Begin typing your search above and press return to search.

కరుణానిధి, జయలలితలను పక్కన పెట్టిన విజయ్

ఇదిలా ఉంటే తమిళనాడు వర్షాకాల అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడు నుంచి ఇద్దరు నేతలనే ఆదర్శంగా తీసుకున్నట్లుగా తన మాటల ద్వారా చెప్పినట్లు అయింది.

By:  Satya P   |   8 Sept 2026 2:37 AM IST
కరుణానిధి, జయలలితలను పక్కన పెట్టిన విజయ్
X

తమిళనాడు రాజకీయాల గురించి ఆలోచిస్తే అందరికీ గుర్తుకు వచ్చేది కరుణానిధి, ఎంజీఆర్. ఇక డీఎంకే పార్టీ స్థాపకుడు అన్నాదురై ఎటూ ఉంటారు. అన్నా డీఎంకే గా కొత్త పార్టీ పెట్టాక ఎంజీఆర్ తో పాటుగా అంత పేరూ తెచ్చుకున్నారు జయలలిత. అక్కడ ఆమె మహిళా ముఖ్యమంత్రిగా తమిళనాడును పాలించి కొత్త రికార్డు సృష్టించారు. జయలలిత ఓటమి నుంచి విజయాలకు వేసుకున్న బాటలు ఈ రోజుకీ ఒక చరిత్రగా ఉంటాయి. కరుణానిధి అయితే ఓటమి అన్నది తన జీవితంలో ఎరగని నాయకుడు. ఆయన ఏకంగా 13 సార్లు ఎమ్మెల్యేగా కరుణానిధి విజయం సాధించడం మామూలు విషయం కాదు, దేశ రాజకీయాల్లో ఇది ఒక పెద్ద సంచలనం కూడా. 1957లో కుళితలై నియోజకవర్గం నుండి ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన మరణించే వరకు అంటే 2018 తమిళనాడు శాసనసభలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆయన తమిళనాడు రాష్ట్రానికి అయిదు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి, దాదాపు 20 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు.50 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. రాజకీయ వ్యూహకర్తగా, గొప్ప రచయితగా, తమిళనాట ద్రవిడ ఉద్యమ సిద్దాంతకర్తగా కరుణానిధి సాధించిన ఈ రికార్డు భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది.

ఆమె ఉక్కు మహిళగా :

ఇక జయలలిత గురించి చెప్పాలంటే ఆమె ఉక్కు మహిళగా తమిళనాడు రాజకీయాల్లో నిలిచిపోయారు. ఎంజీఆర్ మరణం తరువాత ఎన్నో అవమానాలు, రాజకీయ కుట్రలు ఆరోపణలను ఎదుర్కొని ఏఐఏడీఎంకే పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ పార్టీని తమిళనాడులో ఒక తిరుగులేని శక్తిగా మార్చారు. జయలలిత ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్ చౌక ధరకే భోజనం, అమ్మ మంచినీరు, పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు మరియు ఉచిత మిక్సీ గ్రైండర్ల పంపిణీ వంటి పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. తమిళనాడు ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ పొందిన ఆమె ఏకంగా ఆరు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు.ఆమె కఠినమైన నిర్ణయాలు, పరిపాలనా దక్షత దేనికీ లొంగని మనస్తత్వం వల్లే ఆమెను అందరూ ఉక్కు మహిళ అని పిలుచుకుంటారు. ఇలా కరుణానిధి జయలలిత ఇద్దరూ తమిళ రాజకీయాల్లో మూడు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించారు.

వారి ప్రస్థావన ఏదీ :

ఇదిలా ఉంటే తమిళనాడు వర్షాకాల అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడు నుంచి ఇద్దరు నేతలనే ఆదర్శంగా తీసుకున్నట్లుగా తన మాటల ద్వారా చెప్పినట్లు అయింది. అందులో ఒకరు అన్నాదురై, రెండవ వారు ఎంజీఆర్, ఇక ఏపీ నుంచి ఎన్టీఆర్ పేరు చెప్పారు. తరువాత తానే అన్నారు. అయితే ఇందులో ఎంజీఆర్ ఎన్టీఆర్ తో విజయ్ పోల్చుకోవడం సబబే. ఎందుకంటే ఈ ముగ్గురూ సినీ నేపథ్యం నుంచి వచ్చిన వారు. అయితే అదే సమయంలో కరుణానిధి కూడా సినీ రంగం నుంచే వచ్చారు, అలాగే జయలలిత కూడా అదే ఫీల్డ్ నుంచి వచ్చి రాజకీయంగా సక్సెస్ అయ్యారు. ఇక తమిళనాడు రాజకీయాల మీద వీరి ముద్ర చాలా బలంగా ఉంటుంది. వీరు సాధించిన విజయాలు అనూహ్యం. ఒకసారి జయలలిత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తానికి మొత్తం స్వీప్ చేస్తే కరుణానిధి మరో సందర్భంలో స్వీప్ చేసి తన సత్తా చాటారు, మరి అలాంటి మేటి నాయకులు అయిన ఈ ఇద్దరి విషయం విజయ్ ప్రస్తావించకపోవడానికి కారణం ఏంటి అంటే జవాబు కూడా దొరుకుతుంది.

ప్రత్యర్ధి పార్టీలుగా :

ప్రస్తుతం విజయ్ కి తమిళనాడులో ప్రత్యర్థి పార్టీలుగా డీఎంకే అన్నా డీఎంకే రెండూ ఉన్నాయి. డీఎంకే అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కరుణానిధిని పొగిడితే డీఎంకేకి అడ్వాంటేజ్ అవుతుంది. జయలలిత గురించి చెబితే అన్నా డీఎంకే క్లెయిం చేసుకుంటుంది. అందుకే విజయ్ తెలివిగా అన్నా దురై ఎంజీఆర్ వరకే పరిమితం అయ్యారు అని అంటున్నారు. ఏది ఏమైనా విజయ్ రాజకీయాల్లో తొలి అడుగులే వేశారు, ఇంకా చాలా ఉంది అని అంటున్నారు. తమిళనాడులో ఈ రోజుకీ జనం గుండెలలో ఉన్న దిగ్గజ నేతలను వారి మరణం తరువాత అయినా గుర్తించడం వల్ల మేలే జరుగుతుంది కానీ రాజకీయంగా ఇబ్బంది ఉండదనే అంటున్నారు. ఇక విజయ్ అసెంబ్లీలో పొలిటికల్ లెజెండ్స్ సరసన తనను పెట్టుకోవడం ఆత్మ విశ్వాసంగా కొందరు అంటూంటే అతి విశ్వాసంగా మరికొందరు అంటున్నారు. ఎవరు లెజెండ్ అన్నది కాలం చెబుతుంది. చరిత్రలో పదిలంగా అవి ఉంటాయని అంటున్నారు.