు.. విజయ్ పోటీ చేసిన పెరంబూర్.. తిరుచ్చి తూర్పుస్థానాల్లో ఆయనకు భారీ మెజార్టీని కట్టబెట్టింది పెరంబూర్ లోనే కావటం గమనార్హం. తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో విజయ్ 27,416 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తే.. పెరంబూర్ లో 53,715 ఓట్ల మెజార్టీని సొంతం చేసుకున్నారు. అంటే.. తిరుచ్చితో పోలిస్తే రెట్టింపు మెజార్టీ పెరంబూర్ ఓటర్లు కట్టబెట్టారు. అందుకే.. పెరంబూర్ స్థానాన్ని విజయ్ అట్టిపెట్టుకున్నారని చెప్పాలి.

మరో ఆసక్తికర అంశం ఏమంటే.. చెన్నై మహానగరం ద్రవిడ పార్టీలకు కంచుకోట. ముఖ్యంగా డీఎంకేకు మంచి పట్టు ఉంది. అలాంటిది తాజా ఎన్నికల్లో చెన్నై మహానగర పరిధిలోని 16 అసెంబ్లీ స్థానాల్లో 14 స్థానాల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇదో సంచలనం. అలాంటి వేళ.. రాజధాని పరిధిలో పార్టీకి పెద్ద ఎత్తున పట్టు లభించిన వేళలో.. అక్కడి స్థానాన్ని వదులుకోవటం రాజకీయంగా పెద్ద తప్పే అవుతుంది. దీనికి తోడు రాజధాని నగరంలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి సీఎం విజయ్ రాజీనామా చేయటం అక్కడి ప్రజలకు నిరాశను కలిగించినప్పటికి.. దాన్ని అధిగమించేందుకు తిరుచ్చి పట్టణానికి ప్రత్యేక ప్యాకేజీతో పాటు.. పలు డెవలప్ మెంట్ కార్యక్రమాల్ని అక్కడ షురూ చేయటం ద్వారా వారికి కలిగిన నిరాశను బ్యాలెన్స్ చేసే వీలుంది. ఈ వాదనకు తగ్గట్టే సీఎం విజయ్ మాట్లాడుతూ.. తిరుచ్చి తన హృదయానికి ఎంతో దగ్గరైనదన్న వ్యాఖ్య చేయటం ఇక్కడ ప్రస్తావించాలి. అంతేకాదు.. ఆర్నెల్ల వ్యవధిలో జరిగే ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దించి ఆ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటానన్న హామీని ఇవ్వటం చూస్తే.. విజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చెప్పాలి.

విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో తిరుచ్చి తూర్పుతో పోలిస్తే పెరంబూర్ (చెన్నై) రాజకీయంగా అత్యంత క్లిష్టమైన నియోజకవర్గంగా చెబుతారు. దశాబ్దాల తరబడి ఈ నియోజకవర్గం డీఎంకే కంచుకోటగా ఉంది. 2021 ఎన్నికల్లో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్డీ శేఖర్ 55వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంతటి బలమైన నేతను విజయ్ ఇట్టే ఓడించటం మామూలు విషయం కాదు. అందుకే ఆయన తనతోనే పెరంబూర్ నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకున్నారని చెప్పాలి. తిరుచ్చి తూర్పు నియోజకవర్గంతో పోలిస్తే పెరంబూర్ లో గెలుపు విజయ్ పార్టీకి అతి పెద్ద విజయంగా చెప్పాలి. అందుకే.. ఆ స్థానాన్ని తనతో అట్టి పెట్టుకున్నారు సీఎం విజయ్.