Begin typing your search above and press return to search.

జనంలోకి తొలిసారి సీఎం హోదాలో విజయ్ !

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గత ఇరవై రోజులుగా సెక్రటేరియట్ లోనే విధులలో బిజీగా ఉంటూ వచ్చారు.

By:  Satya P   |   1 Jun 2026 12:12 AM IST
జనంలోకి తొలిసారి సీఎం హోదాలో విజయ్ !
X

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గత ఇరవై రోజులుగా సెక్రటేరియట్ లోనే విధులలో బిజీగా ఉంటూ వచ్చారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడింది లేదు. అంతే కాదు అధికారిక పర్యటనలు కూడా ఎక్కడా లేవు. కానీ ఫస్ట్ టైం విజయ్ జనంలోకి వస్తున్నారు. అది కూడా తనకు ఓటేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఆయన ఈ పర్యటనలు పెట్టుకున్నారు. ఇక విజయ్ తాజా ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై పెరుంబుదూర్ అలాగే తిరుచ్చి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసి రెండు చోట్లా బంపర్ మెజారిటీతో గెలిచారు. అయితే ఆయన తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి రాజీనామా చేశారు. దాంతో ఆయన జూన్ ఒకటవ తేదీన తన పర్యటనలో మొదట వెళ్లేది తిరుచ్చి తూర్పు నియోజకవర్గంగా పెట్టుకున్నారు.

వ్యూహాత్మకంగానే :

తనను గెలిపించిన తిరుచ్చి ప్రజలకు విజయ్ ఒక భారీ సభ ద్వారా ధన్యవాదాలు చెప్పనున్నారు. దాని కంటే ముందు ఆయన తిరుచ్చి విమానాశ్రయం నుంచి సభా స్థలి వరకూ ఓపెన్ టాప్ జీపులో రోడ్ షో చేస్తారు అని అంటున్నారు. అనంతరం సెయింట్ జోసెఫ్ కళాశాల మైదానంలో జరిగే సభలో విజయ్ మాట్లాడుతారు. అలా సీఎం అయిన తరువాత ఆయన తిరుచ్చి ప్రజలతో ఏం చెప్పబోతున్నారు అన్నది చర్చగా ఉంది. అయితే మరి కొద్ది నెలలలో తిరుచ్చికి ఉప ఎన్నికలు వస్తున్నాయి. తనకు భారీ మెజారిటీ అందించినట్లుగానే రేపటి రోజున తన పార్టీ అభ్యర్థిగా నిలబడిన వారికి కూడా అధిక మెజారిటీని ఇవ్వాలని జనాలను కోరే ముందుగా నిర్వహించే భారీ సభ ఇది అని అంటున్నారు. వ్యూహాత్మకంగానే విజయ్ తిరుచ్చి నుంచే తన అధికారిక టూర్ మొదలెడుతున్నారు అని అంటున్నారు.

వరస పర్యటనలు :

ఇక తిరుచ్చితో మొదలెట్టి అనంతరం వరసగా వివిధ జిల్లాల పర్యటనలను విజయ్ చేపడతారు అని టీవీక పార్టీ అధికార వర్గాలు తెలిపాయి.ఈ సందర్భంగా తమ పార్టీకి అధికారం అప్పగించిన ప్రజలకు విజయ్ కృతజ్ఞతలు తెలియచేస్తారు అని అంటున్నారు అలాగే తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి చెబుతూంతే గడచిన కాలంలో సీఎం గా తాను చేసిన పనుల గురించి కూడా వివరిస్తారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే సీఎం గా విజయ్ తన మనసులో మాటలను ఎక్కడా పంచుకోలేదు, మీడియా ముందుకు సైతం రాలేదు. దాంతో ఆయన ఏమి చెప్పినా ఆసక్తికరంగానే ఉంటుంది అని అంటున్నారు. అదే విధంగా విజయ్ తమ ప్రభుత్వం ఏమి చేయబోతోంది అన్నది కూడా జనాలకు వివరించడం కార్యాచరణ ప్రణాళికను సైతం జనాలకు వివరించడం ద్వారా ప్రభుత్వం మీద సానుకూల వాతావరణం మరింతగా ఏర్పడేలా చూసుకుంటారు అని అంటున్నారు.