Begin typing your search above and press return to search.

స్టాలిన్‌ ఇంటికి వెళ్లి కలిసిన సీఎం విజయ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

By:  A.N.Kumar   |   11 May 2026 4:28 PM IST
స్టాలిన్‌ ఇంటికి వెళ్లి కలిసిన సీఎం విజయ్
X

తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం పదవిని చేపట్టిన తర్వాత విజయ్ చేపడుతున్న రాజకీయ చర్యల్లో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన భేటీగా భావిస్తున్నారు. చెన్నైలోని స్టాలిన్ నివాసానికి చేరుకున్న విజయ్‌కు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఇంట్లోకి వెళ్లిన విజయ్‌ను స్టాలిన్ సాదరంగా హగ్ చేసుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత స్నేహపూర్వకంగా మార్చింది. ఇద్దరూ ఒకరినొకరు శాలువాలతో సత్కరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ భేటీ కేవలం మర్యాదపూర్వక సమావేశమేనా? లేక భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కీలక చర్చలకా? అన్నదానిపై తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల్లో డీఎంకే మిత్రపక్షాల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాలిన్, విజయ్ మధ్య జరుగుతున్న ప్రతి సమావేశం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

ప్రస్తుతం తమిళనాడులో గవర్నర్ వ్యవహారశైలి.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై జరుగుతున్న వివాదాలు కూడా రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ముఖ్యంగా గవర్నర్ వర్సెస్

విజయ్ వ్యవహారంలో స్టాలిన్ పరోక్షంగా విజయ్‌కు మద్దతుగా నిలిచారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అలాగే బలనిరూపణలోనూ అటూ ఇటూ అయితే విజయ్ కు డీఎంకే మద్దతు కోసం కూడా అడిగి ఉండవచ్చన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర హక్కులు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. సీఎం హోదాలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజలతో మమేకమవుతున్న తీరు, ప్రతిపక్షాలతో కూడా సానుకూల సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేయడం ఆయన రాజకీయ శైలిని ప్రతిబింబిస్తున్నాయి. మరోవైపు అనుభవజ్ఞుడైన స్టాలిన్‌తో విజయ్ భేటీ కావడం యువ నాయకత్వానికి మార్గదర్శకంగా కూడా భావిస్తున్నారు.

ఈ సమావేశంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. “రాజకీయ విభేదాలు ఉన్నా ప్రజాసమస్యలపై కలిసి పనిచేయాలి”.. “తమిళనాడు అభివృద్ధే ప్రధాన లక్ష్యం కావాలి” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ శక్తులు ఒకే వేదికపైకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

మొత్తానికి విజయ్-స్టాలిన్ భేటీ తమిళనాడు రాజకీయాల్లో కొత్త సంకేతాలను ఇస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవిష్యత్‌లో ఈ స్నేహపూర్వక సంబంధాలు రాష్ట్ర రాజకీయాలను ఏ దిశగా మలుస్తాయో అన్నదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.